Share News

మండుటెండలో ఉపాధి హామీ పనులు

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:28 AM

మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసే కూలీలు మండుటెండలో పనులు చేస్తూ మగ్గిపోతున్నారు.

మండుటెండలో ఉపాధి హామీ పనులు

త్రిపురాంతకం, ఏప్రిల్‌ 24: మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసే కూలీలు మండుటెండలో పనులు చేస్తూ మగ్గిపోతున్నారు. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగి 43 డిగ్రీలకు చేరింది. దీంతో ఉపాధి కూలీలు ఎండలకు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు పని ప్రదేశాలలో మంచినీరు, మజ్జిగ, ఫస్ట్‌ ఎయిడ్స్‌ కిట్‌లు అందుబాటులో లేకపోవటంతో పలు చోట్ల కూలీలు అస్వస్థతకు గురవుతున్నారు.

కనిపించని టెంట్లు

మండలం మొత్తం మీద 16225 జాబ్‌ కార్డులకు గానూ 25 వేల మంది కూలీలు ఉండగా ప్రస్తుతం 8665 మంది ఉపాది కూలీలు నిత్యం పనుల్లో నిమగ్నమవుతున్నారు. అయితే పని ప్రదేశంలో నీడను ఏర్పాటు చేసుకోవటానికి టెంట్లు, పట్టలు అందించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. గతంలో ప్రభుత్వం టెంట్‌లు ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం అవి ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. కొత్తగా టెంట్‌లుమంజూరుచేస్తే ఉపాధి కూలీలకు ఉపయుక్తంగా ఉంటుంది.

మెడికల్‌ కిట్‌లు లేవు

ఉపాధి కూలీలకు అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు అధికారులు మెడికల్‌ కిట్‌లను అందించాల్సి ఉండగా అధికారులు గత ఏడాది నుండి ఆదిశగా అటువంటి చర్యలేమి చేపట్టలేదు. ప్రస్తుతం ఎండతీవ్రత పెరగడంతో అనేక మంది తీవ్ర అస్వస్ధతకు గురై సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలు అనేకం. పని ప్రాంతాలలో ఎక్కువగా తేళ్లు, పాముకాట్లకు గురయ్యేవారు అనేకం ఉన్నారు. దీంతో ప్రథమ చికిత్స కిట్‌లు లేక కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కనిపించని మజ్జిగ, మంచినీరు

కూలీలకు ప్రభుత్వం మజ్జిగ, మంచినీరు పంపిణీ సరఫరా చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు ఎక్కడా చేపట్టటం లేదు. కూలీలంతా పని ప్రదేశానికి సీసాల ద్వారా నీళ్లు తీసుకెళ్తున్నారు. అవి కొద్దిసేపటికే అయిపోవటంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూలీలు చెబుతున్నారు. సగటు వేతనం 300 రూపాయలు పని చేస్తే మజ్జిగ పంపిణీ డబ్బులు వస్తాయని లేదంటే రావని అధికారులు అంటున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 01:28 AM