Share News

దామచర్ల నామినేషన్‌కు మత్స్యకారుల పాదయాత్ర

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:56 PM

ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ నామినేషన్‌ కార్యక్రమానికి మత్స్యకారులు పోటెత్తారు. కొత్తపట్నం పల్లెపాలెం నుంచి దాదాపు 700 మందికిపైగా బుధవారం ఉదయం ఒంగోలుకు పాదయాత్రగా బయలుదేరి ఆయన నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దామచర్ల నామినేషన్‌కు మత్స్యకారుల పాదయాత్ర
మత్స్యకారుల పాడయాత్ర

వందలాది మంది మత్స్యకారులు నామినేషన్‌ కార్యక్రమానికి హాజరు

టీడీపీకి మత్స్యకారుల్లో పెరుగుతున్న ఆదరణ

ఆ అభిమానం.. మండుటెండను పండువెన్నలగా మార్చింది..!

ఆ తెగువ.. అరికాళ్లు బొబ్బలెత్తుతున్నా ముందుకు సాగినిచ్చింది..!

ఆ అభిమానం.. గొంతు పిడచగట్టుకుపోతున్నా జెండా విడవనంది..!

ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల నామినేషన్‌ కార్యక్రమానికి కొత్తపట్నం పల్లెపాలెం నుంచి మత్స్యకారులు పాదయాత్రగా వచ్చి సంఘీభావం తెలపడం కార్యక్రమానికి హైలైట్‌గా నిలిచింది.

ఒంగోలు నగరం, ఏప్రిల్‌ 24 : ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ నామినేషన్‌ కార్యక్రమానికి మత్స్యకారులు పోటెత్తారు. కొత్తపట్నం పల్లెపాలెం నుంచి దాదాపు 700 మందికిపైగా బుధవారం ఉదయం ఒంగోలుకు పాదయాత్రగా బయలుదేరి ఆయన నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా దామచర్ల జనార్దన్‌ ఎమ్మెల్యేగా కె పల్లెపాలెంలోని మత్స్యకారులకు వందల సంఖ్యలో పడవలు, వలలు ప్రభుత్వం నుంచి సబ్సిడీపై ఇప్పించారు. ఆయన హయాంలో తీర ప్రాంత గ్రామాల్లో రోడ్లు, మంచినీరు, ఇతర అనేక అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేశారు. దీంతో వారు కృతజ్ఞతగా జనార్దన్‌ నామినేషన్‌ కార్యక్రమానికి పాదయాత్రగా వచ్చి సంఘీభావం తెలిపారు. పల్లెపాలెంలో ప్రారంభమైన పాదయాత్ర కొత్తపట్నం, అల్లూరు, చింతల, కొప్పోలు మీదుగా సాగింది. ఒంగోలులోని మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన నామినేషన్‌ ర్యాలీలో మత్స్యకారులు పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా గ్రామగ్రామాన జనార్దన్‌ గెలుపు కోరుతూ ప్రచారం చేశారు. సైకో మళ్లీ వస్తే మన గతి అథోగతే.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబే సీఎం కావాలంటూ ప్రచారం చేశారు. టీడీపీ జెండాలతో కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మండటెండను సైతం లెక్క చేయకుండా పాడయాత్రలో పాల్గొన్నారు. తొలుత పల్లెపాలెంలో టీడీపీ మండల అధ్యక్షుడు ద్వారబాకుల శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎంపీటీసీ సభ్యుడు నరసింహారావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు బాల కోటయ్య, తమ్ము శ్రీను, దేవప్రసాదు, మాజీ సర్పంచి ప్రభుప్రకాష్‌, చాపల జాలరామ్‌, బాంబే శ్రీను పాదయాత్రకు సారథ్యం వహించారు.

Updated Date - Apr 24 , 2024 | 11:56 PM