Share News

రోజుకో రగడ

ABN , Publish Date - Jan 30 , 2024 | 01:30 AM

అధికార వైసీపీలో అభ్యర్థుల రగడ కొనసాగుతూనే ఉంది. గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబు కేంద్రంగా ద్వితీయస్థాయి నాయకుల్లో జగడం ప్రారంభం కాగా నియోజకవర్గాన్ని వీడేందుకు మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి సిద్ధం కాలేదు.

రోజుకో రగడ

ఆయనకు మద్దతుగా అనుచరుల కార్యక్రమాలు

కొమరోలులో సమావేశం, బేస్తవారపేటలో ర్యాలీ

తాడేపల్లి చేరిన బాలినేని

నేడు మిగిలిన స్థానాల విషయం కొలిక్కి వచ్చే అవకాశం

మళ్లీ సీఎంవోకు వెళ్లిన బుర్రా

పర్చూరు నుంచి పోటీకి భరత్‌ సిద్ధం

అధికార వైసీపీలో అభ్యర్థుల రగడ కొనసాగుతూనే ఉంది. గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబు కేంద్రంగా ద్వితీయస్థాయి నాయకుల్లో జగడం ప్రారంభం కాగా నియోజకవర్గాన్ని వీడేందుకు మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి సిద్ధం కాలేదు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ మరోచోట అవకాశం కోసం సోమవారం కూడా సీఎంవో చుట్టూ ప్రదక్షిణలు చేశారు. విజయసాయి నుంచి వచ్చిన సమాచారంతో జిల్లాలో ఆపార్టీ ముఖ్యనేత, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సోమవారం సాయంత్రానికి తాడేపల్లి చేరారు. అప్పటికే అటు జగన్‌, ఇటు విజయసాయిలు వేరే కార్యక్రమాలకు వెళ్లడంతో వెనుదిరిగారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలోని ఒంగోలు లోక్‌సభ, గిద్దలూరు, మార్కాపురం, కందుకూరు, పర్చూరు అసెంబ్లీ స్థానాలపై అధిష్ఠానం చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

గిద్దలూరు నియోజకవర్గ అధికార పార్టీలో అభ్యర్థి రచ్చ నెలకొంది. స్థానికేతర నాయకులను పంపవద్దు అంటూనే మాజీ మంత్రి బాలినేనిని పంపితే మాకు ఓకే అని ఆ నియోజకవర్గంలోని కొందరు వైసీపీ ప్రజాప్రతిని ధులు ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే అన్నా రాంబాబు అనుచరులు బహిర్గతమయ్యారు. ‘రాంబాబుని స్థానికేతరుడని ఆ నాయకులు ఎలా అంటారు, ఆయన స్థానికుడే. ఆయనకే టికెట్‌ ఇవ్వాలి’ అని అధిష్ఠానాన్ని కోరుతూ కొమరోలు, బేస్తవారపేట మండ లాలకు చెందిన కొందరు నాయకులు సోమవారం మీడి యా సమావేశం పెట్టి బహిరంగ ప్రకటనలు చేశారు. బేస్తవారపేటలో అయితే రాంబాబు మద్దతుదారులు ప్రదర్శన కూడా చేశారు. దీంతో అసలు పోటీచేయనని ప్రకటించిన ఎమ్మెల్యే రాంబాబు తిరిగి పోటీకి సిద్ధమ య్యాడన్న విషయం తేటతెల్లమైంది. శనివారం నాటికి ఆయన మార్కాపురం నుంచి పోటీకి సిద్ధపడినట్లు సమా చారం. కుమారుడు కృష్ణచైతన్య ఒత్తిడితో ఆయన తిరిగి అధిష్ఠానంతో చర్చలకు వెళ్లినట్లు కూడా సమాచారం.

రాంబాబు స్థానికుడే

రాజకీయాల నుంచి వైదొలగకూడదని భావించిన అన్నా రాంబాబు కుమారుడు చైతన్య.. అవసరమైతే తాను పోటీకి సిద్ధమని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అందుకనుగుణంగా మార్కాపురం అయినా ఓకే అన్న సంకేతం ఇచ్చారు. దీంతో వారికి మార్కాపురం కేటాయించి ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని గిద్దలూరు పంపాలని అధిష్ఠానం భావించింది. అయితే అందుకు నాగార్జునరెడ్డి ససేమిరా అనటంతో తాత్కాలికంగా ఆ ఆలోచనను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో గిద్దలూరు నియోజకవర్గంలోని కొందరు నాయకులు మీడియా ముందుకు వచ్చి స్థానికేతరులు వద్దనటాన్ని సోమవారం రాంబాబు వర్గీయులు వ్యతిరేకించారు. రాంబాబు స్థానికుడే అని చెప్పటంతోపాటు ఆయనకే గిద్దలూరు టికెట్‌ ఇవ్వాలని కూడా కోరారు. దీంతో రాంబాబు లేక ఆయన కుమారుడు మార్కాపురం, కాకుంటే గిద్దలూరు నుంచి అయినా పోటీకి సిద్ధంగా ఉన్నారా? అన్న అనుమానాలు పెరిగాయి. నియోజకవర్గంలోని కిందిస్థాయి నాయకులు ఇలా విడివిడి ప్రకటనలు, గ్రూపు వ్యవహారాలతో వైసీపీలో ముఠాల హోరు పెరిగిపోయింది.

