ఆ రోడ్లకు మోక్షం కలిగేనా..?
ABN , Publish Date - Jul 15 , 2024 | 09:56 PM
నాడు మార్టూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు... పునర్విభజనతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌తో పాటు ఆ గ్రామాలు అద్దంకి నియోజకవర్గం పరిధికి మారాయి. రవికుమార్ మార్టూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నామ్ రోడ్డు నుంచి మరలా నామ్ రోడ్డును కలిపే విధంగా అద్దంకి మండలం శాంతినగర్ నుండి వెంపరాల, ఉప్పలపాడు, మైలవరం, బల్లికురవ మండలం జమ్మలమడక పల్లె, ఏలేశ్వరవారిపాలెం, వెలమవారిపాలెం, కొత్తూరు మీదుగా వి.కొప్పెరపాడు వరకు రెండు దశాబ్దాల క్రితం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 25 కి.మీ మేర తారు రోడ్డు నిర్మాణం చేశారు.
ఆనవాళ్లు కూడా కోల్పోయిన శాంతినగర్ - మైలవరం-వి.కొప్పెరపాడు రోడ్డు
పట్టించుకోని వైసీపీ పాలకులు
మంత్రి గొట్టిపాటిపైనే ప్రజల ఆశలు
అద్దంకి, జూలై 15 : నాడు మార్టూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు... పునర్విభజనతో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌తో పాటు ఆ గ్రామాలు అద్దంకి నియోజకవర్గం పరిధికి మారాయి. రవికుమార్ మార్టూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నామ్ రోడ్డు నుంచి మరలా నామ్ రోడ్డును కలిపే విధంగా అద్దంకి మండలం శాంతినగర్ నుండి వెంపరాల, ఉప్పలపాడు, మైలవరం, బల్లికురవ మండలం జమ్మలమడక పల్లె, ఏలేశ్వరవారిపాలెం, వెలమవారిపాలెం, కొత్తూరు మీదుగా వి.కొప్పెరపాడు వరకు రెండు దశాబ్దాల క్రితం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 25 కి.మీ మేర తారు రోడ్డు నిర్మాణం చేశారు. కొంతకాలానికి తారు రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పంచాయతీరాజ్ శాఖలో నిధులు లేకపోవడంతో మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఆర్ అండ్‌బీ శాఖ పరిధిలోకి మార్పు చేసి రోడ్డు పునఃనిర్మాణం చేయాలని భావించారు. అయితే ఆర్‌అండ్‌బీలో కూడా కొత్త రోడ్లకు నిధులు లేకపోవడంతో రోడ్డు మరింత అధ్వానంగా మారింది. చాలా చోట్ల అసలు తారు రోడ్డు ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. ఆర్‌అండ్‌బీ నుంచి మరలా పంచాయతీరాజ్‌కు మార్పు చేశారు. వైసీపీ పాలకుల నిర్లక్ష పాపం రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారింది. కొన్ని చోట్ల స్థానికులే చిన్నపాటి మరమ్మతులు, చిల్లచెట్ల తొలగింపు చేసుకోగా, ఉప్పలపాడు-మైలవరం మధ్య రోడ్డు ను చిల్లచెట్లు పూర్తి గా మూసి వేశాయి. ఉదయం, సాయం త్రం సమయాలలో ఆర్టీసీ బస్సు నడుపుతుండగా రాకపోకలకు కూడా మరింత ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం రవికుమార్ మంత్రిగా ఉండడం, రవికుమార్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో వేసిన రోడ్డు కావడంతో ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయిస్తారన్న గంపెడు ఆశతో ఆయా గ్రామాల ప్రజలు ఉన్నారు. దీనికి తోడు సార్వ త్రిక ఎన్నికల ప్రచార సమయంలో ఆయా గ్రామాలలో రవికుమార్ పర్యటించినప్పుడు గెలిచిన తరువాత మొదటి 100 రోజుల ప్రణాళికలో రోడ్లకు నిధులు మంజూరు చేయిస్తానని ఇచ్చిన హామీ అమలు చేసే దిశగా కచ్చితంగా అడుగులు వేస్తారనే ఆశతో ఉన్నారు. 20 ఏళ్ల తరువాత అయినా రోడ్డు కు మోక్షం కలుగుతుందన్న నమ్మకంతో ప్రజలు ఉన్నారు.
నరకప్రాయం..!
టీడీపీ రాకతో ప్రజల్లో నమ్మకం
రోడ్లు బాగుచేయాలని వేడుకోలు
బల్లికురవ : మండలంలోని పలు గ్రామాల పరిధిలో ఉన్న అర్‌అండ్‌బీ రోడ్లు నరకప్రాయంగా మారాయి. వైసీపీ అయిదేళ్ల కాలంలో ఒక్క రోడ్డుపై తట్ట మట్టి కూడా వేయలేదని దీంతో దెబ్బతన్న రోడ్లలో నిత్యం పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలలో రోడ్లు అభివృద్ధి జరుగుతాయి అనే ఆశలు కలుగుతున్నాయి. ఏ నోటా విన్న ప్రజలు రోడ్ల గురించే చర్చించుకుంటున్నారు.
బల్లికురవ మండలంలోని పలు రోడ్లు నూరు శాతం దెబ్బతిన్నాయి. పలు తారు రోడ్లు మట్టి రోడ్లగా మారాయి. ఇప్పుడు వర్షాలు పడుతుండడంతో బురద మయంగా మారాయి. నిత్యం ఈ రోడ్లలో ప్రమాదాల బారిన ప్రజలు పడుతున్నారు. మోకాటి లోతు గోతులు ఏర్పడడంతో కొత్త వ్యక్తులు ఈ రోడ్ల వైపు ప్రయాణం చేస్తే వారు తీవ్ర ఇబ్బదులు పడుతున్నారు. బల్లికురవ మండల కేంద్రం నుంచి కొణిదెన, మార్టురు అర్‌అండ్‌బీ రోడ్డు, బల్లికురవ నక్కబొక్కలపాడు మార్టురు రోడ్లు, అలానే బల్లికురవ సంతమాగులూరు రోడ్డు, కొప్పెరపాడు వెలమవారిపాలెం రోడ్డు, చెన్నుపల్లి ఆనంతవరం రోడ్డు, చెన్నుపల్లి, వైదన రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ రోడ్లపై ప్రయాణం అంటేనే ప్రజలు బెంబేలేత్తి పోతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి రోడ్లు దెబ్బ తిన్నాయి అని చెప్తున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని వాహనదారులు అరోపిస్తున్నారు. బల్లికురవ కొణిదెన మార్టురు రోడ్డు 10 కిలోమీటర్ల ప్రయాణం గంట సేపు పడుతుందని వారు వాపోతున్నారు. అధికారులు వెంటనే దెబ్బ తిన్న రోడ్ల అభివృద్ధికి నివేదికలు తయారు చేసి ఉన్నత స్ధాయికి పంపించాలని వాహన దారులు, ప్రయాణికులు కోరుతున్నారు.