Share News

వైసీపీలో అయోమయం

ABN , Publish Date - Jan 28 , 2024 | 01:05 AM

నియోజకవర్గ ఇన్‌చార్జిల పేరుతో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారుచేస్తున్న అధికార వైసీపీ నాయకత్వం నిలకడలేని నిర్ణయాలతో శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది.

వైసీపీలో అయోమయం

ఒంగోలు ఎంపీ స్థానానికి రోజుకో పేరు

తాజాగా పరిశీలనలోకి రోజా

మాగుంటతో ఇక్కడి నేతల రాయబారానికి చెక్‌పెట్టే లక్ష్యం

గిద్దలూరులో స్థానిక నేతల తిరుగుబాటు

కందుకూరులో మళ్లీ బీసీ పేరు పరిశీలన

పర్చూరుపై కొనసాగుతున్న ప్రతిష్టంభన

నియోజకవర్గ ఇన్‌చార్జిల పేరుతో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారుచేస్తున్న అధికార వైసీపీ నాయకత్వం నిలకడలేని నిర్ణయాలతో శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. తాజాగా ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీకి మంత్రి ఆర్కే రోజా పేరును పరిశీలనలోకి తీసుకుంది. మరోవైపు గిద్దలూరు, మార్కాపురం విషయంలో ఆపార్టీ తాజా ప్రతిపాదనను అక్కడి నేతలు తీవ్రంగా వ్యతిరేకించడం ప్రారంభమైంది. కందుకూరు అభ్యర్థి విషయంలోనూ పునఃపరిశీలన చేస్తున్నారు. పర్చూరు టికెట్‌ ఆశించే వారిలో చిలకలూరిపేటకు చెందిన వ్యాపారి రంగప్రవేశం చేశారు. దీంతో సగానికిపైగా నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒంగోలు ఎంపీ టికెట్‌ను స్థానికేతరులకు ఇవ్వాలన్న అధిష్ఠానం ఆలోచనపై జిల్లాలోని ఆ పార్టీ ముఖ్య నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో జిల్లాలోని ఆపార్టీ ముఖ్యనాయకులు రాయబారాలు ప్రారంభించటంతో ముఖ్యమంత్రి జగన్‌ అప్రమత్తమయ్యారు. ఆ ప్రయత్నాలకు బ్రేక్‌ వేసే లక్ష్యంతో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా పేరును పరిశీలిస్తున్నట్లు సంకేతాన్ని పంపారు. జిల్లాలో ముఖ్యనాయకులైన బాలినేని, మంత్రి సురేష్‌ తదితరులకు శనివారం విజయసాయిరెడ్డి ఫోన్‌ చేసి ఆ విషయాన్ని తెలిపారు. ఎంపీ మాగుంటకు తిరిగి టికెట్‌ ఇవ్వడం లేదని గతంలోనే జగన్‌ తేల్చిచెప్పారు. అయితే శుక్రవారం ఒంగోలులో మాగుంటను బాలినేనితోపాటు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కలిశారు. మాగుంటనే ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దింపాలనేది వారి ఆలోచన. ఆ విషయాన్ని గతంలో తాను సీఎంకు చెప్పానని, ఇప్పుడు మిగిలిన అభ్యర్థులు సీఎం వద్దకు వెళ్లి ప్రయత్నిస్తే మంచిదని బాలినేని సూచించారు. ఆతర్వాత ఇప్పటికే ఖరారైన ఒంగోలు లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ ఇన్‌చార్జిల మధ్య దీనిపై చర్చ సాగింది. ధైర్యంగా సీఎం వద్దకు వెళ్లేందుకు వారు జంకుతున్నప్పటికీ మాగుంటతో మంతనాలు చేయటాన్ని జగన్‌ సీరియస్‌గానే తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆగమేఘాలపై ఒంగోలు లోక్‌సభ నుంచి మంత్రి రోజా పోటీ చేయబోతున్నారన్న సమాచారాన్ని జిల్లా నాయకులకు పంపారు. నిజానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి పేరును తొలుత పరిశీలనలోకి తీసుకున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని జిల్లావాసులకే ఇవ్వాలని సూచించారు. తండ్రీ కొడుకులకు టికెట్‌ ఇచ్చే ఆలోచన ఉంటే తన కుమారుడు ప్రణీత్‌రెడ్డి పోటీ చేస్తాడని కూ డా ఆయన చెప్పినట్లు సమాచా రం. ఈనేపథ్యంలో వెనక్కు తగ్గిన అధిష్ఠానం.. మాగుంటతో మళ్లీ స్థానిక నాయకులు చర్చలు జరుపు తున్న తరుణంలో రోజా పేరును తెరపైకి తెచ్చింది. నగరి నుంచి ఆమెను తప్పించే ఆలోచనలో ఉన్న అధిష్ఠానం గౌరవప్రదమైన అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసింది. అయితే తాజా ప్రతిపాదనపై వైసీపీ ముఖ్యనాయకులు అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. జిల్లాయేతర నాయకులను దిగుమతి చేయటం మంచిది కాదని వాపోతున్నారు. సోమ, మంగళవారాల్లో ఈ విషయంపై జగన్‌ తుదినిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

