Share News

కాంగ్రెస్‌లో ఉత్సాహం

ABN , Publish Date - Jan 28 , 2024 | 01:03 AM

సీఎం జగన్‌ వ్యక్తిత్వం, పాలనా తీరుపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విరుచుకుపడిన తీరు కాంగ్రెస్‌ శ్రేణులను ఆకట్టుకుంది. ఆమె ప్రసంగంతోపాటు ఉన్న కొద్దిసమయంలో ఆమె నాయకులు, కార్యకర్తలతో కలిసిపోయిన తీరు, గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శన తదితర అంశాలు అందరినీ ఆకర్షించాయి.

కాంగ్రెస్‌లో ఉత్సాహం
గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలిస్తున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

షర్మిల పర్యటనకు కేడర్‌ నుంచి భారీ స్పందన

జగన్‌ బండారం బయటపెట్టిన పీసీసీ అధ్యక్షురాలు

ఆయన వ్యక్తిత ్వం, పాలనపై ఫైర్‌

వైవీ సుబ్బారెడ్డిపై విమర్శలు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

సీఎం జగన్‌ వ్యక్తిత్వం, పాలనా తీరుపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విరుచుకుపడిన తీరు కాంగ్రెస్‌ శ్రేణులను ఆకట్టుకుంది. ఆమె ప్రసంగంతోపాటు ఉన్న కొద్దిసమయంలో ఆమె నాయకులు, కార్యకర్తలతో కలిసిపోయిన తీరు, గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శన తదితర అంశాలు అందరినీ ఆకర్షించాయి. ఆమె ప్రసంగం ఎలా ఉంటుంది, అందులో స్థానికంగా వైసీపీ నాయకులపై ఏమైనా దాడి ఉంటుందా అన్న అనుమానాలతో వేచిచూసిన వైసీపీ నాయకులు ఊరట చెందారు. జిల్లాకు సంబంధించి టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీద విమర్శలకు పరిమితమైన ఆమె మిగిలిన నాయకులను పల్లెత్తు మాట అనలేదు. అయితే ప్రధానంగా ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణం విషయంలో జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను సూటిగా ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల తొలిసారిగా శనివారం జిల్లాలో పర్యటించారు. ముందురోజు రాత్రి సీతారాంపురం కొష్టాల వద్ద ప్రైవేటు అతిథి గృహంలో బస చేసిన ఆమె శనివారం ఉదయం ముందుగా ప్రకటించకుండా గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు. ఒక్క మాటలోనే ప్రభుత్వ వైఫల్యాన్ని సూటిగా చెప్పేశారు. రాజశేఖర్‌రెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తే గేట్లు కూడా పెట్టలేని జగన్‌ ఆయన వారసుడని చెప్పుకోవటాన్ని ఎద్దేవా చేశారు. ఆ తర్వాత ఒంగోలులో జరిగిన కార్యకర్తల సమావేశంలోనూ వైఎస్సార్‌కి జగన్‌ వారసుడు కాదు తానే వారసురాలినని చెప్పుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఇక ప్రసంగంలో జగన్‌ కోసం తానుపడిన కష్టాన్ని వివరిస్తూ ఆతర్వాత ఆయన చేసిన మోసాన్ని తెలియజేస్తూ జగన్‌ వ్యక్తిత్వాన్ని సూటిగా చెప్పడంతో సమావేశంలో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో జగన్‌ పాలనా వైఫల్యాలను కూడా ఎత్తిచూపగలిగారు. ముఖ్యంగా గుండ్లకమ్మ, వెలిగొండ ప్రాజెక్టు, నిమ్జ్‌ ఏర్పాటులో జగన్‌ మాటతప్పిన వైనాన్ని సూటిగా వివరించారు. మూడునాలుగు ముఖ్యమైన అంశాలతోనే జగన్‌ అభివృద్ధి నిరోధకుడనే విషయం అర్థమయ్యేలా చెప్పారు. ఇంకోవైపు సమావేశానికి ఆ పార్టీలోని యువనాయకత్వం, సాధారణ అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఫంక్షన్‌హాలు కిటకిటలాడింది. సమావేశంలో పార్టీలో కొత్తగా చెప్పుకోదగిన నేతలు చేరకపోయినా భవిష్యత్తులో కాంగ్రెస్‌వైపు కొందరు చూసే అవకాశం ఉందనే విషయం ఇప్పటికే తేటతెల్లమైంది.

చేతకాని దద్దమ్మలు

గుండ్లకమ్మ ప్రాజెక్టును వైఎస్సార్‌ నిర్మిస్తే.. జగన్‌ గేటు కూడా పెట్టలేకపోయారు

గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు గేటు కూడా పెట్టలేని పాలకులు చేతకాని దద్దమ్మలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. వారికి పాలించే అర్హత లేదన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి డ్యాన్స్‌లు వేయడానికి తప్ప పాలనకు పనికిరారని మండిపడ్డారు. మద్దిపాడు మండలం మల్లవరం వద్ద ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టును ఆమె శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రూ.750కోట్లు వెచ్చించి ప్రజలకు తాగు, సాగునీరు అందించాలన్న లక్ష్యంతో గుండ్లకమ్మ రిజర్వాయర్‌ను నిర్మిస్తే ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో నిర్వహణ సక్రమంగా లేక రెండు గేట్లు కొట్టుకుపోయాయన్నారు. 18నెలలు గడిచినా కనీసం గేటు కూడా ఏర్పాటు చేయలేకపోయారని, అలాంటి వ్యక్తులు వైఎస్సార్‌ వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు గుండ్లకమ్మ ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో అలవిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్‌ శాఖ ఇంజనీరింగ్‌ అధికారి 2019లో కొత్త గేట్లు నిర్మించాలని ప్రతిపాదనలు పంపినా పట్టించుకోలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు గుండ్లకమ్మ ప్రాజెక్టు మరమ్మతుల విషయం పట్టించుకోకుండా ఇసుక, గ్రావెల్‌ను తవ్వుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి ఒంగోలు పట్టణానికి తాగునీరు అందించలేని దుస్థితిలో వైసీపీ పాలకులు ఉన్నారని మండిపడ్డారు. మంత్రి అంబటి రాంబాబు పరిపాలన కంటే డ్యాన్సులు చేయడంలో పట్టు సాధించారన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి ఏమి జరిగిందో ప్రజలకు వివరించాలని నిలదీశారు. వైఎస్సార్‌ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పిన వారసులు ప్రజలను మోసం చేశారన్నారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్‌లను విభజించి పైసా నిధులు ఇవ్వలేదన్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా పాలకులకు వినపడటం లేదన్నారు. మిర్చి, పొగాకు పంటలకు సాగునీరు అవసరమని దొడ్డవరం సర్పంచ్‌ పూనూరు సుబ్బారావు, మాజీ సర్పంచ్‌ కొత్త భరత్‌రావు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె స్పందిస్తూ గుండ్లకమ్మ నుంచి సాగునీరు అందించే విధంగా పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, రఘువీరారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొప్పుల రాజు, ఈదా సుధాకర్‌రెడ్డి, నట్టే సుబ్బారావు, నట్టే వసంతరాయుడు, పులిపాటి రాఘవులు, నున్న ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 01:03 AM