Share News

భిన్న వాతావరణం

ABN , Publish Date - May 07 , 2024 | 01:16 AM

జిల్లాలో ప్రత్యేకించి పశ్చిమ ప్రాంతంలో సోమవారం భిన్న వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం వరకు ఆప్రాంతంలో ఎండలు మండిపోయాయి. ఆతర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

భిన్న వాతావరణం
ఈదురుగాలులకు కంభంలో విరిగిపడిన అరటి చెట్లు

మధ్యాహ్నం వరకు మండిన ఎండ

తర్వాత ఈదురు గాలులు, వర్షం

పలుచోట్ల వడగళ్ల వాన

కంభంలో 200 ఎకరాల్లో నేలకొరిగిన అరటి చెట్లు

ఒంగోలు, మే 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రత్యేకించి పశ్చిమ ప్రాంతంలో సోమవారం భిన్న వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం వరకు ఆప్రాంతంలో ఎండలు మండిపోయాయి. ఆతర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మబ్బులుకమ్మి గాలులతోపాటు వర్షం కురిసింది. పలుచోట్ల ఒక మోస్తరు వాన పడింది. గాలుల తీవ్రతతో అక్కడక్కడా నష్టాలు కూడా సంభవించాయి. జిల్లాలో దాదాపు నెలరోజులుగా ఎండలు మండుతున్నాయి. వారం నుంచి తీవ్రత మరింత పెరిగింది. పశ్చిమప్రాంతం నిప్పులకొలిమిలా మారుతోంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆప్రాంతంలోని అత్యధిక మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. చాలాచోట్ల సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వరకూ కూడా ఎండల తీవ్రత అలాగే ఉంది. ఆతర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. ఆకాశంలో మబ్బులు పట్టి చల్లబడటంతోపాటు పెద్దఎత్తున గాలులు వీచాయి. ఆతర్వాత వర్షం కురిసింది. కంభం, బేస్తవారపేట, పామూరు, కురిచేడు, కనిగిరి, గిద్దలూరు, వెలిగండ్ల, హనుమంతునిపాడు, దోర్నాల, తర్లుబాడు, సీఎస్‌పురం, మార్కాపురం, పుల్లలచెరువు, అర్ధవీడు, పొదిలి తదితర మండలాల్లో ఆ పరిస్థితి ఉంది. కొన్నిచోట్ల జల్లులు పడగా, మరికొన్ని చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కంభం, బేస్తవారపేట మండలాల్లో వడగండ్ల వాన పడింది. కాగా కంభం ప్రాంతంలో ఈదురుగాలులకు దాదాపు 200 ఎకరాల్లో అరటి చెట్లు నేలకొరిగాయి. సుమారు రూ.4 కోట్ల మేర రైతులకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. జిల్లాలోని తూర్పు ప్రాంతంలో మధ్యాహ్నం వరకూ ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత వాతావరణం చల్లబడింది.

Updated Date - May 07 , 2024 | 01:16 AM