Share News

ఎర్రకొండ.. పిండి..

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:40 PM

తాళ్లూరు మండలంలోని వెలుగువారిపాలెం ఎర్రకొండను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. దీంతో కొండ రోజురోజుకూ రూపురేఖలు కోల్పోతోంది. అనుమతులకు మించి గ్రావెల్‌ను తవ్వుతున్నారు.

ఎర్రకొండ.. పిండి..
వెలుగువారిపాలెం ఎర్రకొండ మట్టి తవ్వి టిప్పర్‌కు నింపుతున్న ఎక్స్‌లేటర్‌

అనుమతులు గోరంత.. తరలింపు బోల్డంత

వెలుగువారిపాలెం కొండ రూపురేఖలు మాయం

జాతీయ రహదారి నిర్మాణానికి యథేచ్ఛగా తవ్వకాలు

తాళ్లూరు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెలుగువారిపాలెం ఎర్రకొండను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. దీంతో కొండ రోజురోజుకూ రూపురేఖలు కోల్పోతోంది. అనుమతులకు మించి గ్రావెల్‌ను తవ్వుతున్నారు. బెంగళూరు హైవే నిర్మాణం పేరిట ఇక్కడ నుంచి యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. బెంగళూరు నుంచి తాళ్లూరు ప్రాంతం మీదుగా గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి మంజూరైంది. గత ఏడాదిగా ఈ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. హైవే నిర్మాణ మార్గమధ్యంలో వెలుగువారిపాలెం వద్ద సర్వే నంబర్‌ 489లో 664 ఎకరాల్లో ఎర్రకొండ ఉంది. రోడ్డు నిర్మాణానికి కొండ దగ్గరగా ఉండటంతో కాంట్రాక్టర్‌ మట్టి, గ్రావెల్‌ కోసం రెవెన్యూ అధికారులకు, గ్రామపంచాయతీకి దరఖాస్తు పెట్టారు. అప్పటి తహసీల్దార్‌ కొండను పరిశీలించి పంచాయతీ తీర్మానం మేరకు ఒకటిన్నర హెక్టార్‌లో మట్టిని తవ్వేందుకు మైనింగ్‌ అధికారులకు ప్రతిపాదనలు పంపారు.ఆ మేరకు మైనింగ్‌ అధికారులు అనుమతి లభించింది.

అనుమతి ఒకటిన్నరే.. తవ్వేది 25హెక్టార్లలో

అనుమతులు గోరంతగా పొంది తరలింపు మాత్రం కొండంతగా ఉంది. ఈక్రమంలో రోడ్డు నిర్మాణం కోసం ఎర్రకొండ మట్టిని భారీగా తరలించటంతో కొండ పూర్తిగా రూపురేఖలు మారింది. దాదాపు 25హెక్టార్లకుపైగా కొండమట్టిని, గ్రావెల్‌ను తరలించారు. అనుమతికి మించి మట్టిని తోలుతున్నా అప్పట్లో వైసీపీ నాయకులు భారీస్థాయిలో ముడుపులు తీసుకుని మిన్నకున్నారన్న విమర్శలు వచ్చాయి. గత ఏడాది ఫిబ్రవరిలో అనుమతి పొంది మార్చి నుంచిఆ మట్టిని తోలటం ప్రారంభించారు. గత ప్రభుత్వంలో హద్దులు దాటి కొండలో తవ్వకాలు చేస్తున్నా అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో మునిగిందన్న విమర్శలు వచ్చాయి. కొందరు రెవెన్యూ అధికారులు వెళ్లి పరిశీలించారు కూడా. అయితే ముడుపులు తీసుకుని అక్రమ తవ్వకాల గురించి ఉన్నతాధికారులకు నివేదిక పంపలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి.


కొత్త ప్రభుత్వం వచ్చినా ఆగలేదు

కూటమి ప్రభుత్వంలో అక్రమ తవ్యకాలకు అడ్డుకట్ట పడుతుందని గ్రామస్థులు ఆశించారు. అనుమతి కంటే ఎక్కువ భూమిలో కొండ మట్టిని తవ్వుతున్నారని కొందరు ఫిర్యాదు చేయటంతో అధికారులు కొండ ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లినా తరలింపు ఆగలేదు. కొందరు కూటమి నేతలు గ్రావెల్‌ దందాలో ఉన్న వైసీపీ నేతలతో, రోడ్డు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై మిన్నకున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఆ కొండ నుంచి గ్రావెల్‌ను తరలించి తూర్పుగంగవరం-ఉలపాడు వరకు కొంతమేర రోడ్డు పనులు చేశారు. గతంలో ఈ కొండపై ఏపుగా గడ్డి పెరిగి ఉండటం వల్ల పశువులు, గొర్రెలు, మేకలను మేతకు తీసుకు వెళ్లేవారు. కొండ మట్టిని పూర్తిగా తరలించటంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో మేతకు వెళ్లిన పశువులు, మేకలు, గొర్రెలు జారిపడితే కన్పించకుండా పోతాయని కాపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోయినా ఇటీవల వచ్చిన తహసీల్దార్‌ సంజీవరావు కొండ ప్రాంతాన్ని సందర్శించి నివేదికను జిల్లా అధికారులకు పంపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా మట్టి, గ్రావెల్‌ తోలకుండా తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:44 PM