తాడేపల్లికి వెళ్లిన బాలినేని

పార్టీ అధిష్ఠానం బాలినేనిని తాడేపల్లికి పిలిచింది. ఒంగోలు లోక్‌సభ స్థానంతోపాటు మిగిలిన అసెంబ్లీల అభ్యర్థుల ఎంపికపై ఆయనతో మాట్లాడేందుకే పిలిచారు. ప్రధానంగా ఆదివారం గిద్దలూరులోని స్థానిక నాయకులు స్థానికేతరులకు ఈసారి టికెట్‌ వద్దంటూనే బాలినేని అయితే ఒకే అని చెప్పటాన్ని కూడా అధిష్ఠానంలోని నాయకులు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఒంగోలులో పోటీకి బాలినేని సిద్ధమైనప్పటికీ ఆయన కుమారుడికి లోక్‌సభకు పోటీకి అవకాశం ఇమ్మని గతంలోనే అడిగి ఉన్నారు. కానిపక్షంలో కుమారుడిని గిద్దలూరు నుంచి అయినా రంగంలోకి దింపే ఉద్దేశం బాలినేనికి ఉందా అన్న అనుమానాలు చాలామందికి లేకపోలేదు. ఈ విషయంపై కూడా అధిష్ఠానం బాలి నేనితో స్పష్టంగా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. సోమవారం మధ్యాహ్నానికల్లా విజయవాడ రావాలని విజయసాయి సూచించగా సాయంత్రానికి బాలినేని అక్కడికి చేరారు. దీంతో విజయసాయి చిలకలూరిపేట లో ఓ కార్యక్రమానికి వెళ్లిపోగా, సీఎం జగన్‌ కూడా ఆ సమయానికి ఇంట్లోకెళ్లి సీఎంవో అధికారులతో ప్రత్యేక కసరత్తులో మునిగిపోయారు. దీంతో బాలినేని మంగళవారం అధిష్ఠానం నాయకులను, సీఎంను కలిసేందుకు అక్కడే వేచి ఉన్నారు. ఒంగోలు లోక్‌సభ నుంచి చెవిరెడ్డిని రంగంలోకి దింపాలని అధిష్ఠానం భావిస్తున్నందున ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న బాలినేని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. చెవిరెడ్డికి, అతని కుమారుడికి అవకాశం ఇచ్చినట్లే తన కుమారుడికి కూడా అవకాశం ఇవ్వాలని బాలినేని పట్టుబట్టే అవకాశం లేకపోలేదు. కాగా కనిగిరి నుంచి తిరిగి తనకే టికెట్‌ ఇవ్వాలని కోరుతున్న ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ సోమవారం కూడా సీఎంవోలో ప్రత్యక్షమయ్యారు. కనిగిరి కాకుంటే కందుకూరు నుంచైనా పోటీచేయాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలిసింది. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాత్రం సోమవారం సీఎంను కలిసేందుకు వెళ్లకపోవటం చర్చనీయాంశం. మార్కాపురాన్ని వీడకూడదన్న దృఢనిర్ణయంతో ఆయన, ఆయన కుటుంబం ఉన్నట్లు తెలుస్తోంది.

పోటీకి భరత్‌ ఓకే

పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి తాను సిద్ధమని గొట్టిపాటి భరత్‌ సీఎం జగన్‌కు సమాచారం పంపారు. రెండురోజుల క్రితం జగన్‌ అతన్ని పిలి పించుకుని మీరు పోటీకి సిద్ధమేనా, ఎంతమేర ఆర్థిక వనరులు సమకూ ర్చుకోగలరని అడగటం తెలిసిందే. అన్నీ పరిశీలించుకుని సోమవారం చెబుతానని సమాధానమిచ్చిన భరత్‌.. సోమవారం తాడేపల్లి వెళ్లి తాను పోటీకి సిద్ధమని చెప్పినట్లు తెలిసింది. మరోవైపు పర్చూరు వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ ఆదివారం మరోసారి చీరాలలోని తన ముఖ్య అనుచరులతో ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. అదేసమయంలో రెండ్రోజుల క్రితం ఆయన కూడా విజయసాయిని కలిసి తాను పర్చూరు నుంచి పోటీకి దూరం కానని, చీరాల విషయంలో తాను చేసిన ప్రతిపాదననే పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. దీంతో మంగళ, బుధవారాల్లో పర్చూరుపై అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం లేకపోలేదు.

Updated Date - Jan 30 , 2024 | 01:30 AM