తప్పు చేశామా?
ABN , Publish Date - May 26 , 2024 | 11:13 PM
వలంటీర్లలో అంతర్మథనం ఆరంభమైంది. వైసీపీ నేతల మాటలు నమ్మి రాజీనామా చేసిన వారు ఇప్పుడు అయోమయంలో పడిపోయారు. అవకాశం ఉంటే తమ రాజీనామా పత్రాలు వెనక్కి ఇవ్వాలని కొందరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులకు కాగితాన్ని ఇవ్వకుండా జేబులో పెట్టుకొని రాజీనామా చేసినట్లు నాటకం ఆడిన వారు వాటిని చించివేస్తున్నారు. ఇక స్వచ్ఛందంగా వైదొలిగిన వలంటీర్లకు నెలకు వచ్చే జీతం మొత్తం ఇస్తామని వైసీపీ నాయకులు చెప్పారు. తొలినెల చెల్లించిన వారు.. రెండో నెల వచ్చేసరికి మొండిచెయ్యి చూపారు. దీంతో వారి ఇళ్లచుట్టూ రాజీనామా చేసిన వలంటీర్లు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్నిచోట్ల శాపనార్థాలు పెడుతున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా వలంటీర్ల అంశంపై ప్రజానీకంలో కూడా చర్చ ఆరంభమైంది.
వలంటీర్లలో అంతర్మథనం
వైసీపీ నేతల హామీలు, ఒత్తిళ్లతో 4,238 మంది రాజీనామా
నెలకు వచ్చే జీతం మొత్తం చెల్లిస్తామని చెప్పడంతో నమ్మకం
ఇప్పుడు ముఖంచాటేసి మోసం
వారి ఇళ్లచుట్టూ వలంటీర్ల ప్రదక్షిణలు
ఆమోదం పొందని రాజీనామాలను వెనక్కి తీసుకునేందుకు కొందరు ప్రయత్నం
కొన్నిచోట్ల కూటమి అభ్యర్థుల వద్దకు క్యూ
వలంటీర్లలో అంతర్మథనం ఆరంభమైంది. వైసీపీ నేతల మాటలు నమ్మి రాజీనామా చేసిన వారు ఇప్పుడు అయోమయంలో పడిపోయారు. అవకాశం ఉంటే తమ రాజీనామా పత్రాలు వెనక్కి ఇవ్వాలని కొందరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులకు కాగితాన్ని ఇవ్వకుండా జేబులో పెట్టుకొని రాజీనామా చేసినట్లు నాటకం ఆడిన వారు వాటిని చించివేస్తున్నారు. ఇక స్వచ్ఛందంగా వైదొలిగిన వలంటీర్లకు నెలకు వచ్చే జీతం మొత్తం ఇస్తామని వైసీపీ నాయకులు చెప్పారు. తొలినెల చెల్లించిన వారు.. రెండో నెల వచ్చేసరికి మొండిచెయ్యి చూపారు. దీంతో వారి ఇళ్లచుట్టూ రాజీనామా చేసిన వలంటీర్లు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్నిచోట్ల శాపనార్థాలు పెడుతున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా వలంటీర్ల అంశంపై ప్రజానీకంలో కూడా చర్చ ఆరంభమైంది.
