Share News

మోటుపల్లి తీరప్రాంతంలో కలెక్టర్‌ పర్యటన

ABN , Publish Date - Jul 13 , 2024 | 11:03 PM

మండలంలోని మోటుపల్లి గ్రామ పంచాయతీలో తీరప్రాంతమైన నిరీక్షణగిరి, సముద్ర తీరప్రాంతాన్ని, పురాతన వీరభద్రస్వామి దేవాలయాన్ని కలెక్టర్‌ జె.వెంకటమురళి శనివారం పరిశీలించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ తీరప్రాంత ప్రజల స్థితిగతులను తెలుసుకునేందుకు వచ్చారు. మోటుపల్లి సముద్ర తీర ప్రాంతాన్ని ఆయన పరిశీలించి అక్కడ ఉన్న మత్స్యకారులతో మాట్లాడి వారి బోటులను పరిశీలించారు.

మోటుపల్లి తీరప్రాంతంలో కలెక్టర్‌ పర్యటన
నిరీక్షణగిరి గ్రామస్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటమురళి

సమస్యలు పరిష్కరిస్తానని

మత్స్యకారులకు హామీ

వీరభద్రస్వామి ఆలయం సందర్శన

చినగంజాం, జూలై 13 : మండలంలోని మోటుపల్లి గ్రామ పంచాయతీలో తీరప్రాంతమైన నిరీక్షణగిరి, సముద్ర తీరప్రాంతాన్ని, పురాతన వీరభద్రస్వామి దేవాలయాన్ని కలెక్టర్‌ జె.వెంకటమురళి శనివారం పరిశీలించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ తీరప్రాంత ప్రజల స్థితిగతులను తెలుసుకునేందుకు వచ్చారు. మోటుపల్లి సముద్ర తీర ప్రాంతాన్ని ఆయన పరిశీలించి అక్కడ ఉన్న మత్స్యకారులతో మాట్లాడి వారి బోటులను పరిశీలించారు. మేము సమద్ర ంలో 30 కిలోమీటర్లకు పైగా వేటకు వెళ్తామని, వేటకు వెళ్లినప్పుడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన కడలూరు మత్స్యకారలు దౌర్జన్యంగా మా వలలు లాక్కోవడంతో తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని, చేపల వేట విరామ సమయంలో ప్రభుత్వం నుంచి భృతి ఇంత వరకు అందలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్త చేశారు. వేట విరామ సమయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని మత్స్యకారుడు కొండూరి గోవిందు కలెక్టరు దృష్టికి తీసుకొని వెళ్లారు. అనంతరం ఆయన నిరీక్షణగిరి గ్రామంలో పర్యటించి గ్రామస్థులతో మాట్లాడారు. 50 కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నామని, ఇక్కడ అంగన్‌వాడీ కేంద్రంగాని, ప్రాథమిక పాఠశాల కూడా లేకపోవడంతో దూరంగా ఉన్న రుద్రమాంబపురం గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ, పాఠశాలకు పిల్లలను భయపడుతూ పంపించాల్సి వస్తోందని ప్రళయకావే రి ఏసుదాసు, రాణిమ్మ, వాయిల ఏసురత్నం తదితరులు కలెక్టర్‌కు తెలిపారు. గ్రామానికి వచ్చే నీటి పైపులు దెబ్బతిని తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఆర్‌డబ్ల్యూఎస్‌, ఐసీడీఎస్‌ ఆధికారులను గ్రామానికి పంపి మీ సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్‌ వారికి హామీ ఇచ్చారు. అనంతరం కాకతీయులు, చోళల కాలం నాటి వీరభద్రస్వామి దేవాలయాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఆలయంలోని శాసనాలను పరిశీలించి, దేవాలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల సముద్రతీర ప్రాంతానికి వచ్చే పర్యాటకులు ప్రమాదలకు గురికావడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో చీరాల ఆర్డీవో సూర్యనారాయణరెడ్డి, భూ రీసర్వే డీటీ దాసరి శ్రీకాంత్‌, గ్రామ రెవెన్యూ అధికారులు నాగిరెడ్డి నాగరాజు, పి.నాగరాజురెడ్డి, షేక్‌ మునీర్‌, ఏడుకొండలు, బండారు దానియేలు, ఆమంచి సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2024 | 11:03 PM