రోగులకు కాలం చెల్లిన మందులు
ABN , Publish Date - Feb 08 , 2024 | 11:32 PM
Expired medicines for patients
ఒంగోలు నగరంలో అందజేస్తున్న వైద్యసిబ్బంది
ఒంగోలు(కలెక్టరేట్), ఫిబ్రవరి 8 : కాలం చెల్లిన మందులను వాడవద్దని పదేపదే చెప్తున్నా.. వైద్యారోగ్యశాఖ పట్టించుకుంటున్న పరిస్థితి లేకుండాపోయింది. చేతికే మందులు(ట్యాబ్‌లెట్లు) వస్తే వాటిని రోగులకు ఇచ్చి పంపుతున్నారు. ఒంగోలు నగరంలోని ఒక అర్బన్ హెల్త్ సెంటర్‌లో రోగులకు కాలం చెల్లిన మాత్రలు ఇస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఒక షుగర్ పేషెంట్ క్రమంతప్పకుండా అర్బన్ హెల్త్ సెంటర్‌లో చూపించుకుంటారు. అక్కడ బ్లడ్ షుగర్‌ను పరిశీలించి నెలకు సరిపడా మందులను ఇస్తుంటారు. అలా ఆ వైద్యశాలకు వెళ్లిన పేషెంట్‌కు ట్యాబ్‌లెట్లను అందజేశారు. వాటిని ఆమె ఐదారు రోజుల నుంచి వాడుతూ వచ్చారు. పెద్దగా చదువుకోకపోవడంతో ఆ మందుల సమయం ఏ సంవత్సరం వరకు ఉండేది చూసుకోలేదు. ఆమె కుటుంబ సభ్యులు ఆ ట్యాబెట్లను గురువారం పరిశీలించారు. అవి 2021 నవంబరులో తయారుచేయగా 2023 అక్టోబరుకు కాలం చెల్లుతాయని ఉంది. ఈ విషయాన్ని పట్టించుకోని ఆ వైద్యసిబ్బంది వారి వద్దకు వచ్చిన వారందరికి ఆ ట్యాబ్‌లెట్లనే పంపిణీ చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకొని కొంతమంది వైద్యశాలకు వెళ్లి అడిగితే కనీసం సమాధానం కూడా చెప్పలేదని తెలిసింది. ప్రభుత్వ వైద్యశాల కదా వెళితే కాలం చెల్లిన మందులను తమకు అంటగడుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్‌ఫర్ అయిన మందులను వాడితే ఏ ఇబ్బంది వస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నా రు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని ఇటువంటి మందులను రోగులకు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.