Share News

నిద్రలో జారి కింద పడి వృద్ధుడు మృతి

ABN , Publish Date - May 22 , 2024 | 10:43 PM

ప్రమాదవశాత్తు వృద్ధుడు నిద్రలో బెంచీ మీద నుంచి జారి కింద పడి మృతి చెందిన సంఘటన హుస్సేన్‌పురంలో చోటుచేసుకుంది.

నిద్రలో జారి కింద పడి వృద్ధుడు మృతి

వెలిగండ్ల, మే 22 : ప్రమాదవశాత్తు వృద్ధుడు నిద్రలో బెంచీ మీద నుంచి జారి కింద పడి మృతి చెందిన సంఘటన హుస్సేన్‌పురంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... హుస్సేన్‌పురానికి చెందిన ఈర్ల గురవయ్య(60) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. మంగళవారం సాయంత్రం రోడ్డు పక్కన రావి చెట్టు దగ్గర ఉన్న బల్లపై పడుకొని నిద్రిస్తున్న సమయంలో దొర్లి కింద పడటంతో తలకి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతనిని కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివ తెలిపారు.

మారెళ్ల సమీపంలో గుర్తుతెలియని మృతదేహం

పీసీపల్లి, మే 22 : మండలంలోని మారెళ్ల సమీపంలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పీసీపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై రమే్‌షబాబు తెలిపిన వివరాల మేరకు... పీసీపల్లి నుంచి మారెళ్ల వెళ్లే మార్గంలో కంకరమిల్లు సమీపంలో మృతదేహం ఉంది. అతని శరీరంపై బ్లూ రంగు చొక్కా, తెలుపు, బ్లూ చారలు కలిగిన లుంగీ ధరించిన సుమారు 60సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు పీసీపల్లి పోలీసులకు(సెల్‌నెంబరు9121102213) సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.

Updated Date - May 22 , 2024 | 10:43 PM