Share News

కౌంట్‌ డౌన్‌

ABN , Publish Date - Jun 02 , 2024 | 11:39 PM

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. సుదీర్ఘ ఉత్కంఠకు మరో 24 గంటల్లో తెరపడనుంది. విజేతలు ఎవ్వరన్నది తేలనుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాతే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒంగోలు పార్లమెంట్‌తోపాటు దాని పరిధిలో ఉన్న జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని సంతనూతలపాడు సెగ్మెంట్‌ ఓట్ల లెక్కింపు ఒంగోలులోని రైజ్‌ కాలేజీలో జరగనుంది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపునకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14, పార్లమెంట్‌ స్థానానికి 14 టేబుళ్లను విడివిడిగా ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌లు, ఆతర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్‌కు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. రైజ్‌ కళాశాల పరిసర ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించింది. ఫలితాల ప్రకటన అనంతరం అల్లర్లు జరగకుండా జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. 156 గ్రామాల్లో పోలీసు పికెట్ల ఏర్పాటుతోపాటు నాయకులు, ప్రధాన పార్టీల కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు.

కౌంట్‌ డౌన్‌
కళాశాలలో కౌంటింగ్‌కు ఏర్పాటు చేసిన టేబుళ్లు

రేపు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

మధ్యాహ్నం తర్వాతే ఫలితాలు

తొలుత సంతనూతలపాడు వచ్చే అవకాశం

ఒంగోలు పార్లమెంటు లేటు

మొత్తం ప్రక్రియ ముగిసేది రాత్రికే

రైజ్‌ కాలేజీలోనే అన్ని సెగ్మెంట్ల కౌంటింగ్‌

అసెంబ్లీ, పార్లమెంట్‌కు విడివిడిగా

ఈవీఎంలకు 14, పోస్టల్‌ బ్యాలెట్లకు ఐదు టేబుళ్ల ఏర్పాటు

కేంద్రం వద్ద నాలుగంచెల భద్రత

జిల్లా అంతటా 144 సెక్షన్‌ అమలు

పలు గ్రామాల్లో పోలీసు పికెట్లు

ప్రధాన పార్టీల అభ్యర్థులు,

పార్టీ కార్యాలయాల వద్ద భద్రత

గన్‌మన్లు కేటాయింపు

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. సుదీర్ఘ ఉత్కంఠకు మరో 24 గంటల్లో తెరపడనుంది. విజేతలు ఎవ్వరన్నది తేలనుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాతే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒంగోలు పార్లమెంట్‌తోపాటు దాని పరిధిలో ఉన్న జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని సంతనూతలపాడు సెగ్మెంట్‌ ఓట్ల లెక్కింపు ఒంగోలులోని రైజ్‌ కాలేజీలో జరగనుంది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపునకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14, పార్లమెంట్‌ స్థానానికి 14 టేబుళ్లను విడివిడిగా ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌లు, ఆతర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్‌కు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. రైజ్‌ కళాశాల పరిసర ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించింది. ఫలితాల ప్రకటన అనంతరం అల్లర్లు జరగకుండా జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు. 156 గ్రామాల్లో పోలీసు పికెట్ల ఏర్పాటుతోపాటు నాయకులు, ప్రధాన పార్టీల కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు.

ఒంగోలు, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 2,183 కేంద్రాల్లో గత నెల 13న పోలింగ్‌ జరగ్గా ఈవీఎంలలో ఓట్లు నిక్షిప్తమయ్యాయి. వాటన్నింటినీ ఒంగోలు సమీపంలోని రైజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌లలో ప్రత్యేక భద్రత మధ్య ఉంచారు. మంగళవారం కౌంటింగ్‌ జరగనుంది. అందుకు ఏర్పాట్లను యంత్రాంగం పూర్తి చేసింది. సజావుగా లెక్కింపు ప్రక్రియ సాగడంతోపాటు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. కలెక్టర్‌ దినే్‌షకుమార్‌, ఎస్పీ గరుడ సుమిత్‌ ఇందుకోసం భారీ కసరత్తు చేశారు.

తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపు

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. 8.30 గంటలకు ఈవీఎంలలోని ఓట్ల కౌంటింగ్‌ చేపడతారు. ఉదయం 5.30 గంటల నుంచే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒంగోలు పార్లమెంట్‌తోపాటు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే బాపట్ల పార్లమెంట్‌ పరిధిలోని సంతనూతలపాడు సెగ్మెంట్‌ పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపు కూడా ఇక్కడి రైజ్‌ కాలేజీలోనే జరుగుతుంది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపునకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14, పార్లమెంట్‌ స్థానం లెక్కింపునకు 14 టేబుళ్లను విడివిడిగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టేబుల్‌ వద్ద గజిటెడ్‌ హోదా ఉండే ఒక సూపర్‌వైజర్‌, మరో అసిస్టెంట్‌, ఇంకో మైక్రో అబ్జర్వర్‌ను నియమించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపునకు ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఐదు టేబుళ్లు ఏర్పాటు చేయడంతోపాటు ఒక్కో టేబుల్‌ వద్ద నలుగురు సిబ్బందిని నియమించారు. ప్రతి రౌండ్‌కు 14 పోలింగ్‌ కేంద్రాల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఆయా నియోజకవర్గాలలో ఎన్ని పోలింగ్‌ కేంద్రాలు ఉంటే వాటిని 14తో విభజించి అన్ని రౌండ్లుగా తేల్చుతారు.

ఒక్కో రౌండ్‌ లెక్కింపు పూర్తికి 25 నిమిషాలు

సంతనూతలపాడు నియోజకవర్గంలో తక్కువగా 256, కనిగిరిలో అత్యధికంగా 297 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. కనిష్ఠంగా 19 రౌండ్లు, గరిష్ఠంగా 22రౌండ్లు లెక్కింపు సాగుతుంది. ఒక్కో రౌండ్‌ లెక్కింపు పూర్తికి సగటున 25 నిమిషాల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మధ్యాహ్నం మూడు గంటల తర్వాతనే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పోలింగ్‌ కేంద్రాలు తక్కువగా ఉన్న సంతనూతలపాడు నియోజకవర్గ ఫలితం తొలుత వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. అది కూడా మధ్యాహ్నం మూడు గంటల తర్వాతనే అని చెప్తున్నారు. అదేసమయంలో పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపునకు కొంత అధిక సమయం పట్టనుండగా, అభ్యర్థులు ఎక్కువ ఉన్న సెగ్మెంట్లలో రెండు ఈవీఎంలు వినియోగించడం వల్ల లెక్కింపు ఆలస్యం కానుంది.

అభ్యర్థులు ఎక్కువ మంది పోటీ చేసిన చోట్ల ఆలస్యం

జిల్లాలో ఒంగోలు పార్లమెంట్‌ స్థానం నుంచి 25 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మార్కాపురం అసెంబ్లీకి 27 మంది, ఒంగోలుకు 26 మంది, గిద్దలూరుకు 21 మంది రంగంలో ఉన్నారు. వాటిలో పోస్టల్‌ బ్యాలెట్లు కూడా అధికంగానే ఉన్నాయి. దీంతో ఆ నియోజకవర్గాల్లో లెక్కింపు కొంత మేర ఆలస్యమై సాయంత్రం ఆరు గంటల తర్వాతనే వాటి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒంగోలు పార్లమెంట్‌ లెక్కింపు రాత్రికి పూర్తికానుంది.

ఉదయం 8 నుంచి కౌంటింగ్‌ ప్రారంభం

అభ్యర్థుల తరఫు ఏజెంట్ల సమక్షంలో పోస్టల్‌ బ్యాలెట్లను ఉదయం 8గంటలకు, ఈవీఎంలలో ఓట్ల లెక్కింపును 8.30 గంటలకు రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకుల పర్యవేక్షణలో సూపర్‌ వైజర్లు ప్రారంభిస్తారు. లెక్కింపునకు నియమించిన సిబ్బందిని ఉదయం 5.30 గంటలకే కౌంటింగ్‌ కేంద్రాలకు రప్పించి వారికి టేబుళ్లను కేటాయిస్తారు. ఆరు గంటలకు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లను అనుమతిస్తారు. ఆయా నియోజకర్గాల స్ట్రాంగ్‌ రూమ్‌ల సీల్‌ను అభ్యర్థులు లేదా చీఫ్‌ ఏజెంట్ల సమక్షంలో రిటర్నింగ్‌ అధికారులు తీసి లెక్కింపునకు ఈవీఎంలను పంపిస్తారు.

ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌ పూర్తికి ఆరుగంటల సమయం

రౌండ్‌ల వారీగా లెక్కింపు కనుక తొలుత 1నుంచి 14 వరకు కేంద్రాల ఈవీఎంలను కేటాయించిన టేబుళ్లపైకి తీసుకువస్తారు. అలా ఒక్కో రౌండ్‌కు 14 ఈవీఎంలను ప్రత్యేక సిబ్బంది ద్వారా టేబుళ్లపైకి చేర్చుతారు. అసెంబ్లీ సెగ్మెంట్‌కు 14 వంతున 112, పార్లమెంట్‌కు 112 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో టేబుల్‌కు ముగ్గురు వంతున 672 మంది, పోస్టల్‌ బ్యాలెట్‌లకు మరో 240 మంది వెరసి 912 మంది సిబ్బంది అవసరం కాగా అదనంగా 20శాతం మందిని నియమించారు. ఒక రౌండ్‌ కౌంటింగ్‌ ముగిసిన అనంతరం మరో రౌండ్‌ లెక్కింపు జరగనుంది. తొలి రౌండ్‌కు అర్ధగంట, అనంతరం ప్రతి రౌండ్‌కు 20నుంచి 25 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ ప్రకారం చూస్తే ఒక్కో సెగ్మెంట్‌ ఈవీఎంల ఓట్ల లెక్కింపునకు కనిష్ఠంగా ఆరు గంటలు, గరిష్ఠంగా 9 గంటలు పట్టవచ్చని సమాచారం.

కట్టుదిట్టమైన భద్రత

ఈసారి కౌంటింగ్‌ గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో భద్రత చర్యలు చేపట్టారు. పోలింగ్‌ అనంతరం రాష్ట్రంలో తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. లెక్కింపు జరిగే రైజ్‌ కళాశాల పరిసర ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించింది. ఆప్రాంతంలోని జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ మళ్లింపుతోపాటు జనసంచారాన్ని నియంత్రించనుంది. లెక్కింపు జరిగే కళాశాలలో నాలుగు అంచెల చెకింగ్‌ వ్యవస్థ, భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అభ్యర్థులు, అధికారులు, ఏజెంట్లు ఎవ్వరూ సెల్‌ఫోన్‌లను లోపలికి తీసుకురాకుండా చర్యలు తీసుకుంటున్నారు. వారి వాహనాలను కూడా లోపలికి అనుమతించరు.

156 గ్రామాల్లో పోలీసు పికెట్లు

లెక్కింపు రోజున జిల్లా అంతటా 144 సెక్షన్‌ అమలుకు ఉత్తర్వులు ఇచ్చారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద సాయుధ బలగాలతోపాటు సమీపంలోని ఒంగోలు నగరంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఘర్షణలు తలెత్తే అవకాశం ఉన్నట్లు గుర్తించిన 156 గ్రామాల్లో పోలీసు పికెట్ల ఏర్పాటుతోపాటు 18 మంది కీలక నాయకులు, 16 చోట్ల ప్రధాన పార్టీల కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. ఇలా భారీ భద్రత, ఇతర ఏర్పాట్ల మధ్య కౌంటింగ్‌కు చేపడుతున్న యంత్రాంగం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. పోస్టల్‌ బ్యాలెట్లు, ఇతర కారణాలతో కొంత జాప్యం జరిగినా కనీసం ఆరు గంటల లోపు అసెంబ్లీ, రాత్రి 8గంటలకు పార్లమెంట్‌ స్థానం లెక్కింపు పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు.

Updated Date - Jun 02 , 2024 | 11:39 PM