Share News

డ్వామా పీడీపై విచారణ

ABN , Publish Date - Jul 17 , 2024 | 12:27 AM

జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ అర్జున్‌రావు అవినీతిపై కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణను నియమించినట్లు సమాచారం.

డ్వామా పీడీపై విచారణ

విచారణాధికారిగా జేసీ గోపాలకృష్ణ

ఉద్యోగుల వినతిపై స్పందించిన కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

సిబ్బంది రోడ్డెక్కడంతో కార్యాలయానికి రాని అర్జున్‌రావు

ఒంగోలు (కలెక్టరేట్‌), జూలై 16: జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ అర్జున్‌రావు అవినీతిపై కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణను నియమించినట్లు సమాచారం. డ్వామా పీడీగా అర్జున్‌రావు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మామూళ్ల కోసం వేధించడంతోపాటు మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఉద్యోగులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. పీడీ కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్రం రూపంలో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాకు సమర్పించారు. ఉద్యోగులతో ఆయా అంశాలపై మాట్లాడిన కలెక్టర్‌ అన్సారియా పీడీ అవినీతికి సంబంధించిన అంశాలపై ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించినట్లు సమాచారం. తమనే కాకుండా కొందరు ఎంపీడీవోలను సైతం వేధించినట్లు ఈ సందర్భంగా వారు వివరించారు. మండలం నుంచి నెలకు రూ.లక్ష మామూళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని, లేనిపక్షంలో ఆయా ఉద్యోగులను టార్గెట్‌ చేసి అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని కలెక్టర్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్‌ అన్సారియా.. జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణతో సమగ్ర విచారణ చేయిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా డ్వామాలో పనిచేసే అన్ని విభాగాల ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేయడం పత్రికల్లో ప్రముఖంగా రావడంతో కలెక్టర్‌ స్పందించి అందుకు సంబంధించి పీడీ అర్జునరావును వివరణ కోరినట్లు సమాచారం. కాగా తమ శాఖలో పనిచేసే ఉద్యోగులు తనకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంతో మంగళవారం కార్యాలయానికి రాకుండా ఆయన ముఖం చాటేసినట్లు తెలిసింది. ఉద్యోగులు సమావేశమై ఆందోళనలు చేస్తారని తెలిసిన వెంటనే పీడీ అర్జునరావు అన్ని విభాగాల ఉద్యోగుల్లోని ముఖ్యనాయకులతో మాట్లాడినట్లు సమాచారం. ఇక నుంచి అటువంటివి జరగకుండా చూసుకుంటానని, ఆందోళనలు చేయవద్దని కోరినట్లు తెలిసింది. కానీ ఉద్యోగులు ఆయన వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని రోడ్డెక్కడంతో డ్వామా అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.

Updated Date - Jul 17 , 2024 | 12:27 AM