Share News

స్వర్గ సోపానం చెన్నకేశవ క్షేత్రం

ABN , Publish Date - Apr 21 , 2024 | 01:59 AM

మార్కాపురం పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మిచెన్నకేశవుడు నాలుగు యుగాల దేవుడిగా కామిత వరదాతగా ప్రసిద్ధిగాంచాడు. ‘కృతయుగే గజారన్నే తేత్రాయం మాదవీపురి ద్వాపరే స్వర్గసోపానం కలౌ మారికాపురి’ అని ఈ క్షేత్రం ప్రసిద్ధం.

స్వర్గ సోపానం చెన్నకేశవ క్షేత్రం

మార్కాపురం(వన్‌టౌన్‌), ఏప్రిల్‌ 20: మార్కాపురం పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మిచెన్నకేశవుడు నాలుగు యుగాల దేవుడిగా కామిత వరదాతగా ప్రసిద్ధిగాంచాడు. ‘కృతయుగే గజారన్నే తేత్రాయం మాదవీపురి ద్వాపరే స్వర్గసోపానం కలౌ మారికాపురి’ అని ఈ క్షేత్రం ప్రసిద్ధం. కలియుగంలో మారికా అనే యాదవ స్ర్తీ పుట్టలో ఉన్న కేశవునికి పాలధారలతో అభిషేకించింది. ఆమె పేరుమీదే మారికాపురం వెలసి మార్కాపురంగా పిలవబడుతోంది.

మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి ఆలయం విజయనగర రాజుల చరిత్రకు సజీవ సాక్ష్యం. ఇక్కడి ఆలయంలో శివునికి, విష్ణువుకు తేడా లేదని ‘శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయగం శివః’ అనే వేదోక్తి ప్రకారం మార్కాపురం చెన్నకేశవ స్వామి మూల విరాట్‌ పానవట్టంలో ఉంటుంది. విష్ణువుకు వాహనమైన గరుక్మంతుడు స్వామి నిలుచొని ఉన్న పానవట్టాన్ని మోస్తుంటాడు. చెన్నయ్య కుడి చేతిలో నాగాభరణం ఉంటుంది. నాగులకు గరుడ జాతికి వైరం. స్వామి వద్ద ఇద్దరు ఉండటం విశేషం.

అబ్బురం రాతి మండపం

ఆస్థాన మండపం చుట్టూ ఒకే రాతితో చుంచు నిర్మా ణం వంపులు వంపులుగా చెక్కబడి అందంగా కనిపిస్తుంది. చుంచుకు విశేషమైన ప్రాము ఖ్యం ఉంది. మార్కాపురం చుంచు, మంగళగిరి గాలిగోపురం, ఎగువ పాలెం రచ్చబండ ప్రసిద్ధి గాంచాయి. 9 అంతస్తులతో గవాక్షాలతో అతి సుందర గాలిగోపురం చెన్నయ్య ప్రత్యేకం. గాలి గోపురాన్ని 1929లో లింగరాజు అనే భక్తుడు భక్తుల సహకారంతో నిర్మించాడు. అనంతరం రామనం యోగేశ్వరరావు గ్రామస్థు సహకారంతో ఏడు అంతస్తులు పూర్తి చేశాడు. 1936లో శ్రీరంగం శ్రీవాస మమలై జీయర్‌ స్వామి గోపుర కలశ స్థాపన మహా సంప్రోక్షణ కుంభాభిషేకం నిర్వహించారు. గాలి గోపురం శిథిలం కావటంతో రూ.70 లక్షలతో జీర్ణోధరణ పనులు నిర్వహించారు. 2013లో త్రిదండి చిన జీయర్‌ స్వామి జీర్ణోధరణ జరిగిన గాలి గోపురానికి మహాసంప్రోక్షణ కుంబాభిషేకం నిర్వహించారు.

వాస్తు శిల్ప వైభవం

చెన్నుని ఆలయ మండపంలో అద్బుత శిల్ప సంపద ఉంది. అన్నదమ్ముల స్తంభాలు ఆశ్చర్య చకితులను చేస్తాయి. అన్నదమ్ములైన ఇద్దరు శిల్పులు మధ్యలో తెరకట్టి ఒకరినొకరు చూసుకోకుండా చెక్కిన శిల్పా లు అచ్చు ఒకేలా ఉంటాయి. భవిష్యత్తులో ఆలయ మహాద్వార, మహా మండప నమూనాలతో ఉండాలని ఈ స్తంభాలు సూచిస్తాయి. మొత్తం 40 స్తంభాలు సకల ప్రాణి సమూహాలకు చిహ్నాలుగా ఉంటాయి. ఆలయంలో పదముగ్గురు ఆళ్వార్లు, వేణుగోపాల స్వామి, లక్ష్మినరసింహాస్వామి, గోదాదేవి, శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామి వార్ల అంతరాలయాలు ఉంటాయి. ఆలయ ఈశాన్య భాగంలో యజ్ఞశాల ఉంది. ఉత్సవమూర్తులు నిత్య నీరాజనాలు, పూజలు అందుకోవడం ఆలయంలో విశేషం. శ్రీదేవి భూదేవిలతో కలిసి చెన్నుడు భక్తులను అనుగ్రహిస్తాడు.

