Share News

విద్య, వైద్యరంగాలకు పెద్దపీట

ABN , Publish Date - Jun 23 , 2024 | 11:22 PM

జిల్లాలో విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తానని నూతన కలెక్టర్‌గా నియమితులైన తమీమ్‌ అన్సారియా చెప్పారు. అదేసమయంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారతకు కూడా ప్రాధాన్యం ఇస్తానన్నారు.

విద్య, వైద్యరంగాలకు  పెద్దపీట
కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారతకు ప్రాధాన్యం

విస్తృతంగా ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు

‘ఆంధ్రజ్యోతి’తో కొత్త కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

ఒంగోలు, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తానని నూతన కలెక్టర్‌గా నియమితులైన తమీమ్‌ అన్సారియా చెప్పారు. అదేసమయంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారతకు కూడా ప్రాధాన్యం ఇస్తానన్నారు. ఇక ప్రభుత్వ ప్రాధాన్య పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే కర్తవ్యమన్నారు. జిల్లాకు 38వ కలెక్టర్‌గా నియమితులైన తమీమ్‌ అన్సారియా ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడారు. తన ప్రాధాన్యతలను వివరించారు. తమిళనాడుకు చెందిన తమీమ్‌ అన్సారియా 2015 ఐఏఎస్‌ బ్యాచ్‌ అధికారి. చెన్నైలో బీఈ కంప్యూటర్స్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఆమె తొలుత 2013లో సివిల్స్‌ గ్రూప్‌ ఏ గ్రేడ్‌లో అకౌంటెన్సీ పోస్టు సాధించి కేంద్ర ప్రభుత్వంలో పనిచేశారు. 2015లో ఐఏఎస్‌గా ఎంపికైన ఆమెను యూపీ కేడర్‌కు కేటాయించారు. కొంతకాలం కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ జాయింట్‌ సెక్రటరీగా కూడా పనిచేశారు. కాగా ఆంధ్ర కేడర్‌లో పనిచేస్తున్న జమ్మూకశ్మీర్‌కు చెందిన 2012 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి మునజీర్‌ జిలానీతో వివాహం అనంతరం తమీమ్‌ అన్సారియా కూడా ఆంధ్ర కేడర్‌కు మారారు. అలా 2020లో రాష్ర్టానికి వచ్చాక తొలుత విశాఖపట్నంలో పనిచేశారు. అనంతరం శ్రీశైలం కేంద్రంగా స్పెషల్‌ కలెక్టర్‌గా ఏడాదిన్నర, తదనంతరం 2022 ఏప్రిల్‌ నుంచి ఏడాదిపాటు అన్నమయ్య జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆతర్వాత దాదాపు ఏడాది కుటుంబపరమైన సెలవులో ఉన్నారు. ఈఏడాది జనవరి 29న శ్రీకాకుళం కార్పొరేషన్‌ కమిషనర్‌గా నియమితులై ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్నారు. తొలుత కేంద్ర సర్వీసులలో పనిచేసిన సమయంలో విద్యాశాఖలో ఉన్న తమీమ్‌ అన్సారియా ఆ రంగానికి పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అలాగే సాధారణ ప్రజలకు వైద్య సేవలు విస్తృతంగా, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి ప్రాధాన్యతలుగా చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం, మొత్తం యంత్రాంగం సహకారంతో ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు. సాధారణ ప్రజల సంక్షేమం, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. రెండు, మూడు రోజుల్లో ఇక్కడ బాధ్యతలు తీసుకోనున్నట్లు ఆమె చెప్పారు.

Updated Date - Jun 23 , 2024 | 11:22 PM