Share News

రహదారి మరమ్మతులు చేయరూ!

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:40 PM

ఎర్రగొండపాలెం నుంచి త్రిపురాంతకం వైపు వెళ్లే ఆర్‌అండ్‌బీ వెంబడి అడుగులోతు గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉంది.

రహదారి మరమ్మతులు చేయరూ!

ఎర్రగొండపాలెం, ఆగస్టు 24 : ఎర్రగొండపాలెం నుంచి త్రిపురాంతకం వైపు వెళ్లే ఆర్‌అండ్‌బీ వెంబడి అడుగులోతు గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉంది. వర్షాకాలంలో ఈ గోతుల్లో నీరు నిలుస్తోంది. దీంతో ఈ రోడ్డు పక్కన నడిచి వెళ్లే పాదచారులపై వాహనాల రాకపోకల సమయంలో బురదనీరు చింది పాదచారులపై పడుతోంది. ఇది రాష్ట్ర రహదారి కావడంతో ఈ రోడ్డుపై నిత్యం వాహనాలు ఎక్కువగానే తిరుగుతున్నాయి. ఎర్రగొండపాలెం నుంచి గుంటూరు, విజయవాడ పట్టణాలకు ఆర్‌టీసీ, ఎక్స్‌ప్రెస్‌ బస్‌ సర్వీసులు ఎక్కువగానే ఈ మార్గంలో వెళుతుంటాయి. విజయవాడ డిపో, వినుకొండ డిపో బస్సులు ఈ మార్గంలో నడుపుతున్నారు. ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల ప్రజలు గుంటూరు, విజయవాడ వైద్యశాలలకు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం మండలాల మధ్య ఆటోలు నడపాలంటే ఆటో డ్రైవర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ఇంచుమించు ఏడు కిలోమీటర్ల మేర రహదారి మరమ్మతులకు గురైంది. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి కనీసం గుంతలు పూడ్పించాలని రెండు మండలాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

పుల్లలచెరువు : మండలంలోని పలు గ్రామాల లింకు రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా అడుగడుకో గుంత మాదిరిగా రోడ్లు తయారయ్యాయి. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ అన్న వ్యత్యాసం లేకుండా దాదాపు అన్ని రోడ్లది ఇదే పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వ కాలంగా రోడ్ల గురించి పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు పేర్కొన్నారు. పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బీ రోడ్డుల్లో ప్రయాణం చేయాలంటే వాహనదారులు బంబేలేత్తుతున్నారు. ప్రఽధానంగా మండలంలోని ముటుకుల-గుట్లపల్లి, గంగవరం-పుల్లలచెరువు, చాపలమడుగు- మిట్టపాలెం, మానేపల్లి- ముటుకుల, కవలకుంట్ల-పుల్లలచెరువు, పుల్లలచెరువు-గారపెంట,రంగనపాలెం-కుందంపల్లి, మానేపల్లి-అయ్యాగానిపల్లె, ముటుకుల-రెంటపల్లి, ముటుకుల-పుల్లలచెరువు, చాపలమడుగు-సికోత్తపల్లి రోడ్డుల్లో ప్రయాణం చేయాలంటే నరకయాతన పడుతున్నారు. ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోక రోడ్డుల్లో బారకు ఒక గుంతవుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

చిప్స్‌ పరిచారు- రోడ్డు మరిచారు

పుల్లలచెరువు మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలోని గంగవరానికి గత 75 ఏళ్లుగా సరైన రోడ్డు లేదు. దీంతో గ్రామ ప్రజలు నిత్యం పుల్లలచెరువుకు నిత్యవసరాలు, వ్యవసాయ అవసరాలకు ప్రయాణాలు సాగిస్తుంటారు. ఏళ్ల తరబడి రోడ్డు లేకపోవడంతో నిత్యం ఇబ్బంది పడుతున్నారు. సమస్యను గుర్తించిన నాటి టీడీపీ ప్రభుత్వ హాయంలో 2019లో ప్రత్యేక ప్యాకేజీ కింద రోడ్డు మంజూరు చేసింది. అయితే పనులు మొదలు పెట్టి చిప్స్‌ తోలగానే 2019 ఎన్నికల కోడ్‌ వచ్చింది. అప్పటి నుంచి రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. ఎన్నికల అనంతరం కాంట్రాక్టరు మరోసారి రెండవ లేయరు చిప్స్‌ పోశారు. అయితే వైసీపీ ప్రభుత్వం రావడంతో బిల్లులు రాక రహదారి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. నిర్మాణం కోసం తోలిన చిప్స్‌ లేచిపోయి వర్షం పడినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదేళ్లుగా, పనులు నిలిచిపోయినా అధికారులు కాని, వైసీపీ ప్రజా ప్రతినిధులు కాని పట్టించుకున్న పాపన పోలేదు. ప్రస్తుతం మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:40 PM