Share News

ఆ పనులకు బిల్లులు చెల్లించొద్దు!

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:59 AM

తాళ్లూరు మండలంలోని అధికార వైసీపీలో అంతర్యుద్ధం కొనసాగుతోంది.

ఆ పనులకు బిల్లులు చెల్లించొద్దు!
తాళ్లూరు ఎంపీడీవో కార్యాలయం

ఎంపీడీవోకు వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదేశం

ఎంపీపీ ప్రశ్నించడంతో విషయం బహిర్గతం

పార్టీ పెద్దలకు జడ్పీటీసీతో కలిసి ఫిర్యాదు

తాళ్లూరు, జనవరి 27 : తాళ్లూరు మండలంలోని అధికార వైసీపీలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ప్రతిపక్ష నేతలకు బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు పెట్టిన వైసీపీ నేతలు తాజాగా తమకు అనుకూలంగా లేని స్వపక్ష ఎంపీపీ చేపట్టిన పనులకూ బిల్లులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు సొంతూరు మాధవరం గ్రామంలో మండల పరిషత్‌ ఆమోదంతో రూ.6లక్షలు వెచ్చించి చేపట్టిన అభివృద్ధి పనులకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వొద్దని దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి స్థానిక ఎంపీడీవో యుగకీర్తికి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీంతో బిల్లుల చెల్లింపుల్లో తీవ్రజాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. పూర్తిచేసిన పనులకు వర్క్‌ కమిటీ లెటర్‌, పని ముగిసిన తరువాత ఇంజనీరింగ్‌ అధికారులు సిద్ధం చేసిన ఎం-బుక్‌ను ఎంపీడీవోకు ఎంపీపీ శ్రీనివాసరావు అందజేశారు. అయినా బిల్లులు చెల్లించలేదు. దీనిపై ఎంపీడీవోను నిలదీయగా ఇన్‌చార్జి చెల్లించవద్దని చెప్పారని, తనకు ఏమి చేయాలో అర్థం కావడం లేదని ఎంపీడీవో సమాధానమిచ్చినట్లు సమాచారం. మండల పరిషత్‌ గ్రాంట్‌ నుంచి పనులు చేస్తే ఎవరో బిల్లులు ఆపమనడం సరికాదని శ్రీనివాసరావు అన్నారు. అనంతరం ఈ విషయమై జడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డితో ఎంపీపీ చర్చించారు. బిల్లులు చెల్లించకుండా ఇన్‌చార్జి అడ్డుకుంటున్నారని వారు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

Updated Date - Jan 28 , 2024 | 12:59 AM