మసకబారుతున్న ‘మోటుపల్లి’
ABN , Publish Date - Feb 20 , 2024 | 11:44 PM
మోటుపల్లి ప్రాశస్త్యం మసకబారుతుంది. చినగంజాం మండలి పరిదిలోని మోటుపల్లి తీరప్రాంత గ్రామం. గతంలో ఇక్కడ ఓడరేవు ప్రసిద్ధిగాంచింది. ఆ ఆనవాళ్లన్నీ కోల్పోయింది. ప్రస్తుతం ఆనాటి ఓడరేవు ప్రాంతం కేవలం పడవలను నిలిపే ప్రదేశంగా మాత్రమే కనిపిస్తుంది.
గతం ఘనం.. వర్తమానం నామమాత్రం
చీరాల, ఫిబ్రవరి 20: మోటుపల్లి ప్రాశస్త్యం మసకబారుతుంది. చినగంజాం మండలి పరిదిలోని మోటుపల్లి తీరప్రాంత గ్రామం. గతంలో ఇక్కడ ఓడరేవు ప్రసిద్ధిగాంచింది. ఆ ఆనవాళ్లన్నీ కోల్పోయింది. ప్రస్తుతం ఆనాటి ఓడరేవు ప్రాంతం కేవలం పడవలను నిలిపే ప్రదేశంగా మాత్రమే కనిపిస్తుంది.
మోటుపల్లి ఒకప్పటి మోహనగిరిపట్నం. ఇక్కడి ఓడరేవు చరిత్రాత్మకం. ఇక్కడ నుంచి వజ్ర, వైఢూర్యాలు, వస్త్రాలు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేవి. 11వ శతాబ్దంలో చోళులు మోటుపల్లి ప్రాంతం నుంచి ప్రాంతం నుంచి పాలన సాగించారు. వారి పాలనలో ప్రస్తుతం మోటుపల్లి ప్రాం తానికి మోహనగిరిపట్నంగా పేరుంది. అప్పట్లో మోటుపల్లి ప్రాంతంలోని సముద్రతీరం వాణిజ్యకేంద్రంగా విరాజిల్లింది. చోళులు తరువాత రెడ్డి రాజులు, పల్లవులు, కాకతీయులు ఈప్రాంతాన్ని పాలించారు. కాకతీయుల కాలంలో మోటుపల్లి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. మోటుపల్లిలోని వీర భద్రస్మామి ఆలయం గర్భగుడి చోళుల కాలంలో జరిగితే కాకతీయుల కాలంలో విస్తరణ జరిగింది. ఆ కాలంలోనే బౌద్ధమతవ్యాప్తి కూడా ఆ ప్రా ంతంలో జరిగిందని చారిత్రిక ఆధారాలు చెప్తున్నాయి.
పురావస్తుశాఖ పర్యవేక్షణలో వీరభద్రస్వామి ఆలయం
మోటుపల్లిలోని వీరభద్రస్వామి ఆలయం పురావస్తుశాఖ పర్యవేక్షణలో ఉంది. మూలవిరాట్ గుప్తనిధుల కోసం అన్వేషించే దొంగల పాలయింది. మూలవిరాట్‌కు ఎదురుగా మండపంలో ఉండే నందీశ్వరుని విగ్రహాన్ని కూడా కొందరు పెకలించారు. దీంతో ఆ విగ్రహాన్ని ఆలయంలో భద్రపరి చారు. ప్రస్తుతం ఆలయం పురావస్తుశాఖ ఆధీనంలో ఉండటంతో పూజ లు, దీపధూప నైవేధ్యాలు కొరవడ్డాయి. కేవలం చారిత్రక స్థలంగా మా త్రమే మిగిలింది. ఎవరన్నా పర్యాటకులు సందర్శనకు వచ్చినపుడు మా త్రమే అక్కడ అలికిడి ఉంటుంది. లేదంటే తలుపులకు తాళాలు వేసి ఉంటున్నాయి.
పాలకులు పట్టించుకుంటేనే పూర్వవైభవం
మోటుపల్లి ప్రత్యేకతలు అనేకం. అక్కడ అప్పట్లో బౌద్ధమతం వ్యాప్తి కూడా జరిగిందని చెప్తుంటారు. వీరభద్రస్వామి ఆలయానికి సమీపంలో దెబ్బతిన్న భారీ బుద్ధ విగ్రహం అందుకు నిదర్శనం. చినగంజాం- ఉప్పుగుంటూరు జాతీయ రహదారి సమీపంలో బకింగ్‌హామ్ కెనాల్ పక్క న ఉన్న బౌద్ధ ఆరామక్షేత్రం కూడా ఆనాటి ఆనవాళ్లలో భాగమని ఆ ప్రాంతవాసులు భావిస్తుంటారు. ఈనేపథ్యంలో పాలకులు, అధికారులు స్పందించి మోటుపల్లి ఓడరేవు, వీరభద్రస్వామి ఆలయం, బౌద్ధ ఆరామ క్షేత్రానికి పూర్వ వైభవం తేవాలని ప్రజలు కోరుతున్నారు. అందుకు అనుగుణంగా పాలకులు, అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.