Share News

ఈ-పంట నమోదుపై తనిఖీలు

ABN , Publish Date - Nov 28 , 2024 | 01:29 AM

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ఈ-పంట నమోదు వాస్తవికతపై కేంద్రప్రభుత్వ సంస్థ తనిఖీలు చేస్తోంది. అందులో భాగంగా జాతీయ శాంపిల్‌ సర్వే సంస్థకు చెందిన నెల్లూరు, కడప కార్యాలయ అసిస్టెంట్‌ డైరెక్టర్లు శ్రీనివాస్‌, రామకృష్ణలు జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధ, గురువారాలలో ఈ బృందం స్థానిక వ్యవసాయ, ప్రణాళిక శాఖల అధికారులతో కలిసి మూడు మండలాలలోని పలు గ్రామాలలో పరిశీలన చేయాల్సి ఉంది.

ఈ-పంట నమోదుపై తనిఖీలు
మేడపిలో డీఏవోతో కలిసి ఈ-క్రాప్‌ నమోదును పరిశీలిస్తున్న ఎన్‌ఎస్‌వో బృందం

జిల్లాలో ఎన్‌ఎస్‌వో బృందం పర్యటన

పలుచోట్ల పంటల పరిశీలన

ఒంగోలు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ ఈ-పంట నమోదు వాస్తవికతపై కేంద్రప్రభుత్వ సంస్థ తనిఖీలు చేస్తోంది. అందులో భాగంగా జాతీయ శాంపిల్‌ సర్వే సంస్థకు చెందిన నెల్లూరు, కడప కార్యాలయ అసిస్టెంట్‌ డైరెక్టర్లు శ్రీనివాస్‌, రామకృష్ణలు జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధ, గురువారాలలో ఈ బృందం స్థానిక వ్యవసాయ, ప్రణాళిక శాఖల అధికారులతో కలిసి మూడు మండలాలలోని పలు గ్రామాలలో పరిశీలన చేయాల్సి ఉంది. ఈనేపథ్యంలో బుధవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏవో) సిహెచ్‌.శ్రీని వాసరావుతో కలిసి ముండ్లమూరు, త్రిపురాంతకం మండలాలలో పర్యటించి ఈ పంట నమోదు పరిశీలించింది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపోయిన రైతులకు పరిహారం అందజేత, ఇతర వ్యవసాయ పథకాలకు ఈ-పంట నమోదు కీలకంగా మారిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాయి.

ఓటీపీతో ఈకేవైసీ చేయాలి

నిబంధనల ప్రకారం ప్రతి రైతుకు చెందిన పొలంలో ఏ సర్వే నెంబరులో ఏ పంట సాగు చేశారన్నది ఫొటోతో సహా వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలి. అనంతరం సదరు రైతు బయోమెట్రిక్‌ లేదా సెల్‌ఫోన్‌ నుంచి ఓటీపీ ద్వారా మిగతా ఈకేవైసీ చేయాలి. అలా జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో దాదాపు 97.80శాతం చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు నివేదించారు. ఆ సీజన్‌లో 4.99 లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి సుమారు 3.93లక్షల ఎకరాలలో పంటలు వేశారు. అందులో లక్షా 40వేల మంది రైతులకు చెందిన 3.85లక్షల ఎకరాలకు సంబంధించి ఈ-పంట నమోదుతోపాటు ఈకేవైసీ కూడా చేశారు.


ఖచ్చితత్వ పరిశీలనకు అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా ఈ పంట ఖచ్చితత్వ పరిశీలనను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ అధికారులు తనిఖీ చేస్తున్నారు. పంట సాగు చేసిన భూమిలో ఈ పంట నమోదు జరిగిందా? లేదా?.. వేసిన పంటనే నమోదు చేశారా? లేక ఒక పంట వేస్తే మరొక పంట నమోదు చేశారా, అసలు పంట వేయకుండా వేసినట్లు చూపుతున్నారా? అన్న అంశాలను వారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందులోభాగంగా బుధవారం ముండ్లమూరు మండలం వేంపాడు, త్రిపురాంతకం మండలం రాజుపాలెం, త్రిపురాంతకం గ్రామాల్లో ఈ-పంట నమోదును పరిశీలించారు. గురువారం హెచ్‌ఎంపాడు మండలంలో పరిశీలించి సాయంత్రం ఒంగోలులో వ్యవసాయ, ప్రణాళికశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Updated Date - Nov 28 , 2024 | 01:56 AM