Share News

దళిత ద్రోహి జగన్‌

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:35 PM

దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి ముమ్మాటికి జగన్‌రెడ్డేనని ఎమ్మెల్యే స్వామి విమర్శించారు. ఎస్సీలకు మేనమామనని చెప్పి ఆయన కంసమామగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరాయకొండలోని అంబేడ్కర్‌నగర్‌లో మంగళవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో స్వామి పాల్గొన్నారు.

దళిత ద్రోహి జగన్‌
మాట్లాడుతున్న ఎమ్మెల్యే స్వామి

మేనమామనని చెప్పి కంసమామగా మారాడు

వారికి అందే 27 పథకాలు రద్దు

వైసీపీ ప్రభుత్వంలో దళితులపై హత్యలు దాడులు, దౌర్జన్యాలు కోకొల్లలు

కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తే తరిమికొడతారు

మంత్రి సురే్‌షపై ఎమ్మెల్యే స్వామి ఫైర్‌

సింగరాయకొండ, జనవరి 9 : దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి ముమ్మాటికి జగన్‌రెడ్డేనని ఎమ్మెల్యే స్వామి విమర్శించారు. ఎస్సీలకు మేనమామనని చెప్పి ఆయన కంసమామగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరాయకొండలోని అంబేడ్కర్‌నగర్‌లో మంగళవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో స్వామి పాల్గొన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు దళిత వ్యతిరేకని మంత్రి సురేష్‌ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. టీడీపీ హయాంలో స్థానిక గురుకుల పాఠశాలలో సైన్స్‌ గ్రూపును మంజూరు చేసి 160 సీట్లు, జరుగుమల్లి మండలం బిట్రగుంట కస్తుర్బా జూనియర్‌ కళాశాలకు 80 సీట్లు కేటాయించామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆసీట్లన్నింటినీ రద్దు చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో సుమారు 4వేల సీట్లు రద్దుచేసిన ఘనత జగన్‌ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. దీనికి మంత్రి సురేష్‌ సమాధానం చెప్పాలన్నారు. గత ప్రభుత్వంలో కొండపిలో ఎస్సీలకు ఉపయుక్తంగా రూ.50 లక్షలు వెచ్చించి అంబేడ్కర్‌ భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తే ఈ ప్రభుత్వంలో అర్ధంతరంగా నిలిపివేశారన్నారు. ఇక్కడే వైసీపీకి దళితులపై ఉన్న ప్రేమ అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో పొన్నలూరులో రూ.5కోట్లతో ఎస్టీ గురుకుల పాఠశాలకు మంజూరు చేయిస్తే, వైసీపీ వచ్చాక ఆపనులను నిలిపివేసి గిరిజలకు ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. తమ హయాంలో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లను నిర్మిస్తే వైసీపీ పాలనలో ఒక్క సైడు కాలువను కూడా నిర్మించలేదన్నారు. జగన్‌రెడ్డి వచ్చాక ఎస్సీ. ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను పూర్తిగా దుర్వినియోగం చేశారని స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేసి వాటి ద్వారా ఒక్క రూపాయి కూడా దళితులకు కేటాయించలేదని వివరించారు. బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలను రద్దుచేసి దళితులను విద్యకు దూరం చేశారన్నారు. అంబేడ్కర్‌ విదేశీవిద్య పథకానికి జగన్‌పేరు పెట్టడంలోనే వైసీపీ కుటిల బుద్ధి తేటతెల్లమైందన్నారు. మాస్కు అడిగిన పాపానికి దళితుడైన డాక్టర్‌ సుధాకర్‌ను పిచ్చివాడిగా ముద్రవేసి హింసించి అతని చావుకు కారణమయ్యారని దుయ్యబట్టారు. చీరాలలో మాస్కు పెట్టుకోలేదని దళిత యువకుడు కిరణ్‌ను కొట్టి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్‌ను అతికిరాతంగా హత్య చేసి డోర్‌ డెలవరీ చేశారని గుర్తుచేశారు. అధికారపార్టీ నేతల ఇసుక అక్రమ రావాణాను ప్రశ్నిస్తే గోదావరి జిల్లాలో దళిత యువకుడికి శిరోముండనం చేసి వైసీపీ నేతలు దాష్టీకాన్ని ప్రదర్శించారని ధ్వజమెత్తారు. సురేష్‌ సొంత నియోజకవర్గమైన ఎర్రగొండపాలెంలో పోలీసుల వేధింపులతో దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. ఇలా.. దళితులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతుంటే దళితమంత్రిగా ఎందుకు నోరు మెదపలేదని మంత్రి సురే్‌షను స్వామి ప్రశ్నించారు. వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో కొండపి నియోజవర్గాన్ని గాలికొదిలేసి ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చి అభివృద్ధి చేస్తామని సురేష్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరో నెలలో ఎన్నికల కోడ్‌ వస్తుందని, ఈలోపు మీరు చేసే అభివృద్ధి ఏమిటని స్వామి ప్రశ్నించారు. వైపాలెంలో గిరిజనలను మభ్యపెట్టినట్లు కొండపి నియోజకవర్గంలో ప్రజలను మోసపుచ్చలేవన్నారు. చంద్రబాబు నాయుడు కనిగిరి సభలో మాట్లాడుతూ ఒక నియోజకవర్గంలో పనికిరాని ఎమ్మెల్యే మరో నియోజవర్గంలో ఎలా పనికి వస్తారు అని ఉదహరిస్తూ ఒక చోట చెత్త మరో చోట బంగారమవుతుందా అని వ్యాఖ్యానించారన్నారు. దానిని వక్రభాష్యం చెబుతూ దళిత మంత్రిని అవమానించారని సురేష్‌ చెప్పుకోవడం అతని దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. తనను చూసి కాకుండా జగన్‌ను చూసి ఓటువేయాలని ప్రజలను కోరడాన్ని చూస్తే ఆయనపై ఆయనకు ఎంత నమ్మకం ఉందో తేటతెల్లమవుతుందన్నారు. నియోజకవర్గంలో మిగిలి ఉన్న అభివృద్ధిని పూర్తిచేయాలంటే అందుబాటులో ఉండే తనను గెలిపించాలని స్వామి కోరారు. స్థానికేతరులను ఓటుతో తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేల్పుల సింగయ్య, నేతలు చీమకుర్తి కృష్ణ, షేక్‌ సంధానీబాషా, కూనపరెడ్డి సుబ్బారావు, మందలపు గాంధీచౌదరి, గుదే వెంకటేశ్వర్లు, సుదర్శి చంటి, జనసేన నేతలు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 11:35 PM