Share News

మండుటెండలో పడిగాపులు!

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:32 AM

వైసీపీ సభ అంటేనే జనానికి విరక్తి వస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం ఆపార్టీ నేతలు చేస్తున్న జిమ్కిక్కులను చూసి వారు అసహ్యించుకుంటున్నారు. కోడ్‌ రాకముందు వరకు సిద్ధం సభ, పథకాలకు బటన్‌ నొక్కుడు, ఇళ్ల పట్టాలు పంపిణీ.. ఇలా అయినదానికి, కానిదానికి ప్రజలను పరుగులు పెట్టించారు. ఆర్టీసీని సొంత సంస్థలా వాడేశారు. అధికారులు కూడా వారికి వంతపాడుతున్నారు.

మండుటెండలో పడిగాపులు!
ఎర్రగొండపాలెం బస్టాండ్‌లో బస్‌ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు

బస్సులన్నీ సిద్ధం సభకు కేటాయింపు

ముందస్తు సమాచారం లేక ప్రయాణికులకు తప్పని పాట్లు

వైసీపీ తీరుపై ఆగ్రహం

ఒంగోలు (కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 7 : వైసీపీ సభ అంటేనే జనానికి విరక్తి వస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం ఆపార్టీ నేతలు చేస్తున్న జిమ్కిక్కులను చూసి వారు అసహ్యించుకుంటున్నారు. కోడ్‌ రాకముందు వరకు సిద్ధం సభ, పథకాలకు బటన్‌ నొక్కుడు, ఇళ్ల పట్టాలు పంపిణీ.. ఇలా అయినదానికి, కానిదానికి ప్రజలను పరుగులు పెట్టించారు. ఆర్టీసీని సొంత సంస్థలా వాడేశారు. అధికారులు కూడా వారికి వంతపాడుతున్నారు. ఇప్పుడు కూడా అదేపంథాను కొనసాగిస్తున్నారు. ఆదివారం జిల్లాలో జరిగిన సీఎం పర్యటన, కొనకనమిట్ల క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన బహిరంగ సభకు జనాన్ని తరలించేందుకు రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి 1,400 బస్సులు కేటాయించారు. అందులో ఉమ్మడి జిల్లా నుంచి 257 ఉన్నాయి. వాటిలో ఒంగోలు, పొదిలి, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఆర్టీసీ డిపోలకు చెందిన 170 పల్లెవెలుగు బస్సులున్నాయి. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం, ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణణాతీతమయ్యాయి. పల్లెవెలుగు బస్సుల కోసం పడిగాపులు కాశారు. ఒకవైపు ఆదివారం జిల్లాలో 41 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రత నమోదు కాగా మండుటెండలో ప్రజలు పడిగాపులు కాశారు. బస్టాండ్‌లలో గంటల తరబడి ఎదురుచూసిన వారు అటు వైసీపీ నేతలు, ఇటు ఆర్టీసీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిపోల వారీ కేటాయించిన బస్సుల వివరాలు ఇవీ..

సీఎం సభకు రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచి 1,400 బస్సులు కేటాయించారు. అందులో ఒంగోలు డిపో నుంచి 48, మార్కాపురం నుంచి 58, కందుకూరు నుంచి 45, అద్దంకి నుంచి 27, చీరాల నుంచి 22, కనిగిరి నుంచి 7, గిద్దలూరు నుంచి 42, పొదిలి నుంచి 30, మార్కాపురం నుంచి 20 బస్సులు ఉన్నాయి. ఇవి కాక బద్వేలు డిపో నుంచి 20, కడప నుంచి 30, కావలి నుంచి 50, పీలేరు నుంచి 30, సత్యవేడు నుంచి 15, సూళ్లూరుపేట నుంచి 10, నెల్లూరు నుంచి 60, రాజంపేట నుంచి 30, పుత్తూరు నుంచి 15, రాపూరు నుంచి 30, బాపట్ల నుంచి 26, రేపల్లె నుంచి 25, వెంకటగిరి నుంచి 20, గూడూరు నుంచి 20 బస్సులు కేటాయించారు. తిరుపతి డిపో నుంచి 15, శ్రీకాళహస్తి నుంచి 20, మంగళం 15, రాయచోటి నుంచి 40, జమ్మలమడుగు నుంచి 20, పులివెందుల నుంచి 30, ప్రొద్దుటూరు నుంచి 30, ఉదయగిరి నుంచి 30, ఆత్మకూరు నుంచి 8, గుంటూరు నుంచి 110, మంగళగిరి నుంచి 20, పొన్నూరు నుంచి 20, తెనాలి నుంచి 40, కనిగిరి నుంచి 22, పొదిలి నుంచి 30, చిలకలూరుపేట నుంచి 40, మాచర్ల నుంచి 20, నరసరావుపేట నుంచి 30, పిడుగురాళ్ల నుంచి 35, సత్తెనపల్లి నుంచి 30, వినుకొండ నుంచి 45, ఆత్మకూరు నుంచి 32, నెల్లూరు నుంచి 45, కనిగిరి నుంచి 3, మైదుకూరు నుంచి 20 బస్సులు కేటాయించారు. దీంతో ప్రయాణికులకు వెతలు తప్పలేదు.

Updated Date - Apr 08 , 2024 | 12:32 AM