Share News

రైతు‘బంద్‌’!

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:21 AM

రైతుబంధు అన్నదాతలకు అందడం లేదు. అసలు వారు ఆ పథకం ఉందన్న విషయాన్నే మరిచిపోయేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి.

రైతు‘బంద్‌’!
దర్శి మార్కెట్‌ యార్డులో నిర్మిస్తున్న అతిథి గృహం

ఐదేళ్లుగా కర్షకులకు మొండిచేయి

మార్కెట్‌ యార్డులో సోకులకు లక్షలు ఖర్చు

విస్మయం వ్యక్తంచేస్తున్న రైతులు

దర్శి, మార్చి 5 : రైతుబంధు అన్నదాతలకు అందడం లేదు. అసలు వారు ఆ పథకం ఉందన్న విషయాన్నే మరిచిపోయేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. రైతుల ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిన మార్కెట్‌ కమిటీలు సెస్‌ వసూళ్లకు తప్ప వారికి ఏమాత్రం ఉపయోగపడే పనులు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. ఆదాయం పెంచుకోవడంపై ఉన్న యావ రైతుల సంక్షేమంపై లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ ఐదేళ్ల నుంచి రైతుబంధు పథకాన్ని అటకెక్కించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అంతా మూలకే..

దర్శి మార్కెట్‌ యార్డులో కోట్లాది రూపాయల నిధులు ఉన్నప్పటికీ రైతుల అవసరాలకు వినియోగించే వీలులేదు. ప్రభుత్వం ప్రీజింగ్‌ పెట్టడంతో జీతాలకు కూడా ఉన్నతాధికారుల అనుమతులతో తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో రైతులు పండించిన ధాన్యాన్ని గోడౌన్‌లో నిల్వ చేసుకొని రైతుబంధు పథకం కింద వడ్డీలేని రుణాలు పొందేవారు. పంటలకు గిట్టుబాటు ధర రాగానే విక్రయించుకునేవారు. ఇలా ఆరు నెలల పాటు వడ్డీ లేకుండా రుణాలు వాడుకునే వెసులుబాటు టీడీపీ ప్రభుత్వంలో ఉండేది. దీనివల్ల ఎంతోమంది రైతులు లబ్ధిపొందారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుబంధు పథకం పూర్తిగా మూలనపడింది. గత ఐదేళ్లుగా ఒక్కరికి కూడా ఈ పథకం అమలు కాలేదు. మార్కెట్‌ కమిటీలో రూ.4.66 కోట్ల నిధులున్నా వాడే వీలులేదు. సీఎంఎ్‌ఫఎస్‌ ద్వారా ఉన్నతాధికారుల అనుమతులతో ఏ పనులైనా చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

దాదాపు ఖాళీగానే గోడౌన్లు

రైతుబంధు అమలులో లేకపోవటంతో అధికశాతం మంది రైతులు పంట ఉత్పత్తుల ను నిల్వ చేసుకునేందుకు ముందుకురావడం లేదు. కేవలం 100 మందికి చెందిన 11,858 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే నిల్వ ఉంది. రైతులు గిడ్డంగిలో పంటలను నిల్వ ఉంచుకునేందుకు అద్దె చెల్లించాల్సి ఉంది. రైతుబంధు పథకం కింద వడ్డీలు లేని రుణా లు ఇవ్వకపోవటం వలన ప్రయోజనం చేకూరకపోగా అదనంగా అద్దె చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. వైసీపీ పాలకుల తీరుపట్ల అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

యార్డులో అతిథిగృహానికి రూ.లక్షల ఖర్చు

దర్శి మార్కెట్‌ యార్డులో అతిథి గృహ నిర్మాణానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పరిపాలన భవనంపైన అతిథి గృహం ఉంది. ప్రస్తుతం దానిని విస్తరించి సకల సదుపాయాలతో నిర్మిస్తున్నారు. ఇందుకుగాను రూ.24.50 లక్షలు ఖర్చుచేస్తున్నారు. రైతుల ప్రయోజనం కోసం ఎలాంటి పనులు చేపట్టకుండా పాలకుల విలాసాలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తుండటంపై అన్నదాతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన పంట ద్వారా వసూలు చేసిన సొమ్ము మార్కెట్‌ కమిటీ చేరుతుంది. ఆ నిధులు మళ్లీ రైతు ప్రయోజనాలకే ఖర్చుచేయాల్సి ఉండగా వైసీపీ పాలకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడం శోచనీయమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 01:21 AM