Share News

వైసీపీలో సంప్రదింపుల మేళా

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:27 AM

అధికార వైసీపీలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న దశలో శనివారం నాయకుల మధ్య సంప్రదింపులు, సమాలోచనలు, బుజ్జగింపుల పర్వం కొనసాగింది.

వైసీపీలో సంప్రదింపుల మేళా
ఎంపీ మాగుంటతో కలిసి బయటకువస్తున్న ఎమ్మెల్యేబలరాం

బాలినేనితో ఫోన్‌లో సజ్జల మంతనాలు

మాజీ మంత్రికి ఐబీ చీఫ్‌ ఫోన్‌

మాగుంటను కలిసిన ఎమ్మెల్యేలు బలరాం, సుధాకర్‌

మంత్రి సురేష్‌ లేకుండానే వైపాలెం వెళ్లిన చంద్రశేఖర్‌

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

అధికార వైసీపీలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న దశలో శనివారం నాయకుల మధ్య సంప్రదింపులు, సమాలోచనలు, బుజ్జగింపుల పర్వం కొనసాగింది. సీఎం ఇంటర్వ్యూ కూడా దొరక్క అలిగి హైదరాబాద్‌ వెళ్లి శుక్రవారం జిల్లాలో రెండు ముఖ్య సమావేశాలకు కూడా హాజరుకాని బాలినేని శ్రీనివాసరెడ్డితో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వేర్వేరుగా ఫోన్‌లో మాట్లాడి బుజ్జగింపులకు శ్రీకారం పలికారు. పార్టీ అధినాయకత్వం పూర్తిగా పక్కనబెట్టిన ఎంపీ మాగుంటతో చీరాల, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యేలు కరణం బలరాం, సుధాకర్‌బాబు ఒంగోలులో వేర్వేరుగా భేటీ అయ్యారు. మొత్తంగా వైసీపీలో సంక్షోభ పరిస్థితులు ఏరోజు ఏమలుపు తిరుగుతాయేనన్న అంశం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

బాలినేనికి ఫోన్లపై ఫోన్లు

హైదరాబాద్‌లో ఉన్న బాలినేనికి విజయసాయిరెడ్డితోపాటు సజ్జల ఫోన్లు చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. ‘సీఎంను కలిసేందుకు మీకు ఇబ్బంది ఏముంటుంది. అసలు మీరు విజయవాడ వచ్చి వేచి ఉన్న విషయమే ఆయనకు తెలియదు. తెలిస్తే అలా జరగదు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడొచ్చి సీఎంను కలవొచ్చు’ అని వారు చెప్పినట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులు మాగుంటతోపాటు బాలినేని కూడా కొందరు తెలుగుదేశం నాయకులతో టచ్‌లో ఉన్నారని సీఎంకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తదనుగుణంగానే శనివారం వీరు బాలినేనికి ఫోన్లు చేసి సీఎంను కలిసేందుకు రమ్మని కోరినట్లు సమాచారం. అయితే బాలినేని ఇదిగో వస్తున్నా అని మాత్రం చెప్పకపోవడం గమనార్హం. ఇలా సంప్రదింపులు జరుపుతూనే సీఎం జగన్‌ ఒంగోలు లోక్‌సభ, అసెంబ్లీ బరిలో కూడా వేరేవారిని దించే ప్రయత్నాలు ప్రారంభించడం బాలినేనితోపాటు ఆయన వర్గీయుల్లోనూ అనుమానాలు రేకెత్తిస్తోంది.

మహీధర్‌రెడ్డితో వేమిరెడ్డి భేటీ

కందుకూరు నియోజకవర్గానికెళ్లి పనిచేసు కోవాలని ఆ పార్టీలో బీసీ విభాగం నాయకుడు బొట్ల రామారావుకు జగన్‌ సూచించిన నేపథ్యంలో ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డితో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మంతనాలు జరిపారు. శుక్రవారం రాత్రి వీరిద్దరూ నెల్లూరులో కలిశారు. కాగా శనివారం మహీధ రరెడ్డి కందుకూరులో మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం నియోజకవర్గ వైసీపీ టికెట్‌ బీసీ అభ్యర్థికిస్తే స్వాగతిస్తానని ప్రకటించారు. అయితే వేమిరెడ్డి సూచనల మేరకు మహీధర్‌ మీడియా సమావేశం నిర్వహించినప్పటికీ ఆయన మాటలు జగన్‌కు రుచించాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

మాగుంటను కలిసిన ఇద్దరు ఎమ్మెల్యేలు

ఒంగోలులో ఉన్న మాగుంటతో అధిష్ఠానం నేరుగా మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే ఎంపీ వేమిరెడ్డి ప్రభా కర్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. మీరేమీ విలేక రుల సమావేశం పెట్టి ఏదేదో మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా చెప్పారని అంటున్నారు. ఒంగోలులో ఉన్న మాగుంటను శనివారం ఉదయం ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు కలిశారు. ‘మీతోపాటు నేనూ ఉంటా. మీరు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా నడుస్తా. నన్నూ కలుపుకుపోండి’ అంటూ ప్రతిపాదించినట్లు వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఆ తర్వాత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా మాగుంటను కలిశారు. ఇప్పటికైతే చీరాల వైసీపీ సీటు ఆయన కుమారుడు వెంకటేష్‌కే ఖరారై ఉంది. అయితే వైసీపీలో ప్రస్తుతం మాగుంట పరిస్థితి సవ్యంగా లేని దశలో ఆయన్ను కలిసిన బలరాం ఏమి సలహాలిచ్చారు అనేది కీలకంగా మారింది.

మంత్రి సురేష్‌ లేకుండా వైపాలెంలో..

వైసీపీ వైపాలెం ఇన్‌చార్జిగా నియమితులైన తాటిపర్తి చంద్రశేఖర్‌ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మంత్రి సురేష్‌ లేకుండానే శనివారం నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. తొలుత ఆయన మార్కాపురంలో ఆ నియోజకవర్గ నేతలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొద్దిమంది మినహా ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. మంత్రి సురేష్‌కు నమ్మినబంటు అయిన గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ భర్త పిచ్చయ్య గైర్హాజరయ్యారు. పెద్దారవీడు కన్వీనర్‌ కృష్ణారెడ్డి, ఎంపీపీ, జడ్పీటీసీలతో పాటు 11మంది సర్పంచ్‌లు దూరంగా ఉన్నారు. ఇతర మండలాల నుంచి ముఖ్యులంతా హాజరయ్యారు. ఆయా మండలాల నుంచి హాజరైన వారిలో సురేష్‌ మద్దతుదారులే ముందుండి చంద్రశేఖర్‌ను నడిపించటం కనిపించింది. అయితే చంద్రశేఖర్‌ ఆ తర్వాత త్రిపురాంతకం వెళ్లి దర్శనం చేసుకుని వైపాలెం చేరారు. అయితే తొలిసారి నియోజకవర్గానికి వస్తూ మంత్రి సురేష్‌ లేకుండా వెళ్లటంపై విమర్శలు వచ్చాయి. అయినా అక్కడ గైర్హాజరైతే మంత్రికి ఇబ్బందని ఆయన వర్గీయులు ఎక్కువమంది చంద్రశేఖర్‌కు స్వాగతం పలికారు. మంత్రి సురేష్‌ సమయాన్ని ముందు తీసుకోకుండా చంద్రశేఖర్‌ ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. ఆశించిన స్పందన రాకపోవటంతో చంద్రశేఖర్‌ అనుయా యులు ఆవేదన వ్యక్తం చేశారు.

-------------------------------------------

Updated Date - Jan 14 , 2024 | 01:27 AM