Share News

గ‘లీజు’

ABN , Publish Date - Jun 23 , 2024 | 11:20 PM

వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఐదేళ్లు సాగించిన అడ్డగోలు వ్యవహారాలు బయటపడుతున్నాయి. జగన్‌పాలనలో ఆయన కోసం తాడేపల్లి ప్యాలెస్‌, రిషికొండ ప్యాలె్‌సలు కట్టేసి ప్రజాధనం దుర్వినియోగం చేయగా.. పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం ఒంగోలులో వైసీపీ నేతలు మరింత బరితెగించారు. వారి ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారు. రూ.కోట్ల విలువైన 1.64 ఎకరాల భూమిని కారుచౌకగా లీజుకు కట్టబెట్టారు. పన్నుల చెల్లింపు నుంచి ప్లాన్‌ అనుమతి వరకూ మున్సిపల్‌ ఉన్నతాధికారులు నిబంధనలు సైతం సడలించి స్వామిభక్తిని చాటుకున్నారు. ఇటు పన్ను, అటు ప్లాన్‌ అనుమతికి భారీ రాయితీలు ఇచ్చారు. అయినప్పటికీ వైసీపీ నేతలు తమ వక్రబుద్ధిని ప్రదర్శించారు. నిర్మాణాలకు అనుమతి వచ్చినప్పటి నుంచి పైసా పన్ను చెల్లించకపోవడంతో రూ.14.35లక్షల బకాయి పేరుకుపోయింది. అయినప్పటికీ ఆ కార్యాలయం వద్ద మునిసిపల్‌ అధికారులు ఆరు కొళాయిలు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది.

గ‘లీజు’

అధికారుల సంపూర్ణ సహకారం

ఖాళీ స్థల పన్ను విషయంలో నిబంధనలు సడలింపు

భవన నిర్మాణానికి అనుమతులు వచ్చిన తర్వాత పైసా చెల్లించని ఆపార్టీ నేతలు

ఇప్పటి వరకూ రూ.14.35లక్షల బకాయి

అక్రమంగా కొళాయిలు వేసి స్వామి భక్తిని చాటుకున్న కార్పొరేషన్‌ అధికారులు

వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఐదేళ్లు సాగించిన అడ్డగోలు వ్యవహారాలు బయటపడుతున్నాయి. జగన్‌పాలనలో ఆయన కోసం తాడేపల్లి ప్యాలెస్‌, రిషికొండ ప్యాలె్‌సలు కట్టేసి ప్రజాధనం దుర్వినియోగం చేయగా.. పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం ఒంగోలులో వైసీపీ నేతలు మరింత బరితెగించారు. వారి ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారు. రూ.కోట్ల విలువైన 1.64 ఎకరాల భూమిని కారుచౌకగా లీజుకు కట్టబెట్టారు. పన్నుల చెల్లింపు నుంచి ప్లాన్‌ అనుమతి వరకూ మున్సిపల్‌ ఉన్నతాధికారులు నిబంధనలు సైతం సడలించి స్వామిభక్తిని చాటుకున్నారు. ఇటు పన్ను, అటు ప్లాన్‌ అనుమతికి భారీ రాయితీలు ఇచ్చారు. అయినప్పటికీ వైసీపీ నేతలు తమ వక్రబుద్ధిని ప్రదర్శించారు. నిర్మాణాలకు అనుమతి వచ్చినప్పటి నుంచి పైసా పన్ను చెల్లించకపోవడంతో రూ.14.35లక్షల బకాయి పేరుకుపోయింది. అయినప్పటికీ ఆ కార్యాలయం వద్ద మునిసిపల్‌ అధికారులు ఆరు కొళాయిలు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది.

ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 23 : జగన్‌ ప్రభుత్వం చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఐదేళ్లపాటు అవకాశం ఉన్నచోటల్లా ఇష్టారాజ్యంగా అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన వైసీపీ పెద్దలు.. పార్టీ కార్యాలయ నిర్మాణంలోనూ అవకవతవకలకు పాల్పడ్డారు. ఒంగోలులో అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ స్థలాలను సొంత పార్టీ కార్యాలయానికిమార్చుకోవడమే కాకుండా, కార్యాలయ భవనం పన్ను విధింపుల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారు. అధికార పార్టీ ఆదేశాలకు ప్రభుత్వ అధికారులు సైతం తలూపారు. నగరంలోని దక్షిణ బైసాప్‌ (ఎన్నెస్పీ కార్యాలయం పక్కన) సర్వే నెం. 17లోని ప్రభుత్వ స్థలంలో వైసీపీ జిల్లా కార్యాలయ నిర్మాణంలో అడ్డగోలు వ్యవహారమే నడిచింది. అటు రెవెన్యూ, ఇటు కార్పొరేషన్‌ అధికారులు సైతం సహకరించారు. సుమారు 7,934 చదరపు గజాలు (1.64ఎకరాల) ఎన్నెస్పీ భూమిని రెవెన్యూ అధికారులు వైసీపీకి అప్పనంగా కట్టబెట్టారు. వైసీపీ కార్యాలయానికి కేటాయించిన ఈ భూమి విలువ సుమారు రూ.4.50 కోట్లు ఉంటుంది. ఏడాదికి ఎకరాకు రూ.1000 అద్దె ప్రకారం 33 ఏళ్లు లీజుకు రాసిచ్చారు. జె.వెంకటరెడ్డి అనే వ్యక్తి పేరున ఫైలును నడిపారు. కార్యాలయానికి భూమి కేటాయింపు అనంతరం జరిగిన తతంగంలో అంతా అక్రమాలే జరిగినట్లు తెలుస్తోంది.