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రారంభించిన వలంటీర్ల వ్యవస్థ ఎన్నికల సందర్భంగా వివాదాస్పదమైంది. వలంటీర్లపైనే ఆధారపడి వైసీపీ ముందుకు సాగిన విషయం విదితమే. వారిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని ఈసీ నిర్ణయించిన తర్వాత రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో వలంటీర్లను పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో పార్టీకి పనిచేయాలని, ఏజెంట్లుగా కూర్చోవాలని వైసీపీ నాయకత్వం పిలుపునిచ్చింది. తదనుగుణంగా వైసీపీ నేతలు, ప్రధానంగా అభ్యర్థులు వలంటీర్లపై ఒత్తిడి చేసి ఉద్యోగాలకు రాజీనామా చేయించారు. తిరిగి మన ప్రభుత్వమే వస్తుంది, మీ ఉద్యోగాలకు మాది హామీ అంటూ వారికి నమ్మబలికారు. వలంటీర్ల ఉద్యోగాలన్నీ పార్టీ శ్రేణులకే ఇచ్చినందున వారి నుంచి మంచి స్పందన వస్తుందని కూడా వైసీపీ ఆశించింది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థే ఉండదని ప్రచారం కూడా చేసింది. వలంటీర్లు కూడా ఆవైపు ఆకర్షితులైనట్లే కనిపించింది. పరిస్థితులను గుర్తించిన టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం ఏర్పడినా వలంటీర్ల ఉద్యోగాలకు ఢోకా లేదని చెప్పడంతోపాటు నెలవారీ ఐదు వేల గౌరవ వేతనాన్ని పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇది వైసీపీ పిలుపునకు అనుగుణంగా రాజీనామాలు చేస్తున్న వలంటీర్లు వెనుకంజ వేసేందుకు కారణమైంది. దీంతో అధికార పార్టీ అభ్యర్థులు, నాయకులు రంగంలోకి దిగి వలంటీర్లపై ఒత్తిడి తెచ్చి వారిని రాజీనామాలు చేయించే కార్యక్రమాలకు శ్రీకారం పలికారు. ప్రతి వలంటీర్‌కు ఐదువేల రూపాయలతోపాటు గిఫ్ట్‌లు కూడా అందజేశారు. తిరిగి ఉద్యోగంలో చేరే వరకు ప్రభుత్వం నుంచి ఆగిపోయే నెలవారీ జీతం, అదనపు పారితోషికాలు ఇస్తామని హామీలు ఇచ్చారు. పనిగట్టుకుని తొలి నెల వలంటీర్లందరికీ ఐదువేల నగదుతోపాటు గృహోపకరణాలను బహుమతిగా అందజేశారు. దీంతో సంబరపడిన వేలాది మంది వలంటీర్లు రాజీనామాలు చేశారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 12,270 మంది వలంటీర్లు ఉండగా, అందులో 4,238 మంది రాజీనామా చేశారు. వీరిలో కొందరు వివిధ కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించబడిన వారూ ఉన్నారు.
డబ్బుల కోసం ఒత్తిడి
మార్కాపురంలో వైసీపీ తరఫున పోటీ చేసిన అన్నా రాంబాబు రాజీనామా చేసిన వలంటీర్లకు రెండు రోజుల క్రితం ఈనెలకు ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున పంపిణీ చేశారు. ఎన్నికలకు ముందు నియోజకవర్గంలోని 1,580 మంది వలంటీర్లకు డబ్బులు ఇచ్చిన ఆయన ప్రస్తుతం రాజీనామా చేసిన 480 మందికి మాత్రమే పరిమితం చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో చెప్పిన ప్రకారం డబ్బులు ఇవ్వకపోవడంతో స్థానిక నాయకులు, అభ్యర్థుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు నియోజకవర్గాల్లో లేకపోవడంతో స్థానిక నాయకులపై ఒత్తిడి పెంచారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో సరాసరిన 600 మంది వరకు రాజీనామా చేసిన వలంటీర్లు మాటతప్పిన వైసీపీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసే పనిలో ఉన్నారు. దర్శి నియోజకవర్గంలో 1,393 మందికిగాను 799 మంది, కనిగిరిలో 1,286 మందికిగాను 682 మంది వలంటీర్లు రాజీనామా చేయగా ఒక్క ఒంగోలు నగరంలోనే 1,342 మందికిగాను 713 మంది రాజీనామా చేశారు. ఇలా అన్ని నియోజవకవర్గాల్లో సరాసరి 600 మందికిపైగా రాజీనామా చేసిన వలంటీర్లు ఈనెల వైసీపీ నాయకులు ఇచ్చిన హామీ మేరకు జీతం కూడా అందక ఇదేం ఖర్మ బాబూ అంటూ ఆవేదన చెందుతున్నారు.