గిద్దలూరులో తిరుగుబాటు

గిద్ద లూరులో స్థానిక నేతలు అధిష్ఠానం కొత్త ప్రతిపాదనకు ససేమిరా అంటున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు లేక ఆయన కుమారుడిని మార్కాపురం నుంచి పోటీ చేయించి అక్కడి ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని గిద్దలూరు పంపాలని చర్చలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇద్దరు ఎమ్మెల్యేలతో ముఖ్యనాయకులు శుక్రవారం చర్చలు కూడా జరిపారు. కాగా ఈ విషయం ఆంధ్రజ్యోతి ద్వారా వెల్లడికావడంతో గిద్దలూరులోని స్థానిక నాయకులు అప్రమత్తమయ్యారు. స్థానికులకే అవకాశం ఇస్తామని చెప్పి అందరితో మాట్లాడి మరోసారి స్థానికేతరులను పంపాలని చూడటంలోని ఉద్దేశం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించిన నాయకులు, పార్టీలో ఉన్న ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు శనివారం అంతర్గతంగా ఈవిషయంపై చర్చించుకున్నారు. స్థానికుడికే అవకాశం ఇవ్వాలి తప్ప స్థానికేతరుడిని పంపిస్తే సహకరించమని అధిష్ఠానంకు తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. ఆమేరకు ఆ నియోజకవర్గంలోని కంభంలో మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటుచేశారు.

కందుకూరులో మళ్లీ బీసీ అభ్యర్థిత్వంపై పరిశీలన

ఎంపీ అభ్యర్థి ఒత్తిడి ఇతరత్రా అంశాలతో ఇటీవల కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డికి తిరిగి టికెట్‌ ఇవ్వా లని భావించిన అధిష్ఠానం మళ్లీ వెనకడుగు వేసింది. నెల్లూరు లోక్‌సభ పరిధిలో సిటీ స్థానం నుంచి ఎమ్మెల్యే గా ఉన్న మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ను నరస రావుపేట లోక్‌సభ నుంచి పోటీ చేయించాలని జగన్‌ నిర్ణ యం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకచోటైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా యాదవ సామాజికవర్గం వారిని రంగంలోకి దింపాలన్న పునరాలోచనకు వచ్చారు. మహీధర్‌రెడ్డి స్థానే గతంలో జగన్‌ మాట్లాడిన బొట్ల రామారావుతో పాటు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ పేర్లను పరిశీలనలోకి తీసుకున్నారు. తొలుత కనిగిరే కావాలన్న బుర్రా ప్రస్తు తం కందుకూరు నుంచి పోటీకి సై అన్నట్లు తెలిసింది. కాగా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టుబడితే మహీధర్‌రెడ్డిని కావలి నుంచి పోటీ చేయించి కావలి ఎమ్మెల్యేను ఉదయగిరికి మార్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అందుకు మహీధర్‌రెడ్డి సిద్ధపడతారా? లేక 2014లో వలే పోటీకి దూరంగా ఉంటారా? అన్నది అనుమానమే.

పర్చూరుపై మల్లగుల్లాలు

పర్చూరు అభ్యర్థి ఎంపిక కోసం మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం కొత్త పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలిసింది. కొత్తగా చిలకలూరిపేటకు చెందిన వ్యాపారవేత్త సురేష్‌ పేరు కూడా వచ్చిన ట్లు తెలిసింది. తెలం గాణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అయిన గాంధీకి సమీప బంధువైన సురేష్‌ ఇటీవల విజయసాయిరెడ్డిని కలిసి పర్చూరు నుంచి అవకాశం ఇస్తే పోటీ చేస్తానని చెప్పినట్లు సమాచారం. కమ్మ సామాజికవర్గేతర నాయకుడికే అవకాశం ఇవ్వా లని భావించిన జగన్‌ పర్చూరు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.

Updated Date - Jan 28 , 2024 | 01:07 AM