Share News

మినీ గోకులం షెడ్లు నిర్మాణానికి శ్రీకారం

ABN , Publish Date - Oct 02 , 2024 | 11:30 PM

టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడిరైతుల సంక్షేమాభివృద్ధి కోసం చర్యలు చేపట్టింది. మినీ గోకులం షెడ్ల మంజూరుకు శ్రీకారం చుట్టింది. గత వైసీపీ పరిపాలనలో గోకులం షెడ్లను పూర్తిగా విస్మరించింది

మినీ గోకులం షెడ్లు నిర్మాణానికి శ్రీకారం
గోకులం షెడ్‌

ఉపాధి హామీ పథకం కింద రాయితీ

పశుపోషకుల్లో ఆనందం

సంతనూతలపాడు, అక్టోబరు 2: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడిరైతుల సంక్షేమాభివృద్ధి కోసం చర్యలు చేపట్టింది. మినీ గోకులం షెడ్ల మంజూరుకు శ్రీకారం చుట్టింది. గత వైసీపీ పరిపాలనలో గోకులం షెడ్లను పూర్తిగా విస్మరించింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి రావడంతో వాటికి పూర్వవైభవం తెచ్చేందుకు అడుగులు వేస్తోంది. గ్రామాల్లో పశుపోషణ, కోళ్లు, గొర్రెలు, మేకలు పెంపకానికి మెరుగైన వసతి కల్పిస్తూ, పెంపకందార్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశువుల నివాసానికి కొద్దిపాటి స్థలం ఉంటే మినీగోకులం పేరిట షెడ్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. ఇటీవల పశుసంవర్ధకశాఖ అధికారులు గోకులం ఎంపిక ప్రక్రియకు చర్యలు చేపట్టడంతో పశుపోషకుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

అర్హులు వీరే..

గోకులం పథకం కింద షెడ్లనిర్మాణానికి పశువుల పెంపకందార్లకు 90శాతం, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకందార్లకు 70 శాతం చొప్పున రాయితీలు కల్పిస్తారు. ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు ఉన్న చిన్న, సన్నకారు రైతులు అర్హులు. సంబంధిత దరఖాస్తులు రైతు సేవాకేంద్రం, మండల వ్యవసాయ కార్యాలయం, పశువైద్యశాలలో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుతో పాటు జాబ్‌కార్డు, ఆధార్‌కార్డు, షెడ్లనిర్మాణం చేపట్టే భూమి రిజిస్ర్టేషన్‌ ధృవపత్రం, బ్యాంకు పాసు పుస్తకం ఉండాలి. మండలానికి 25 చొప్పున గోకులం యూనిట్లు మంజూరు చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. సంతనూతలపాడు మండలంలో 11,500ల గేదెలు, ఆవులు, 32వేల గొర్రెలు,మేకలు, నాటుకోళ్లు దాదాపుగా 7వేలవరకు ఉంటాయి.

త్వరలో ప్రారంభం

- ప్రతా్‌పరెడ్డి, పశువైద్యులు, సంతనూతలపాడు

ఇప్పటికే మండలంలో గోకులం లబ్ధిదారుల ఎంపిక దాదాపు పూర్తయింది. ఎంపిక చేసిన దరఖాస్తులను ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స అధికారులకు పంపించాం. త్వరలో నిర్మాణాలు ప్రారంభించే అవకాశం ఉంది.

దరఖాస్తులను జిల్లా అధికారులకు పంపించాం

-వాసంతి, ఏపీవో

గోకులంషెడ్ల ఏర్పాట్లుకు సంబంధించి 70 దరకాస్తులు వచ్చాయి. వాటిని జిల్లా అధికారులకు పంపించాం. మండలానికి 25 యూనిట్లు మాత్రమే ఇచ్చారు. మరికొన్ని గోకులంషెడ్లు మంజూరు అయ్యేవిధంగా రైతుల సమస్య ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. ఎంపిక ప్రకియ త్వరలో పూర్తవుతుంది.

షెడ్లకు అందించే నిధుల వివరాలు

షెడ్డు పరిధి యూనిట్‌ విలువ రాయితీ రైతు వాటా

2 పశువులు రూ.1,15,000 రూ.1,03,500 రూ.11,500

4పశువులు రూ.1,85,000 రూ.1,66,500 రూ.18,500

6కన్నా ఎక్కువుంటే రూ.2,30,000 రూ.2,07,000 రూ.23,000

20గొర్రెలు, మేకలు రూ.1,30,000 రూ.91,000 రూ.39,000

50గొర్రెలు, మేకలు రూ.2,30,000 రూ.1,61,000 రూ.69,000

100 కోళ్లు రూ.87,000 రూ.60,900 రూ.26,100

200 కోళ్లు రూ.1,32,000 రూ.92,400 రూ.39,600

Updated Date - Oct 02 , 2024 | 11:30 PM