నేడు అయోమయం
రాజీనామా చేసిన వలంటీర్లు తాజాగా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందంటూ బెట్టింగ్‌లు ఎక్కువగా జరుగుతుండటం అందుకు కారణమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాజీనామా చేసిన వారికి తిరిగి ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. అలాగే ఉన్న వలంటీర్లకు నెలకు రూ.10వేల గౌరవ వేతనం లభించే అవకాశం ఉంది. దీంతో రాజీనామా చేసిన వలంటీర్లతోపాటు విధి నిర్వహణలో ఉన్న వారిలో కూడా ఆందోళన ప్రారంభమైంది. దీంతో వలంటీర్లలో కొందరు గుట్టుచప్పుడు కాకుండా కూటమి అభ్యర్థుల దగ్గరకు వెళ్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వమే వస్తుంది. రాకపోయినా మాకు ఇబ్బంది లేదు అని భావిస్తున్న వారు నిలకడగానే ఉన్నారు. అయితే రాజీనామా సమర్పించినట్లు వైసీపీ నాయకులను నమ్మించి పత్రాలను జేబుల్లోనే పెట్టుకుని తెరచాటుగా వారికి మద్దతు ఇచ్చిన వారు మాత్రం ఆ కాగితాలను చించేసి అఽధికారుల వద్దకు వెళ్లి డ్యూటీలోనే ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
పోలింగ్ ముగియగానే మాట తప్పిన వైసీపీ నేతలు
రాజీనామా చేసిన వలంటీర్లకు తిరిగి జగన్ ప్రభుత్వం ఏర్పడి జీతం వచ్చే వరకు తాము ఇప్పటి వరకూ ఎంత ఇస్తున్నారో అంత చెల్లిస్తామని వైసీపీ నాయకులు హామీ ఇచ్చారు. ఆప్రకారం ఏప్రిల్‌లో దాదాపు వైసీపీ అభ్యర్థులంతా నియోజకవర్గాల్లోని వలంటీర్లకు తరతమ భేదం లేకుండా ఐదువేల ప్రకారం ఇచ్చారు. ఎక్కువ మంది అభ్యర్థులు ఆ సొమ్ముతోపాటు విలువైన గిఫ్ట్‌లు కూడా అందజేశారు. అలా కొన్ని నియోజవర్గాల్లో మార్చి, ఏప్రిల్ నెలలకు ఇవ్వగా, కొన్ని నియోజకవర్గాల్లో ఒక నెలకు మాత్రమే చెల్లించారు. ఇక మే ప్రారంభంలోనే ఎన్నికలు ఉండటంతో రాజీనామా చేసిన వలంటీర్లు పట్టించుకోకుండా వైసీపీ అభ్యర్థుల కోసం పనిచేశారు. పోలింగ్ అయిపోయిన తర్వాత డ్యూటీలో ఉన్న వలంటీర్లు ప్రభుత్వం నుంచి జీతం వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. 31వ తేదీలోపు బిల్లులు పెట్టండి వెంటనే జీతాలు వేస్తామని ఎంపీడీవోలు, మునిపల్ కమిషనర్లకు ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు. అయితే రాజీనామాలు చేసిన, అలాగే ఎన్నికల ప్రచారాల్లో పాల్గొని అధికారులు తొలగించిన వలంటీర్లకు జీతాలు ఇవ్వబోమని ప్రకటించారు. అదేసమయంలో పోలింగ్ ముగియడంతో వైసీపీ నాయకులు ముఖం చాటేశారు. దీంతో రాజీనామా చేసిన వలంటీర్లంతా ముందు ఇచ్చిన హామీ ప్రకారం మాకు జీతం ఇవ్వండంటూ వైసీపీ నాయకులు, అభ్యర్థుల ఇళ్ల చుట్టూ తిరగడం ప్రారంభించారు.