పన్ను చెల్లింపుల్లో అవకతవకలు

ఖాళీ స్థలంలో నిర్మాణాలు చేపట్టాలంటే జీవో ప్రకారం మొదటిసారే ఏడు వాయిదాలు ఖాళీ స్థలం పన్ను (వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌) చెల్లించాలి. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత యూసేజ్‌ సర్టిఫికెట్‌ పొందుపరిచి పన్ను తగ్గించుకోవాల్సి ఉంటుంది. అయితే వైసీపీ కార్యాలయ నిర్మాణం విషయంలో రాష్ట్ర పురపాలక శాఖ అధికారులే కథ నడిపించారు. నేరుగా డీఎంఏ కార్యాలయం జోక్యం చేసుకున్నట్లు సమాచారం. ప్లాన్‌ పొందాలంటే పన్ను రశీదు పొందుపరచాల్సి ఉంది. అందుకోసం ఒకేసారి ఏడు వాయిదాల వీఎల్‌టీ చెల్లించాలి. ఈ నేపథ్యంలో డీఎంఏ కార్యాలయం నిబంధనలను సైతం సడలించి వైసీపీ కార్యాలానికి లీజుకు తీసుకున్న భూమికి ఒక వాయిదా పన్ను చెల్లించేలా వెసులుబాటు ఇచ్చింది. అందుకు ఆన్‌లైన్‌లో అవసరమైన మార్పులు చేసినట్లు సమాచారం. పార్టీ పెద్దల ఆదేశాలలో కార్పొరేషన్‌ అధికారులు ఖాళీ స్థలానికి పన్ను ఒక వాయిదాకి రూ.3,42,904 విధించి, అసె్‌సమెంట్‌ నెం.10350652250 కేటాయించారు.

రూ.14.35లక్షల పన్ను బకాయి

జిల్లా వైసీపీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి జె.వెంకటరెడ్డి అనే వ్యక్తి పేరున ఫైలును నడిపారు. ఎన్నెస్పీకి చెందిన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు వైసీపీ పెద్దలకు కట్టబెట్టగా, నిర్మాణ పనులకు కార్పొరేషన్‌ కార్యాలయ అధికారులు సహకరించారు. 24/12/2022న సుమారు 1.64 సెంట్ల భూమికి కార్పొరేషన్‌ అధికారులు ఖాళీ స్థలం పన్ను (వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌) విధించారు. ఒక వాయిదాకి రూ.3,42,904 చెల్లించాల్సి ఉండగా ప్లాన్‌ కోసం డీఎంఏ ఇచ్చిన వెసులుబాటు ప్రకారం ఒక వాయిదా చెల్లించారు. అనంతరం భవన నిర్మాణానికి 2023 జూలై 21వ తేదీన అనుమతులు పొందారు.ఆతర్వాత అసలు పన్ను చెల్లించడం మానేశారు. దీంతో ఇప్పటి వరకు రూ.14,35,060 బకాయి పెండింగ్‌లో ఉంది. కార్పొరేషన్‌ అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలోనే గండిపడింది.

అనుమతుల్లేకుండా కొళాయిలు

సామాన్యులు తాగునీటి కొళాయి కావాలంటే అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే అధికారులు వైసీపీ పెద్దల మెప్పు కోసం స్వామి భక్తిని చాటుకున్నారు. ఖాళీ స్థలంగా ఉండగానే, పన్ను బకాయిలు పేరుకుపోయినప్పటికీ వైసీపీ జిల్లా కార్యాలయానికి సుమారు ఐదు వరకు అక్రమ కొళాయిలు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం ఇంటి పన్ను రశీదు పొందాక కొళాయికి దరఖాస్తు చేసుకుంటే వర్క్‌ ఆర్డరు ఇవ్వాలి. ‘అధికారం మాదే.. అడిగేవారు ఎవరు’ అన్నట్లు వైసీపీ పెద్దలు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఏకంగా ఐదు కొళాయిలు వేసేశారు.

Updated Date - Jun 23 , 2024 | 11:20 PM