నాడు సాగు కోసం ఆక్రమణ నేడు ఇసుక తవ్వకాలు..అమ్మకాలు
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:05 AM
ప్రభుత్వం ఉచిత ఇసుకను అమలు చేస్తున్నా అద్దంకి ప్రాంతంలో ఇసుక కొనుగోలుదారులకు మా త్రం అదనపు భారం తప్పడం లేదు. గుండ్లకమ్మనదిలో ఇసుక అయినా ఆక్రమణదారులు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. దీంతో చెంతనే ఇసుక ఉన్నా ధర మాత్రం మండిపోతుంది. అద్దంకి పట్టణం సమీపంలో గుండ్లకమ్మ నది ప్రాంతాన్ని దశాబ్దాలుగా ఆక్రమించుకొని పంటల సాగు చేసుకుంటున్నారు.

ఒక్కో ట్రాక్టర్‌కు రూ.500 నుంచి రూ.1000 అదనపు భారం
ఉదాసీనంగా వ్యవహరిస్తున్న అధికారులు
ఉచితానికి తూట్లు
కట్టడికి చర్యలు తీసుకోవాలని వినియోగదారుల విజ్ఞప్తి
అద్దంకి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ఉచిత ఇసుకను అమలు చేస్తున్నా అద్దంకి ప్రాంతంలో ఇసుక కొనుగోలుదారులకు మా త్రం అదనపు భారం తప్పడం లేదు. గుండ్లకమ్మనదిలో ఇసుక అయినా ఆక్రమణదారులు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. దీంతో చెంతనే ఇసుక ఉన్నా ధర మాత్రం మండిపోతుంది. అద్దంకి పట్టణం సమీపంలో గుండ్లకమ్మ నది ప్రాంతాన్ని దశాబ్దాలుగా ఆక్రమించుకొని పంటల సాగు చేసుకుంటున్నారు. వరదలు వచ్చినప్పుడు పంటలు మునక వేసినా ఆ తరువాత మరలా యథావిధిగా సాగు చేసుకుంటున్నారు. పంటల సాగే కదా అని అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. ప్రస్తుతం గుండ్లకమ్మనదిలో నాణ్యమైన ఇసుక సరిపడా లేకపోవడంతో నాడు పంట పొలాలుగా వినియోగించిన భూములలో ఇసుక తవ్వకాలు చేయాల్సి వస్తుంది. ఆక్రమణదారులు తమ సొంత భూమిలా గిరిగీసి ఎ వరినీ రానివ్వకుండా తమకు సుంకం చెల్లిస్తేనే ఇసుక ఇస్తాం.. లేదంటే కుదరదు అన్నట్లు పెత్తనం చలాయిస్తున్నారు. కొంత మంది ఏక మొత్తంలో ఇసుక రవాణాదారులకు అమ్ముకుంటుండగా, మరి కొందరు మాత్రం ట్రాక్టర్‌ల చొప్పున ఇసుక అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుక రూ.500 నుంచి రూ.1000 వరకు అమ్ముతున్నారు. దీంతో ఇసుక కొనుగోలుదారులకు అదనపు భారం తప్పడం లేదు. ట్రాక్టర్ ఇసుక రూ.500 రూ.1000 ఉండగా, కూలీలు జల్లెడ పట్టి లోడింగ్ చేసినందుకు రూ.800 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక రవాణా చార్జీలు మరో ఏడెనిమిది వందలు వసూలు చేస్తున్నారు. దీంతో రూ.1500 పట్టణానికి చేరాల్సిన ఇసుక రూ.2500పైనే అవుతుందని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. ఇంకొన్ని సందర్భాలలో రవాణాదారులు ఏదో ఒక సాకుతో రూ.3వేలకు కూడా అమ్ముతున్నారు. గుండ్లకమ్మలో వరద నీరు ప్రవహిస్తుండడంతో ముందస్తుగానే నిల్వ చేసిన రవాణాదారులు ఒక్కో ట్రాక్టర్ ఇసుక రూ.3వేలకు అమ్ముతున్నారు. తిమ్మారెడ్డిపాలెం, మణికేశ్వరం వద్ద నిల్వ చేసిన ఇసుక అయితే రూ.4వేలు చొప్పున వసూలు చేస్తుండడం మరింత విమర్శలకు తావిస్తుంది. ఒక వైపు ప్రభుత్వం ఉచిత ఇసుక అందించేందుకు పలు విధాలా ప్రయత్నిస్తుండగా, ఇక్కడ అందుకు భిన్నంగా ఇసుక అమ్మకాలతో దోచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుండ్లకమ్మ నదిలో ఆక్రమణలను గుర్తించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ఎలాంటి అదనపు వసూలు లేకుండా చేస్తే ఒక్కో ట్రాక్టర్ ఇసుక ధర వెయ్యి రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంటుందని, ఉచిత ఇసుక పథకానికి న్యాయం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.