Share News

టీడీపీకి జై కొట్టిన ఉద్యోగులు

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:49 AM

సార్వత్రి ఎన్నికల్లో ఉద్యోగులు టీడీపీకి జై కొట్టారు. గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేసిన అనేకమంది ఈసారి టీడీపీకి మద్దతుగా నిలిచారు. బ్యాలెట్‌ ఓట్లు పలుచోట్ల వైసీపీ కన్నా టీడీపీ అభ్యర్థులకు రెట్టింపుస్థాయిలో వచ్చాయి.

టీడీపీకి జై కొట్టిన ఉద్యోగులు
చీమకుర్తిలో పోస్టల్‌ ఓట్లు వేసేందుకు బారులు తీరిన ఉద్యోగులు (ఫైల్‌)

చెల్లినవి 20,135 పోస్టల్‌ బ్యాలెట్లు

అందులో 60.72 శాతం కూటమికే

అశోక్‌రెడ్డి గెలుపులో ఆ ఓట్లే కీలకం

ఒంగోలు, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి) : సార్వత్రి ఎన్నికల్లో ఉద్యోగులు టీడీపీకి జై కొట్టారు. గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేసిన అనేకమంది ఈసారి టీడీపీకి మద్దతుగా నిలిచారు. బ్యాలెట్‌ ఓట్లు పలుచోట్ల వైసీపీ కన్నా టీడీపీ అభ్యర్థులకు రెట్టింపుస్థాయిలో వచ్చాయి. అయితే కొన్నిచోట్ల వైసీపీ అభ్యర్థులు భారీగా డబ్బు పంచి ఉద్యోగుల ఓట్లు కొన్న ప్రభావం కూడా కనిపించింది. ఎన్నికల విధుల్లో కీలకమైన పోలింగ్‌ సిబ్బంది అలాగే రవాణా, విద్యుత్‌, పోలీస్‌ వంటి అత్యవసర సర్వీసులైన శాఖల ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం ఉంది. గతంలో ముందుగా ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకొని బ్యాలెట్‌ పత్రాన్ని పొంది తమకు నచ్చిన వారికి ఓటు వేసి కవర్‌ను ఆర్వో కార్యాలయంలో ఇచ్చేవారు. ఆ సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను కొనుగోలు చేసి వారి సమక్షంలో ఓటు వేయించుకునేవారు. తర్వాత సదరు కవర్‌ను ఆ ఉద్యోగి లేదా కొనుగోలు చేసిన పార్టీ తరఫు వారు తీసుకెళ్లి ఆర్వో కార్యాలయంలో ఏర్పాటుచేసిన బాక్సులో వేసేవారు. ఇది అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసేది. అయితే ఈసారి ఎన్నికల సంఘం నిబంధనలను మార్చింది. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ప్రత్యేకంగా మూడు రోజులపాటు నియోజకవర్గ కేంద్రాలలో పోలింగ్‌ నిర్వహించింది. ఆ పరిధిలోని వారే కాక రాష్ట్రంలో ఏనియోజకవర్గంలో ఓటు ఉండి ఇక్కడ పనిచేస్తూ ఎన్నికల విధుల్లో ఉన్నవారు అక్కడ పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌లో పాల్గొనేలా చేశారు. అలా ఇక్కడ జేసీగా ఉన్న గోపాలకృష్ణ తన సొంత ఊరు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ అభ్యర్థులకు ఓటు వేశారు. ఆ విషయం అలా ఉంచితే పోస్టల్‌ బ్యాలెట్‌ కలిగిన వారిలో అత్యధికులు ఈసారి టీడీపీ అభ్యర్థులకే ఓటు వేశారు.

కనిపించిన డబ్బు ప్రభావం

జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు పోలైన పోస్టల్‌ బ్యాలెట్‌లలో కొద్దిసంఖ్యలో వివిధ కారణాలతో కౌంటింగ్‌ సమయంలో తిరస్కరణకు గురికాగా 20,135 ఓట్లు చెల్లాయి. వాటిని లెక్కించగా 13,497 (60.72శాతం) మంది టీడీపీ అభ్యర్థులకు ఓట్లు వేశారు. 8,310 (37.34శాతం) మంది వైసీపీకి మద్దతు పలికారు. గరిష్ఠంగా గిద్దలూరు, సంతనూతలపాడు, కనిగిరి నియోజకవర్గాల్లో 64 నుంచి 66 శాతం ఉద్యోగులు టీడీపీకే వేశారు. ఒంగోలుతోపాటు కొన్నిచోట్ల ఉద్యోగుల ఓట్లపై డబ్బు ప్రభావం కూడా కనిపించింది. వైసీపీ అభ్యర్థులు ఒంగోలు, దర్శి వంటి చోట్ల ఒక్కో బ్యాలెట్‌ను రూ.5వేల వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. ఆ ప్రభావంతో ఆ ప్రాంతంలో కొంతమేర ఉద్యోగుల ఓట్లు వైసీపీకి అనుకూలంగా పడినట్లు సమాచారం. మొత్తంగా అధికశాతం ఉద్యోగులు ఈసారి టీడీపీవైపే మొగ్గు చూపారు. కాగా గిద్దలూరులో టీడీపీ అభ్యర్థి గెలుపులో ఉద్యోగుల ఓట్లే కీలకమయ్యాయి. ఈవీఎంలలోని ఓట్లలో వైసీపీ అధిక్యత ఉండగా పోస్టల్‌ బ్యాలెట్‌లో వచ్చిన అధిక్యతతో అక్కడ టీడీపీ అభ్యర్థి అశోక్‌రెడ్డి గెలుపొందారు.

Updated Date - Jun 06 , 2024 | 12:49 AM