Share News

458 ఆవాసాలకు తాగునీరు

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:21 AM

జిల్లాలో వేసవి నీటి ఎద్దడి తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్లతో సరఫరాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆమేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

458 ఆవాసాలకు తాగునీరు

అనుమతిచ్చిన ప్రభుత్వం

ఇప్పటికే 142చోట్ల ట్యాంకర్లతో నీరు

మిగతా ప్రాంతాలకు అవసరమైనప్పుడు సరఫరా

ఒంగోలు, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వేసవి నీటి ఎద్దడి తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్లతో సరఫరాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆమేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేసవిలో జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లోని 25 మండలాల్లో ఉన్న 458 ఆవాసాల్లో నీటి సమస్య ఏర్పడుతుందని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు అంచనా వేశారు. ఆమేరకు ప్రభుత్వానికి గతంలోనే నివేదించారు. ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్లతో నీటి సరఫరాకు అనుమతి కోరారు. తొలుత 58, తర్వాత మరో 84 హ్యాబిటేషన్లలో నీటి సరఫరాకు గతంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తదనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. ఆ 142 ఆవాసాలకు నీటి సరఫరాను జూన్‌ ఆఖరు వరకు కొనసాగించడంతోపాటు మిగిలిన 316 హ్యాబిటేషన్లలో కూడా జూన్‌లోపు ఎప్పుడు, ఎక్కడ అవసరమైతే అక్కడ సరఫరాకు చర్యలు తీసుకొనేందుకు జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ట్యాంకర్లతో నీటి సరఫరాకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఆయా హ్యాబిటేషన్‌లలో ఒక్కొక్కరికి రోజుకు 40 లీటర్లు సరఫరా చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. హ్యాబిటేషన్‌ యూనిట్‌గా జనాభా, మొత్తం నీటి అవసరాన్ని గుర్తించి స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని వనరుల నుంచి ఉన్న లభ్యతపోను మిగతా నీటిని ట్యాంకర్లతో సరఫరా చేయాల్సి ఉంటుంది. మొత్తం నీటి సమస్య ఎదురయ్యే 458 ఆవాసాల్లో దాదాపు 6.48 లక్షల మంది జనాభా ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.

Updated Date - Apr 25 , 2024 | 01:21 AM