Share News

ప్రజల నాడి పట్టిన డాక్టర్‌ లక్ష్మి

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:43 PM

దర్శి నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి ప్రజల నాడి పట్టుకున్నారు. నిన్నమొన్నటి వరకు ప్రజల నాడి పట్టుకొని వైద్య సేవలు అందించి మంచి డాక్టర్‌గా గుర్తింపు పొందిన లక్ష్మి నేడు రాజకీయ రంగంలో ప్రజల సమస్యలను సావదానంగా వింటూ, పరిష్కారం కోసం మార్గాలను చూపుతూ ముందుకు సాగుతున్నారు

ప్రజల నాడి పట్టిన డాక్టర్‌ లక్ష్మి
అందరిలో ఒకరిగా ఒదిగిపోతూ ప్రచారం చేస్తున్న లక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ కూటమి అభ్యర్థి

ఆప్యాయ పలకరింపులతో ప్రజల్లోకి.. విశేష స్పందన

దర్శి, ఏప్రిల్‌ 18 : దర్శి నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి ప్రజల నాడి పట్టుకున్నారు. నిన్నమొన్నటి వరకు ప్రజల నాడి పట్టుకొని వైద్య సేవలు అందించి మంచి డాక్టర్‌గా గుర్తింపు పొందిన లక్ష్మి నేడు రాజకీయ రంగంలో ప్రజల సమస్యలను సావదానంగా వింటూ, పరిష్కారం కోసం మార్గాలను చూపుతూ ముందుకు సాగుతున్నారు. మూలనున్న పండుముదుసలి నుంచి చంకలో ఉన్న చిన్న పిల్లోడి వరకు అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ.. వారిలో ఒకరిగా వదిగిపోతూ సాంత్వన చేకూరుస్తున్నారు. కొన్ని అంశాల్లో ముక్కుసూటిగా మాట్లాడుతూ స్పష్టమైన హామీలు ఇస్తున్నారు. ఆమె ప్రచార తీరుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా వ్యవహరిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరితో కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నారు. వీరికితోడు ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి అపార అనుభవం, ఆయన కుమారుడు రాఘవరెడ్డి చొరవతో టీడీపీ ప్రచారంలో దూసుకెళ్తుంది. అదే క్రమంలో టీడీపీలోకి వైసీపీ నుంచి భారీగా చేరికలు జరుగుతున్నాయి.

వైసీపీ నుంచి భారీ చేరికలు

వైసీపీ నుంచి ముఖ్య నాయకులతో పాటు వందలాది కుటుంబాలు ఇప్పటికే టీడీపీలో చేరాయి. ముండ్లమూరు, దొనకొండ మండలాల వైసీపీ కన్వీనర్లు బిజ్జం సుబ్బారెడ్డి, కందుల నారపురెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ రాచగొర్ల వెంకటయ్య, దొనకొండ జడ్పీటీసీ సుధాకర్‌, వైస్‌ ఎంపీపీలు మిట్టా కోటిరెడ్డి, వడ్లమూడి వెంకటేశ్వర్లు, దర్శి నగర పంచాయతీ కౌన్సిలర్‌ వీసీ రెడ్డి తదితర ముఖ్య నాయకులతో పాటు అనేకమంది ముఖ్య కార్యకర్తలు కూడా టీడీపీలో చేరారు. వైసీపీ నుంచి వచ్చిన నాయకులు తన అనుచరులను ముమ్మరంగా టీడీపీలో చేర్పిస్తున్నారు. దర్శి, దొనకొండ, ముండ్లమూరు మండలాల్లో వందలాది కుటుంబాలు టీడీపీలో చేరి పార్టీ గెలుపుపై మరింత నమ్మకాన్ని పెంచాయి.

గొట్టిపాటి కుటుంబంపై తరగని నమ్మకం

టీడీపీ పట్ల ఆదరణ పెరుగుతుండడంతోపాటు అసెంబ్లీ అభ్యర్థి లక్ష్మి పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఆమె మహిళల వద్దకు వెళ్లి వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆమె ప్రసంగాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి.. ఆలోచింపజేస్తున్నాయి. నియోజకవర్గ సమస్యలను వివరిస్తూ శాశ్వత పరిష్కారం చేయిస్తానని స్పష్టమైన హామీ ఇస్తుండటంతో ప్రజల్లో విపరీతమైన స్పందన లభిస్తోంది. ఆమె కుటుంబ నేపథ్యం కూడా ఆమెపై నమ్మకాన్ని పెంచుతుంది. దివంగత మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనమరాలిగా, దివంగత మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నర్సయ్య కుమార్తెగా ఆమె పరిచయం చేసుకుంటున్నారు. గత 40 ఏళ్లుగా వారి కుటుంబం అందించిన సేవలను మచ్చలేని రాజకీయ జీవితాన్ని గుర్తుచేస్తున్నారు. వారి వారసురాలిగా దర్శి నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ఇచ్చిన హామీలు తుచ తప్పకుండా అమలు చేస్తానని భరోసా ఇస్తున్నారు.

మద్దతు ప్రకటించిన అన్ని వర్గాల వారు

టీడీపీకి అన్ని వర్గాలు, విభాగాల వారు మద్దతు ప్రకటించారు. టీడీపీకి కాపు జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు దర్శిలో పర్యటించి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఐటీ ఉద్యోగులు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి సంపూర్ణ మద్దతు తెలిపారు. అన్నివర్గాల మద్దతు లభిస్తుండటంతో విజ యం తథ్యమని టీడీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి.

వంద పడకల ఆస్పత్రి, వాటర్‌ ప్లాంట్‌ల ఏర్పాటు

టీడీపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వపరంగా సేవలందించటమే కాక సొంత నిధులతో దర్శిలో మల్టీ సూపర్‌స్పెషాలిటీ హాస్పటల్‌ నిర్మించి తమ కుటుంబం సేవలందింస్తుందని భరోసా ఇస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐల సహకారంతో నియోజకవర్గంలో వంద వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి చేస్తామని, ఎన్‌ఆర్‌ఐల సహకారంతో పరిశ్రమల ఏర్పాటు చేస్తామని చెప్పటంతో నిరుద్యోగ యువత కూడా సానుకూలంగా స్పందిస్తోంది. అన్నివర్గాల ప్రజల సమస్యలు గుర్తించి అందరికీ న్యాయం చేస్తానని వినమ్రంగా తెలియజేస్తున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:43 PM