Share News

గిద్దలూరు వైసీపీలో సరికొత్త ట్విస్ట్‌

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:45 PM

గిద్దలూరు వైసీపీలో సరికొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. గిద్దలూరు, మార్కాపురం ఎమ్మెల్యేలను అటు,ఇటు మార్చే ప్రయత్నాలకు అధిష్ఠానం శ్రీకారం పలకగా స్థానిక నాయకులు అప్రమత్తమయ్యారు. మరోసారి స్థానికేతర అభ్యర్థిని నిలిపితే సహకరించబోమంటూనే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని అయితే మాత్రం ఓకే అని చెప్పేశారు. స్థానికేతరులు వద్దు అంటూనే వారు బాలినేని మాత్రం ముద్దు అనడంలో ఆంతర్యం ఏమిటన్న చర్చ ఆరంభమైంది. అయితే తనపేరును ఎందుకు ప్రస్తావించారంటూ బాలినేని అక్కడి నాయకులకు ఫోన్‌చేసి సీరియస్‌ అయినట్లు సమాచారం.

గిద్దలూరు వైసీపీలో  సరికొత్త ట్విస్ట్‌
బేస్తవారిపేటలో సమావేశమైన వైసీపీ ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు

స్థానికేతరులు వద్దు అంటూనే బాలినేనికి మద్దతు

క్లైమాక్స్‌లో ఉత్కంఠ

తన పేరు ప్రస్తావనపై మాజీ మంత్రి సీరియస్‌

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

గిద్దలూరు వైసీపీలో సరికొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. గిద్దలూరు, మార్కాపురం ఎమ్మెల్యేలను అటు,ఇటు మార్చే ప్రయత్నాలకు అధిష్ఠానం శ్రీకారం పలకగా స్థానిక నాయకులు అప్రమత్తమయ్యారు. మరోసారి స్థానికేతర అభ్యర్థిని నిలిపితే సహకరించబోమంటూనే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని అయితే మాత్రం ఓకే అని చెప్పేశారు. స్థానికేతరులు వద్దు అంటూనే వారు బాలినేని మాత్రం ముద్దు అనడంలో ఆంతర్యం ఏమిటన్న చర్చ ఆరంభమైంది. అయితే తనపేరును ఎందుకు ప్రస్తావించారంటూ బాలినేని అక్కడి నాయకులకు ఫోన్‌చేసి సీరియస్‌ అయినట్లు సమాచారం.

నేతల ప్రత్యేక సమావేశం

వీరు సమావేశమైన గదిలో మీడియాతో మాట్లాడుతుండగా వేరేగదిలో టికెట్‌ ఆశిస్తున్న నాయకుల్లో కొందరు భేటీ అయ్యారు. రమణారెడ్డి, చంద్రశేఖరరెడ్డి, డాక్టర్‌ బ్రహ్మానందరెడ్డి అలాగే లింగారెడ్డి సోదరుడు తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. వారంతా కూడా మనలో ఒకరిమే టికెట్‌ తెచ్చుకోవాలన్న నిర్ణయంతో ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. టికెట్‌ ఆశిస్తూ రేసులో ఉన్నవారిలో ఐవీ రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి ఆ సమావేశానికి రాకపోగా వివిధ కారణాలతో వారు అందుబాటులో లేరని చెబుతున్నారు. గిద్దలూరు మండలానికి చెందిన వంశీధర్‌రెడ్డి అనే ముఖ్య నాయకుడు కూడా గైర్హాజరయ్యారు. ఇంకోవైపు స్థానికేతరుడిని పంపవద్దని అంటూనే బాలినేని అయితే మాకు ఓకే అని వారు చెప్పడం చర్చనీయాంశమైంది. ఎలాగూ స్థానికేతరుడిని పంపిస్తున్నారన్న నమ్మకంతో తమకు ఇష్టమైన బాలినేని పేరు అలా చెప్పారా? లేక ఎవరైనా చెప్పించారా? అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ఆదివారం సాయంత్రం విషయం తెలుసుకున్న బాలినేని అక్కడి నాయకులకు ఫోన్‌చేసి తన పేరును ఎందుకు ప్రస్తావించారంటూ మండిపడినట్లు తెలిసింది.

