చేపల కోసం చెరువులు ఖాళీ
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:54 PM
చేపల పాటదారుల స్వార్థంతో గ్రామాల్లో నీటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. మండలంలోని అనేక గ్రామాల్లోని చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా నీటిని బయటకు పంపి చేపలు పట్టుకుంటున్నారు. దీంతో అవి ఖాళీ అయి ఒట్టిపోతున్నాయి.

నీటిని బయటకు పంపిన పాటదారులు
పశువులకు నీరు లేక పోషకుల ఇక్కట్లు
దర్శి, జూలై 8 : చేపల పాటదారుల స్వార్థంతో గ్రామాల్లో నీటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. మండలంలోని అనేక గ్రామాల్లోని చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా నీటిని బయటకు పంపి చేపలు పట్టుకుంటున్నారు. దీంతో అవి ఖాళీ అయి ఒట్టిపోతున్నాయి. చేపలు పట్టుకునేందుకు అడ్డగోలుగా నీరు వెళ్లబెట్టడంతో పశువులకు తాగునీరు లేక పోషకులు ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని రాజంపల్లి, జముకుల దిన్నె, కొత్తపల్లి తదితర గ్రామాల్లోని చెరువుల్లో ఇప్పటికే నీటిని బయటకు పంపి చేపలు పడుతున్నారు. మరికొన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. పాటదారుల నిర్వాకంతో చెరువుల్లో చుక్కనీరు లేకుండాపోతోంది. నిబంధనల ప్రకారం చెరువుల్లో నీరు అలాగే ఉంచి వలల ద్వారా చేపలు పట్టుకోవాల్సి ఉంది. త్వరగా పని పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో పాటదారులు నీరు బయటకు పంపుతున్నారు. సంబంధిత అధికారులు ఈవిషయం గురించి పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం వర్షాలు లేక చెరువుల్లో కొద్దిపాటి నీరు మాత్రమే ఉంది. ఉన్న నీటిని కూడా వెళ్లబెట్టడంతో పశుపోషకులు అల్లాడిపోతున్నారు. మళ్లీ వర్షాలు కురిస్తే తప్ప చెరువులకు నీరు చేరే అవకాశం లేదు. ఈనేపథ్యంలో అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.