Share News

చెరువులకు గండ్లు

ABN , Publish Date - Jun 24 , 2024 | 01:22 AM

బేస్తవారపేట మండలంలోని పలు గ్రామాల్లో చెరువుల పరిస్థితి దయనీయంగా మారింది.

చెరువులకు గండ్లు

బేస్తవారపేట, జూన్‌ 23: బేస్తవారపేట మండలంలోని పలు గ్రామాల్లో చెరువుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏళ్లతరబడి ఈ చెరువుల గండ్లను పూడ్చలేదు. పంట కాలువలు, తూములు ఆధ్వానంగా ఉన్నాయి. గతంలో జరిగిన పనుల్లో నాణ్యత లోపించడంతోపాటు మంజూరైన నిధులను సక్రమంగా చెరువులకు ఉపయోగంచకపోవడంతో ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లోని కొన్ని చెరువులకు వెళ్లే రహదారులు అధ్వానం గా ఉన్నాయి. బేస్తవారపేట మండలంలోని పూసలపాడు గ్రామంలోని చెరువులు రెండు దశాబ్ధల క్రితం నిర్మించారు. కోట్ల రూపాయాలు వెచ్చించారు. అయితే నేటికీ ఆ చెరువుల ఉపయోగంలోకి రాలేదు. చెరువుల కట్ట బలహీనంగా ఉండడంతో చెరువుకు నీరు వచ్చిన ప్రతి ఏటా చెరువుకు గండ్లు పడి ఒకరోజులోనే నీరు వాగుపాలైతుంది. దీంతో 800 ఎకరాల ఆయకట్టు నిరుపయోగంగా మారింది. అయితే ఈ చెరువుకు గతంలో రూ.2కోట్లు ప్రతిపాదనలు పంపారు. అలాగే కోనపల్లె చెరువు ఏర్పడినప్పటి నుండి చెరువులో చుక్కనీరు నిల్వలేదు. పలుమార్లు మరమ్మతులు చేశారు. కోట్లు రూపాయాలు ఖర్చు చేశారు. కాని ఫలితం కనిపించడంలేదు. చెరువులో భూగర్భంలో బుంగలు ఏర్పడి చెరువులోని నీరు పూర్తిగా బయటకు పోతుంది. పలువురు నిపుణులు పరిశీలించి అనేక రకాల పనులు ప్రయోగాత్మకంగా చేసిన ఆశించిన ఫలితం కనిపించడంలేదు. ఫలితంగా 500 ఎకరాల ఆయకట్టు నిరుపయోగంగా మారింది. శింగరపల్లె గ్రామానికి తూర్పువైపున నూతనంగా చెరువుల ఏర్పాటు చేస్తే వందల ఎకరాల్లో పంటలు సస్యశ్యామలంగా పండుతాయని దీంతో రైతుల పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు సర్వేలకే పరిమితమయ్యారు. రూ.11 కోట్ల రూపాయాలతో ప్రతిపాదనలు పంపారు. కాని ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ తీసుకోలేదు. నిధులు మంజూరుకాలేదు. ఫలితంగా వెయ్యి ఎకరాలకుపైగా భూములు బీడు భూములుగా ఉన్నాయి. అలాగే జేసీ అగ్రహారం చెరువుకు పూర్తి పూర్తి స్థాయిలో చెరువు కట్ట ఎత్తు పెంచాల్సి ఉండగా పెంచలేదు. చెరువులో చుక్కనీరులేదు. అలాగే దప్పిలివారి కుంటకు సప్లై ఛానల్‌ కత్వ నుండి నీరు వచ్చే కాలువను అభివృద్ధి చేస్తే చెరువు కింది ఆయకట్టు సాగులోకి వస్తుందని రైతులు కోరుతున్నారు. మోక్షగుండం కొత్తచెరువు, ఖాజీపురం హోసూరమ్మ చెరువుల పంట కాలువుకు మరమ్మతులు, తూములకు మరమ్మతులు చేయా ల్సి ఉంది. అలాగే జెన్నివారిపల్లె చెరువుకు పూర్తి స్తాయిలో మరమ్మతులు నోచుకోక రైతులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. మల్లాపురం చెరువుకు మరమ్మతులు చేసిన చెరువులో నీరు లేక సూమారు 1500 ఎకరాలు సాగులోకి రాలేదు. జగ్గంబోట్ల కృష్ణాపురం ఉప్పువాగు నుండి ఆయకట్టు కాలువను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు. పిటికాయగుళ్ల చెరువుకు రూ.2కోట్లతో పనులు చేసిన ఫలితం సక్రమంగా లేదు. చెరువులో నేటికి చిల్లకంపతో నిండి ఉంది. చెరువుల అక్రమాణాల్లో ఉంది. చెరువులు మరమ్మతులకు నోచుకోక అలాగే ఉన్నాయి. ఈ ఏడాదైన ఈ చెరువులకు మరమ్మతులు నిర్వహించాలని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు.

Updated Date - Jun 24 , 2024 | 01:22 AM