Share News

అక్రమ కట్టడం కూల్చివేత

ABN , Publish Date - Jul 28 , 2024 | 01:18 AM

వైసీపీ హయాంలో ఆపార్టీ నేత అధికారాన్ని అడ్డుపెట్టుకొని నిర్మించిన ఓ అక్రమ కట్టడంపై అధికారులు కొరడా ఝులిపించారు. అతను మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురు అన్నక్యాంటీన్‌ పక్కన అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని శనివారం కూల్చివేశారు.

అక్రమ కట్టడం కూల్చివేత
అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తున్న అధికారులు

వైసీపీ హయాంలో కాంప్లెక్స్‌ నిర్మించిన ఆ పార్టీ నేత

నోటీసుకు స్పందించకపోవడంతో రంగంలోకి అధికారులు

మార్కాపురం వన్‌టౌన్‌, జూలై 27: వైసీపీ హయాంలో ఆపార్టీ నేత అధికారాన్ని అడ్డుపెట్టుకొని నిర్మించిన ఓ అక్రమ కట్టడంపై అధికారులు కొరడా ఝులిపించారు. అతను మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురు అన్నక్యాంటీన్‌ పక్కన అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని శనివారం కూల్చివేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నియోజకవర్గ వైసీపీ ముఖ్యనేత అనుచరుడైన దేవెళ్ల సుబ్బారావు అనే వ్యక్తి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి అన్న క్యాంటీన్‌ ఎదురు ఉన్న స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టాడు. సర్వే నెంబర్‌ 494-బీ4లోని ఆ స్థలంలో క్రిస్టియన్‌ హౌసింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆంగ్లేయుల కాలం నుంచి ఒక బావి ఉండేది. అప్పట్లో ఈ బావి ద్వారా నీటిని తోడి ఎదురుగా ఉన్న ఏబీఎం కాంపౌండ్‌లోని దొర నివాసం వెనుక పొలాలకు నీరు పెట్టి పంటలు పండించేవారు. ఆంగ్లేయులు దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత ఈ అతిపెద్ద బావి కాలక్రమేనా వినియోగంలో లేకుండా పోయింది. ఆతర్వాత ఆర్టీసీ బస్టాండ్‌ను నిర్మించారు. దీంతో ఈవైపు ఉన్న స్థలాలకు విపరీతమైన డిమాండ్‌ వచ్చింది. ఈ బావిపై కన్నేసిన వైసీపీ ముఖ్యనాయకుడి అనుచరుడు దాన్ని పూడ్చి వేశాడు. మున్సిపల్‌ ఆధీనంలో ఉన్న ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తప్పుడు పత్రాలు సృష్టించి నిర్మాణం చేపడుతుండగా అప్పట్లో సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు అడ్డుపడ్డారు. ధర్నాలు చేసి ఉన్నతాధికారులకు విజ్ఞప్తులు చేసినా అధికారాన్ని అడ్డుపెట్టుకొని యథేచ్ఛగా అక్రమ నిర్మాణాన్ని కొనసాగించాడు. విద్యుత్‌ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన వాణిజ్య సముదాయానికి విద్యుత్‌ మీటర్లు అమర్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టణంలోని ఆక్రమణలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఆక్రమణదారుడైన వైసీపీ నేతకు మున్సిపల్‌ అధికారులు నోటీసులు ఇచ్చినా స్పందించ లేదు. దీంతో అధికారులు కట్టడాలను కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ డీఈ షేక్‌ సుభాని, ఏఈ ఆదినారాయణ, పట్టణ ప్రణాళిక అధికారి శ్రీనివాసులు, సీనియర్‌ అసిస్టెంట్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో అనుమతులు లేని భవనాలను తొలగిస్తామని ఈ సందర్భంగా కమిషనర్‌ కిరణ్‌ స్పష్టం చేశారు.

Updated Date - Jul 28 , 2024 | 01:18 AM