డీసీసీబీలో అక్రమాలపై సమగ్ర విచారణ
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:42 PM
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రభుత్వాన్ని కోరారు. ప్రాథమికంగా తాను నియమించిన ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ బ్యాంకులో చేసిన విచారణలో అత్యధిక ఫిర్యాదులు వాస్తవమేనని తేలాయని, అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు మరింత లోతుగా క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన కోసం సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు.

ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ కలెక్టర్ నివేదిక
త్రిసభ్య కమిటీ విచారణలో అనేక ఫిర్యాదులు వాస్తవమేనని నిర్ధారణ
ఒంగోలు, నవంబర్ 28(ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రభుత్వాన్ని కోరారు. ప్రాథమికంగా తాను నియమించిన ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ బ్యాంకులో చేసిన విచారణలో అత్యధిక ఫిర్యాదులు వాస్తవమేనని తేలాయని, అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు మరింత లోతుగా క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన కోసం సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు. త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా కలెక్టర్ అన్సారియా ప్రభుత్వానికి నివేదిక పంపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డీసీసీబీలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు, అవకతవకలు జరిగాయని, అందులో బ్యాంకు అధికారులు, అలాగే వైసీపీ పాలనలో బ్యాంకు పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించిన వారి భాగస్వామ్యం ఉందంటూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక భారీగా ఫిర్యాదులు వెళ్లాయి.
పాలవెల్లువలో అవకతవకలు
మరోవైపు జగనన్న పాల వెల్లువ, జగనన్న తోడు, ట్రాక్టర్ రుణాల్లోనూ అవకతవకలు జరిగాయి. వీటన్నింటిపై సుమారు 50 పేజీల రిపోర్టును, దానికి అనుబంధంగా వారు పరిశీలించిన దాదాపు 2వేలకుపైగా డాక్యుమెంట్లను త్రిసభ్య కమిటీ కలెక్టర్‌కు అందజేసింది. మొత్తం 62 అంశాలలో ఏయే అంశం ఎంతమేర వాస్తవం, బాధ్యులు ఎవరన్న విషయాన్ని స్పష్టంగా నివేదికలో పొందుపర్చారు. దీనిపై పరిశీలన చేసిన కలెక్టర్ భారీగా అక్రమాలు, అవినీతి జరిగిందనే నిర్ధారణకు వచ్చారు. దీంతో ఇప్పటికే గుర్తించిన అక్రమాలకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు మొత్తం కార్యకలాపాలపై క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన కోసం సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నతాధికారులకు నివేదించారు.
తొలుత విజిలెన్స్ విచారణ
బ్యాంకు నిధులను దుర్వినియోగం, దోపిడీ చేశారని కొందరు వ్యక్తుల తీరును కూడా పేర్కొంటూ ఈ ఫిర్యాదులు నేపథ్యంలో ప్రభుత్వం తొలుత విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ విచారణ సజావుగా సాగేందుకు అప్పుడు బ్యాంకు సీఈవోగా ఉన్న కోటిరెడ్డిని అక్కడి నుంచి తొలగించాలని, అలాగే సమగ్ర విచారణ కోసం సెక్షన్ 51 విచారణ చేయించాలని కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు. అయితే సకాలంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, బ్యాంకు పాలకమండలి స్పందించక పోవడాన్ని ప్రశ్నిస్తూ ఆంధ్రజ్యోతిలో నవంబర్ 2న ‘అక్కడ అంతే’ శీర్షికన ప్రచురించిన కథనంతో మొత్తం యంత్రాంగంలో కదలిక రాగా సీఎం దృష్టికి కూడా విషయం వెళ్లింది. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలతో సీఈవో కోటిరెడ్డితో పాలకవర్గ రాజీనామా చేయించి అప్కాబ్ నుంచి మరొక అధికారిని ఇక్కడ సీఈవోగా నియమించారు.
ప్రాథమిక విచారణకు ఆదేశం
మరోవైపు బ్యాంకుపై సెక్షన్ 51 విచారణ వేసేందుకు ప్రాఽథమిక విచారణ స్థానికంగా చేసి నివేదించాలని రాష్ట్ర సహకార శాఖ ఉన్నతాధికారులు కలెక్టర్ తమీమ్ అన్సారియాను కోరారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలో త్రిసభ్య కమిటీని కలెక్టర్ నియమించగా వారు దాదాపు పక్షంరోజుల పాటు విచారణ కొనసాగించారు. రెండు, మూడు రోజుల్లోనే ప్రాఽథమికంగా కొన్ని అంశాలను పరిశీలించాలని వారు భావించినా ప్రభుత్వానికి చేరిన ఫిర్యాదులే కాక కలెక్టర్ దృష్టికి కూడా నిత్యం అనేక అంశాలపై ఫిర్యాదులను పరిశీలించి వాటిని 62 అంశాలుగా 8 విభాగాలుగా విభజించి విచారణ కమిటీ పరిశీలన చేయగా అన్ని అంశాలలోను వాస్తవం ఉన్నట్లుగా కమిటీ గుర్తించింది. ప్రధానంగా ఉద్యోగలు బదిలీలు, ఉద్యోగోన్నతులు, సస్పెన్షన్, డిస్మిస్ అయిన వారి నియామకాలు, ఆధునికీకరణ, అభివృద్ధి పేరుతో బ్యాంకు బ్రాంచీలలో చేసిన పనులు, లీగల్ చార్జీలు చెల్లింపు, ఆరోపణలు ఎదుర్కొంటూ, పెండింగ్ విచారణ ఉన్నవారే విజిలెన్స్ విభాగంలో ఉండటం, నిబంధనలకు విరుద్ధంగా అనేక కార్యకలాపాలు కొనసాగడం వంటి వాటిని గుర్తించారు.