Share News

అలంకారప్రాయంగా ఎత్తిపోతలు..!

ABN , Publish Date - May 26 , 2024 | 10:15 PM

పేరుకి మాత్రం ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ఎత్తిపోతల పథకాలైనా రైతులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. ఏళ్లుగా మరమ్మతులకు గురై అలంకారప్రాయంగా మారాయి. ప్రతి ఏటా సాగు సమయంలో రైతులు ఎత్తిపోతల పథకాలు వినియెగంలో లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైతుల పర్యవేక్షణలో ఉన్న పథకాలు మాత్రం పలు గ్రామాల్లో వినియోగంలో ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు మాత్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అటకెక్కాయి.

అలంకారప్రాయంగా ఎత్తిపోతలు..!
నక్కబొక్కలపాడులో రెండేళ్లుగా నిరుపయెగంగా ఉన్న ఎత్తిపోతల పథకం

ఏళ్లుగా మూలనపడిన పథకాలు

ట్రాన్స్‌ఫార్మర్‌లు లేక నిరుపయోగం

నక్కబొక్కలపాడు, ఉప్పుమాగులూరులో పనిచేయని వైనం

గుంటుపల్లిలో విద్యుత్‌ లైన్‌లేక రైతుల అవస్థలు

ఈఏటైనా నీళ్లందేనానని అన్నదాతల ఆందోళన

పట్టించుకోని అధికారులు

బల్లికురవ, మే 26 : పేరుకి మాత్రం ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ఎత్తిపోతల పథకాలైనా రైతులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. ఏళ్లుగా మరమ్మతులకు గురై అలంకారప్రాయంగా మారాయి. ప్రతి ఏటా సాగు సమయంలో రైతులు ఎత్తిపోతల పథకాలు వినియెగంలో లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైతుల పర్యవేక్షణలో ఉన్న పథకాలు మాత్రం పలు గ్రామాల్లో వినియోగంలో ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు మాత్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అటకెక్కాయి. విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, పైపు లైన్ల లీకులతో పలు పథకాలు పనిచేయడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పట్టించుకోవాల్సిన అఽధికారులు ఎత్తిపోతలను గాలికొదిలేశారు. ఇలాగైతే ఈ పథకాలన్నీ శిథిలావస్థకు చేరుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బల్లికురవ మండలంలోని నక్కబొక్కలపాడులో 2008లో అప్పటి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కృషితో సుమారు రూ.8కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. 12 వందల ఎకరాల మెట్ట భూములకు సాగు నీటిని అందించేలా ఉన్న ఈ పథకం కొంతకాలం బాగానే పనిచేసింది. ఐదేళ్ల కిందట ఎత్తిపోతల పథకంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి వైరు చోరీకి గురైంది. అప్పటి నుంచి ఆ పథకం నిరుపయోగంగా మారింది. సమస్య చిన్నదైనా పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం కారణంగా పథకం నిరుపయోగంగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ సీజన్‌ ప్రారంభ సమయంలో ఏటా పథకాన్ని వినియెగంలోకి తీసుకురావాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నా నేటిక దీనికి ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు కాలేదు. దీనినిబట్టి పథకాల అమలుపై అధికారులకు, పాలక పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. దీంతో అయకట్టులో ఉన్న రైతులు పంటల సాగుకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల ద్వారానైనా మెట్ట పంటలకు నీరు అందుతుందని అశలతో ఉన్నారు. అయినా ఏళ్లుగా మరమ్మతులకు గురై ఉండడం చూసి నిరాశకు గురవుతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఎత్తిపోతలకు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ లేక మూలనపడిందని రైతులు అంటున్నారు. వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయకుంటే వినియెగంలో ఉన్న మోటార్లు కూడా మర్మతులకు గురవుతాయని చెప్తున్నారు. గుంటుపల్లి గ్రామంలో గత మూడు దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాన్ని ఐదేళ్ల కిందట రూ.2కోట్లు వెచ్చించి ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇక్కడ అన్ని వసతులున్నా 18 గంటల విద్యుత్‌ లైన్‌ మర్మతులకు గురికావడంతో పథకం నిరుపయోగంగా మారింది. గుంటుపల్లి ఎత్తిపోతల ద్వారా కొత్తపాలెం, బల్లికురవ గ్రామాలలోని భూములకు సాగు నీరు అందాల్సి ఉంది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా విద్యుత్‌ లైన్‌ ఏర్పాటును పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మంచి వర్షాలు కురిస్తే ఈ ఏడాది సాగర్‌ నీరు విడుదలైతే మాగాణి, మొక్కజొన్న పంటల సాగు ప్రారంభం అవుతుందని, ప్రత్యేక విద్యుత్‌ లైన్‌ను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఉప్పుమాగులూరు గ్రామంలో వేణుగోపాల స్వామి ఎత్తిపోతల పథకం కింద 2100 ఎకరాల అయకట్టు భూమి ఉంది. కొంతకాలం నుంచి పైపులైన్‌ లీక్‌ల కారణంగా పథకం నిరుపయోగంగా మారింది. అయకట్టులోని ఉప్పుమాగులూరు, సోమవరప్పాడు, గంగపాలెం, పల్నాడు జిల్లాలోని గోపాలంవారిపాలెం గ్రామాలలోని మెట్ట పంటలకు సాగు నీరు అందాల్సి ఉంది. అధికారులు వెంటనే స్పందించి నిరుపయెగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలను వెంటనే వినియోగంలోకి తేవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పేరుకే ఐడీసీ వినియెగంలో మాత్రం నిల్‌

ప్రభుత్వం ద్వారా ఐడీసీ కింద ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వినియెగంలో మాత్రం ఏళ్ల తరబడి అలానే ఉన్నాయి. కోట్లు వెచ్చించిన పథకాలు పనిచేయకపోవడంతో ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఆయా గ్రామాల పరిధిలో ఉన్న ఎత్తిపోతల ఇతర సాగు నీటి పథకాల నిర్వహణ, మరమ్మతుల విషయమై అధికారులు రైతులతో సమావేశమై వ్యవసాయ సీజన్‌లో వినియోగంలో ఉండేలా చూడాల్సి ఉంది. అయినా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వేల ఎకరాలకు సాగు నీరిస్తున్నట్లు అధికారులు లెక్కల్లో చెప్పడం తప్ప ఆచరణలో ఎక్కడా ఏదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాదైనా నీరొచ్చేనా

ఏళ్లుగా మరమ్మతులకు గురైన ఎత్తిపోతల పథకాలు ఈ ఏడాదైనా వినియెగంలోకి తెచ్చి సాగు నీటిని అందిస్తారా అని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. జూన్‌లో వర్షాలు కురిస్తే పలు రకాల పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధపడతారని, వాటికి అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు అధికారులు పథకాలను వినియోగంలోకి తేవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పథకాల మరమ్మతులు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Updated Date - May 26 , 2024 | 10:15 PM