నూతన వెండి రధం

చెన్నకేశవ స్వామికి ఆలయ మాజీ ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ యక్కలి కాశీవిశ్వ నాధం ఆధ్వర్యంలో దాతల సహకారంతో 550 కిలోల వెండిని సేకరించి రూ.3.50 కోట్లతో వెండి రథ నిర్మాణం చేయించారు. రథసప్తమి నాడు చెన్నకేశవునికి సప్తవాహనాలపై నగరోత్సవం నిర్వహిస్తున్నారు.

బంగారు, వెండి బల్లులు

ఆలయంలో బంగారు, వెండి బల్లుల తాపడం చేయించి భక్తులకు స్పర్శ దర్శనం కల్పించారు. యాగశాలలో సుదర్శన చక్రం ప్రతిష్టించారు. ఆలయంలో ఇటీవల లక్షల రూపాయల ఖర్చుతో అభివృద్ధి పనులు చేపట్టారు. శాండ్‌ బ్లాస్టింగ్‌ విధానంతో శిల్పాలకు సహజ కళ రప్పించారు. గర్భాలయం మద్య రంగ మండపం, అమ్మవారి ఆలయంలో గ్రానైట్‌ వేయించి ఆళ్వార్లు వేణుగోపాల స్వామి, నరసింహస్వామి, రామానుజస్వామి ఉపాలయాలకు నూతన గోపురాలు నిర్మించారు. గుడి చుట్టు సాలాహారం నిర్మించారు. నూతన రథసప్తమి వాహనశాల, సూర్య రథ నిర్మాణం చేయించారు.

స్వర్గ సోపానం

చెన్నకేశవస్వామి ఆలయం అనేక విశేషాలకు ఆలవాలం. త్రేతాయుగంలో గౌతమ మహర్షి ఇక్కడ స్వామి కోసం తపస్సు చేశారు. ద్వారప యుగంలో రాక్షసుల బాధలు తట్లుకోలేని సురులు చెన్నకేశవుని పూజించారని అందుకే దీనికి స్వర్గ సోపానం అని పేరు వచ్చిందని పెద్దల చెప్తారు.

నూతన ప్రాకార గోపుర నిర్మాణాలు

ఆలయంలో సుమారు రూ.3 కోట్ల సీజీఎఫ్‌ నిధులతో ప్రాకార గోపురాలు పని పూర్తి కావొస్తోంది. ఇటీవల గోపుర కలశ కుంభాభిషేకం, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. మరో రూ.3కోట్లతో దాతల సహకారంతో పడమ టి గోపురం నిర్మించారు. రూ.కోటితో ఆండాళ్‌, రంగనా యక స్వామి ఆలయాలు, జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి. మరో రూ.1.50కోట్లతో సీజీఎఫ్‌ నిధుల కింద ఆలయ అభివృద్ధికి మంజూరయ్యాయి. దాతల సహకారంతో ఆలయంలో వివిధ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలయానికి మహారాజా గోపురం తలమానికంగా ఉంది.

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నట్లు ఈవో గొలమారి శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. 21న అంకురార్పణ, ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, రాత్రి రాయభారం, ఎదుర్కోల, సూర్యవాహనం నిర్వహించనున్నారు. 22న తెల్లవారితే మంగళ వారం కళ్యాణం నిర్వహించనున్నారు. 23న చంద్రవా హనం, 24న సింహవాహనం, 25న శేషవాహనం, 26న వ్యాళి వాహనం, 27న పొన్నవాహనం, 28న హనుమంత వాహనం, 29న గరుడ వాహనం, 30న గజవాహనం, మే 1న రధోత్సవం, 2న అశ్వవాహనం, 3న హంస వాహనం, 4, 5, 6, 7న వసంతోత్సవం, 8న ఊంజల్‌ సేవ, 9న 16 రోజుల పండుగ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యుత్‌ ప్రభలు పలు కళాకార్యక్రమాలు, ఎడ్లబండ్ల లాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.

Updated Date - Apr 21 , 2024 | 02:00 AM