Share News

తాగునీటి కష్టాలు తీరేదెన్నడో

ABN , Publish Date - Mar 24 , 2024 | 01:11 AM

పట్టణంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవిలో ఎండలు ముదిరేకొద్ది నీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే పరిస్థితి నెలకొంది.

తాగునీటి కష్టాలు తీరేదెన్నడో

పొదిలి, మార్చి 23 : పట్టణంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవిలో ఎండలు ముదిరేకొద్ది నీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పట్టణంలో భుగర్భజలాలు అడు గంటాయి. 500 అడుగుల నుంచి 700 అడుగుల లోతువరకు బోర్లు వేసినా, నీరు పడడంలేదు. ఉన్న ఒకటిఅర చేతిపంపులు కూడా ఒట్టి పోయాయి. దీంతో ఈ వేసవిలో దర్శి నుంచి పొదిలికి వచ్చే సాగర్‌నీటి వాటాను పెంచాలని ప్రజలు పలుమార్లు అధికారులను కోరినా ఫలితం లేకపోయింది. సుమారుగా 10 నుండి 15రోజులకు ఒకసారి మాత్రమే సాగర్‌నీరు వస్తోంది. ఎక్కువ రోజులు నీటిసరఫరా లేకపోవడంతో పైపుల్లో పాచి పట్టిన నీరు సరఫరా అవుతోందని ఆ నీటిని తాగి రోగాల బారిన పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వేసవిని అధిగమించడం కోసం అధికారులు ముందుగానే అప్రమత్తం కావాలని ప్రజలు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ట్యాంకర్ల ద్వారా పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఏడాదికి ఒకరూల్‌ మారుస్తూ, ట్యాంకర్లు కుదించుకుంటూ వచ్చి చివరకు ట్యాంకర్ల సరఫరానే నిలిపి వేశారని ప్రజలు ఎద్దేవ చేస్తున్నారు. పట్టణంలో ఏడాది పొడవువునా ఇదే సమస్య ఉంటుంది. గత ఏడాది పొదిలి విశ్వనాథపురం కూడలిలో నీటి సమస్య తీర్చాలంటూ గంటల తరబడి ప్రజలు రాస్తారోకో చేశారు. ఆ సమయంలో పోలీసులు జోక్యం చేసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి ఉన్నతాధికారులకు నివేదికలు పంపించి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ తరువాత పట్టించుకున్న నాథుడే లేరని పలువురు విమర్శిస్తున్నారు. పట్టణంలో ప్రస్తుతం ఆరు ట్యాంకర్లతో రోజుకు 30 నుండి 35 ట్రిప్పులు వాడుక నీటిని సరఫరా చేస్తున్నట్లు నగర పంచాయతీ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పరిశీలించి అవసరం అనుకుంటే ఉన్నతాధికారుల సూచనలు మేరకు మరికొన్ని పెంచుతామన్నారు. పట్టణంలో సుమారుగా 38 నుండి 40వేల వరకు జనాభా ఉంటారు. అయితే 30 సంవత్సరా లకుపైగా అప్పటి జనాభా ప్రతిపాదనలకు అనుకూలంగా ఒకరికి 40లీటర్ల నీరు అందే విధంగా ఎన్‌ఏపీ తాగునీటి పథకం ఏర్పాటు చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటికే రెండు వంతుల జనాభా పెరిగిపోయింది. దానికి అనుకూలంగా నీటి సరఫరా చేసే విధంగా సామ ర్ధ్యం పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటి కైనా ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యను తీర్చాలని ప్రజలు వేడుకుంటున్నారు.

Updated Date - Mar 24 , 2024 | 01:11 AM