రెడ్డి సమాజికవర్గం నేతలకే ఇవ్వాలని డిమాండ్‌

గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు లేక ఆయన కుమారుడిని మార్కాపురం నుంచి పోటీ చేయించి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని గిద్దలూరు పంపాలని వైసీపీ అధిష్ఠానం భావించింది. సోమ, మంగళవారాల్లో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డితో జగన్‌ మాట్లాడిన తర్వాత ఈ విషయమై తుదినిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో స్థానికేతర నాయకుడికి మరలా అవకాశం ఇవ్వొద్దని, స్థానికుల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలని నియోజకవర్గంలోని నాయకులు డిమాండ్‌ చేయడం ప్రారంభించారు. రెడ్డి సామాజికవర్గానికే అవకాశం ఇవ్వాలని కూడా వారు కోరుతున్నారు. రేపోమాపో అభ్యర్థి ఎంపికపై సీఎం తుది నిర్ణయం తీసుకోనుండటంతో వివిధ రూపాల్లో తన డిమాండ్‌తో అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులోభాగంగా టిక్కెట్‌ ఆశిస్తున్న నియోజకవర్గంలోని రెడ్డి సామాజికవర్గం నాయకులు వెనకుండి నియోజకవర్గంలోని పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీల ద్వారా తన డిమాండ్‌ను వెల్లడించే ప్రక్రియను చేపట్టారు. ఆదివారం బేస్తవారపేటలో వారంతా సమావేశమయ్యారు. అర్థవీడు జడ్పీటీసీ, బేస్తవారిపేట, కొమరోలు ఎంపీపీలు ఆ సమావేశంలో ముఖ్యులుగా కనిపించారు. వారితోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఉన్న మరికొందరు కూడా సమావేశమై మరోసారి నియోజకవర్గేతర నాయకుడిని రంగంలోకి తేవద్దని, అలాచేస్తే తాము సహకరించబోమని తేల్చిచెప్పారు. గత ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే రాంబాబును పోటీకి దింపినా జగన్‌కోసం సహకరించామని అయితే ఆయన మార్కాపురంలో నివాసం ఉంటున్నందున నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు ఇబ్బందిపడ్డారని కొమరోలు ఎంపీపీ బహిరంగంగానే చెప్పారు. నియోజకవర్గ పార్టీలో సత్తా ఉన్న నాయకులు లేనట్లు బయట ఉన్న నాయకులను మాపై ఎందుకు రుద్దుతారని ప్రశ్నించారు.

రాంబాబు స్థానికుడేనంటూ వైసీపీ సోషల్‌ మీడియాలో ప్రచారం

మరోవైపు నియోజకవర్గ వైసీపీ సోషల్‌ మీడియా గ్రూపుల్లో ఎమ్మెల్యే రాంబాబు స్థానికుడే అంటూ పెద్దఎత్తున ఆయన అభిమానులు ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన మార్కాపురంలో స్థిరపడినా నియోజకవర్గంలోని కంభం మండలంలో పుట్టిపెరిగిన వ్యక్తి అని అందులో పేర్కొన్నారు. ఆయన హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, ఆయనను స్థానికుడిగానే తాము గుర్తిస్తున్నామంటూ ఆయన అభిమానులు పెద్దఎత్తున ప్రచారం చేపట్టారు. దీంతో పోటీకి దూరమన్న రాంబాబు తిరిగి పోటీకి సిద్ధంకావటం, మార్కాపురంలో పోటీచేయాలనుకున్న ఆయనకు మద్ధతుగా గిద్దలూరులో స్థానికుడని పోస్టింగ్‌లు పెట్టడం, స్థానికేతరుడు తమకు వద్దని చెప్తున్న నాయకులు బాలినేనికి ఓకే చెప్పటం, తాను మార్కాపురానికి పరిమితమవుతానని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి భీష్మించుకుని కూర్చోవడం తదితర అంశాల నేపథ్యంలో గిద ్దలూరు వైసీపీ అభ్యర్థి ఎంపిక ఏమలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Updated Date - Jan 28 , 2024 | 11:45 PM