అక్రమాలకు సహకారం
ABN , Publish Date - Oct 20 , 2024 | 12:34 AM
పీడీసీసీ బ్యాంకులో అక్రమాలు చోటుచేసుకున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. బ్యాంకులో 11 అంశాల్లో అక్రమాలు జరిగినట్లు కొందరు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. బ్యాంకులో రుణాల మంజూరు, మరమ్మతులు, ఇతరాలలో రూ.80 కోట్లు దుర్వినియోగమైనట్లు పేర్కొన్నారు. బ్యాంకులో జరిగిన అక్రమాలపై వ్యవసాయ, సహకారశాఖ మంత్రికి, ఆప్కాబ్, నాబార్డులో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బ్యాంకులో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు కూడా సమాచారం వెళ్లింది. బ్యాంకు అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
పీడీసీసీ బ్యాంకుపై విజిలెన్స్
ఏఎస్పీ ఆధ్వర్యంలో విచారణ
పైళ్ల పరిశీలన ప్రారంభం
మొత్తం 11 అంశాలపై ఫిర్యాదు
ఒంగోలు విద్య, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో భారీగా నిధులు దుర్వినియోగమ య్యాయి. గత ప్రభుత్వ హయాంలో కొందరు వైసీపీ నేతల రుణగోల్‌మాల్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలవెల్లువ, పొదుపు సంఘాలకు రుణాల పేరుతో భారీగా దుర్వినియోగం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై సీఎం చంద్రబాబునాయుడు, ఆ శాఖ మంత్రి, ఆప్కాబ్, నాబార్డుతో పాటు విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఎస్పీ కులశేఖర్ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. విజిలెన్స్ ఏఎస్పీ స్వయంగా ఒంగోలులోని పీడీసీసీ బ్యాంకు కేంద్ర కార్యాలయానికి వెళ్లి బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) ఈద కోటిరెడ్డిని కలిసి విచారణకు అవసరమైన ఫైళ్లను అందజేయాలని కోరినట్లు తెలిసింది. బ్యాంకు పర్సన్ ఇన్‌చార్జి, జేసీ గోపాలకృష్ణను కలిసి విజిలెన్స్ విచారణ విషయాన్ని తెలియజేసి ఆయన అనుమతితో సీఈవో విజిలెన్స్ విచారణకు పైళ్లను అందజేసిన ట్లు తెలిసింది.
నాయకుల సిఫార్సుల మేరకు
పీడీసీసీ బ్యాంకు గతంలో నాబార్డు నిబంధనల ప్రకారం పనిచేసేది. ప్రస్తుతం అది రిజర్వు బ్యాంకు ఆప్ ఇండియా (ఆర్‌బీఐ) ని బంధనల ప్రకారం పనిచేస్తుంది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేస్తాయి. ఆ క్రమంలోనే పీడీసీసీ బ్యాంకు కూడా రుణాలు మంజూరు చేసి నిధులు విడుదల చేసింది. అయితే బ్యాంకు పర్సన్ ఇన్‌చార్జీ కమిటీ(పీఐసీ)ల పదవీకాలంలో అప్పటి నాయకుల సిఫార్సుల మేరకు అక్రమంగా రుణాలు మంజూరు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన 2019 నుంచి 2024 వరకు జరిగిన అక్రమాల్లో సుమారు రూ.80కోట్లు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ కాలానికి సంబంధించి మంజూరు చేసిన రుణాలన్నింటిపై విచారణ జరిపి అక్రమాలను వెలికితీయాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.
11 అంశాల్లో అక్రమాలు
పీడీసీసీ బ్యాంకు వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో 11 అంశాల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదటగా జగనన్న పాలవెల్లువ పథకంలో భాగంగా ఇచ్చిన రుణాలు వాయిదా మీరిన బకాయిలుగా మారాయి. ఈ పథకం కింద పాడి రైతులకు గేదెలు కొనుగోలుకు, వాటి నిర్వహణకు ప్రకాశం కామధేను పథకం పేరుతో రైతులకు కనీసం రూ.30వేల నుంచి లక్షాన్నర వరకు రుణాలు ఇచ్చారు. కొందరికి వారు వారంరోజుల్లో పోసిన పాలను ప్రామాణికంగా తీసుకొని గేదెలకు రుణాలు ఇచ్చారు. అమూల్ డెయిరీకి వీరి ద్వారా పాలు సేకరించేవారు. అయితే ఆచరణలో జగనన్న పాల వెల్లువ పథకం తుస్సుమనడంతో గేదెల కొనుగోలుకు ఇచ్చిన రుణాల వసూలు కాలేదు. ఈ రుణాల మంజూరు, నిధుల విడుదలలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి.
- ట్రాక్టర్ల కొనుగోలులో బినామీ రుణాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రుణాల మంజూరులో అక్రమాలు జరిగాయి.
- జాయింట్ లయబులిటీ గ్రూపులు(జేఎల్‌బీ) గ్రూపులకు జగనన్న తోడు రుణాల మంజూరులో అక్రమాలు జరిగాయి.
- ఉద్యోగాల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకొని వారు పనిచేయని కాలానికి కూడా జీతాలు చెల్లించారు
- జాయింట్ లయబిలిటీ గ్రూపులకు ఇతర రుణాలు మంజూరులో అక్రమాలు చోటు చేసుకున్నాయి
- స్వయం సహాయక గ్రూపులు డ్వాక్రా మహిళలకు రుణాల మంజూరులో భారీగా అవినీతి జరిగింది. అద్దంకి బ్యాంకు శాఖలో ఒక బినామీ స్వయం సహాయక గ్రూపునకు రూ.15లక్షల రుణం మంజూరు చేసి భారీగా అవినీతికి పాల్పడిన విషయం వెలుగులోకి రావడంతో అక్కడి ఉద్యోగిని బ్యాంకు సీఈవో చార్జీషీటు చేశారు. ఒంగోలు నగరంలో కూడా బినామీ గ్రూపులకు రుణాలు మంజూరు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
- జగనన్న షిప్ ఆంధ్ర పథకం కింద రుణాలు మంజూరులో భారీ కుంభకోణాలు జరిగాయి.
- బ్యాంకులో వ్యక్తిగతంగా గృహ తనఖా రుణాలు మంజూరులో కూడా అక్రమాలు జరిగాయి.
- రైతులకు స్వల్పకాలిక, ద్ఘీకాలిక రుణాల్లో భారీగా అవినీతి జరిగింది. బినామీలు కొందరికి కూడా ఈ రుణాలు మంజూరు చేశారు. కొన్ని బ్యాంకు శాఖల్లో రుణాలకు సంబంధించి బాండ్లు లేకుండా రుణాలు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి.
- బ్యాంకు ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల్లో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
- బ్యాంకు శాఖల్లో రీ మోడలింగ్‌లో కూడా పెద్ద కుంభకోణం జరిగిందని ముఖ్యమంత్రికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ అంశాలన్నింటిపై విజిలెన్స్ విచారణలో ఏమి తేలుతుందో వేచిచూడాల్సి ఉంది.