Share News

స్ట్రాంగ్‌ రూంలకు చేరిన ఈవీఎంలు

ABN , Publish Date - May 15 , 2024 | 01:18 AM

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసిన అనంతరం నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు నియోజవర్గాల ఈవీఎంలను ఒంగోలు సమీపంలోని రైజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూంలకు బస్సులలో తీసుకువచ్చారు.

 స్ట్రాంగ్‌ రూంలకు చేరిన ఈవీఎంలు
స్ట్రాంగ్‌ రూంలో ఈవీఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

పరిశీలించిన కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ సుమిత్‌

ఒంగోలు (కలెక్టరేట్‌), మే 14 : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసిన అనంతరం నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు నియోజవర్గాల ఈవీఎంలను ఒంగోలు సమీపంలోని రైజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూంలకు బస్సులలో తీసుకువచ్చారు. అక్కడ ఆయా నియోజకవర్గాల ఈవీఎంలను భద్రపర్చారు. ఒంగోలు పార్లమెంట్‌, అసెంబ్లీల ఈవీఎంలను వేర్వేరుగా ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత మార్కాపురం, కనిగిరి, దర్శి, గిద్దలూరు, వైపాలెం నియోజకవర్గాల ఈవీఎంలను ఒంగోలులోని స్ట్రాంగ్‌రూంలకు ప్రత్యేక వాహనాల్లో భారీ బందోబస్తు మధ్య తీసుకొచ్చారు. రైజ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ వద్ద నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను స్ట్రాంగ్‌రూములలో దించారు. జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌లు అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. స్ట్రాంగ్‌రూంల వద్ద ఆర్వోలు, సిబ్బందితో వారు మాట్లాడారు. ఆయా స్ట్రాంగ్‌రూంలలో ఈవీఎంలను భద్రపర్చిన అనంతరం సీల్‌ వేశారు.

స్ట్రాంగ్‌ భద్రత : ఎస్పీ

స్ట్రాగ్‌రూంల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ పేర్కొన్నారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్‌ స్థానానికి చెందిన ఈవీఎంలు రైజ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలోని స్ట్రాంగ్‌రూంలకు మంగళవారం చేర్చి సీల్‌ వేశారన్నారు. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, రూంల బయట ఆర్మ్‌డ్‌ రిజర్వుడ్‌ బలగాలు, బయట సివిల్‌ పోలీసులతో నిరంతరం నిఘా ఉంచామని చెప్పారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు సమష్ఠిగా పనిచేసినందున అక్కడక్కడా చెదురుమదరు సంఘటనలు మినహా ఓటింగ్‌ ప్రశాతంగా జరిగిందన్నారు. ఎన్నికల అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు పికెట్‌లు ఏర్పాటు చేశామని, రాత్రులు గస్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.

Updated Date - May 15 , 2024 | 01:18 AM