Share News

ఉపాధిలో వీరదోపిడీ

ABN , Publish Date - May 22 , 2024 | 12:05 AM

పేదలకు ఉపాధి కల్పించేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం అధికారపార్టీ నాయకులకు కల్పతరువుగా మారింది. పేద కూలీలకు చెందాల్సిన ఉపాధి సొమ్మును సీనియర్‌ మేట్లుగా చెలామణీ అవుతున్న వైసీపీ నేతలు, సాంకేతిక సహాయకులు దర్జాగా దోచుకుంటున్నారు. జిల్లా, మండలస్థాయి అధికారులు కూడా వీరి నుంచి వాటాలు తీసుకొని ఏం జరుగుతున్నా చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వాస్తవ పరిస్థితులు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. కలెక్టర్‌ ప్రత్యేకంగా విచారణ కమిటీని ఏర్పాటు చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని స్థానికులు పేర్కొంటున్నారు.

ఉపాధిలో వీరదోపిడీ
ఒకే బోగస్‌ ఫొటోతో రెండు మస్టర్లకు పనులు చేసినట్లు చూపిన కూలీల సంఖ్య

వైసీపీ నేతలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సిబ్బంది కుమ్మక్కు

పనులు చేయకుండానే మస్టర్లు

బోగస్‌ ఫొటోలతో హాజరు నమోదు

కూలీల నుంచి వారానికి రూ.200 వసూలు

పట్టించుకోని ఉన్నతాధికారులు

పుల్లలచెరువు మండలంలో దాదాపు అన్ని గ్రామాల్లో అదే పరిస్థితి

పేదలకు ఉపాధి కల్పించేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం అధికారపార్టీ నాయకులకు కల్పతరువుగా మారింది. పేద కూలీలకు చెందాల్సిన ఉపాధి సొమ్మును సీనియర్‌ మేట్లుగా చెలామణీ అవుతున్న వైసీపీ నేతలు, సాంకేతిక సహాయకులు దర్జాగా దోచుకుంటున్నారు. జిల్లా, మండలస్థాయి అధికారులు కూడా వీరి నుంచి వాటాలు తీసుకొని ఏం జరుగుతున్నా చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వాస్తవ పరిస్థితులు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. కలెక్టర్‌ ప్రత్యేకంగా విచారణ కమిటీని ఏర్పాటు చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని స్థానికులు పేర్కొంటున్నారు.

పుల్లలచెరువు, మే 21 : ఉపాధి హామీ పథకం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. అధికారపార్టీ నేతలు, ఉపాధి సిబ్బంది ఒక్కటై ఇష్టారీతిన దోచుకుతింటున్నారు. వీరికి జిల్లాస్థాయిలో ఉన్నతాధికారుల అండదండలు ఉండటంతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడి భారీగా స్వాహా చేస్తున్నారు. ఇందుకు పుల్లలచెరువు మండలంలో జరుగుతున్న తంతే నిదర్శనం. మండలంలో 19 పంచాయతీలు ఉండగా, సూమారు 15 గ్రామాల్లో మాయ వ్యవహారం జోరుగా సాగుతోంది. క్షేత్రస్థాయి సీనియర్‌ మేట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు కుమ్మక్కై కూలీల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రతికూలీ నుంచి పనులు చేయకుండానే వారానికి రూ.200 నుంచి రూ.300 వరకు గుంజుకుంటున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో ఉండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు, కూలీల పేర్లతో జాబ్‌ కార్డులు పుట్టించి రోజూ మస్టర్లు వేసి వారి నుంచి సగం తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కొందరి నుంచి నేరుగా నగదు మందుగా తీసుకొని మస్టర్లు వేస్తుండగా, కొందరి నుంచి ఆన్‌లైన్‌లో నగదు తెప్పించుకుంటున్నారు.

ఒకటే ఫొటో 747 మందికి మస్టర్లు

మండలంలోని కవలకంట పంచాయతీని పరిశీలిస్తే గత ఆదివారం 747 మందికి మస్టర్లు వేసినట్లు ఆన్‌లైన్‌లో చూపారు. అయితే ఆయా పనులకు సంబంధించి మొత్తం ఒకేవిధమైన ఫొటో అప్‌లోడ్‌ చేయగా, అది కూడా చెరువులోని బురదలో పూడిక తీస్తున్నట్లు ఉంది. గ్రామంలోని తిమ్మారెడ్డి చెరువులో ఆ మేరకు పూడిక తీసినట్లు చూపారు. బురదతో కూడిన చెరువులో అంతమంది ఎలా పనిచేశారో అధికారులే సమాధానం చెప్పాలి. ఇక పనికి సంబంధించిన ఫొటోలో సైతం ఏడెనిమిది మందికి మించి లేరు. అయితే 747 మందికి మస్టర్లు ఎలా పడాయో..! లోగుట్టు ఆయా అధికారులే అర్థం చేసుకోవాలి. ఇలా ఈ ఒక్క పంచాయతీలోనే కాదు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇదే మాయ కొనసాగుతోంది. ఆ మేరకు ఆన్‌లైన్‌లో చూస్తే సామాన్యులకు సైతం అర్థం అవుతోంది. ఇక అధికారులకు ఇవేమి తెలియకపోవడంలో ఉన్న అంతర్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పూడికతీత పనులైతే రేపు సోషల్‌ ఆడిట్‌ నిర్వహించే నాటికి చెరువులో నీళ్లు చేరి ఉంటాయని, అప్పుడు దానిని కప్పిపుచ్చుకోవచ్చని అక్కమార్కుల భావన. విచారణాధికారులు కూడా తమ వారే కాబట్టి ఏం ప్రమాదమూ ఉండబోదని సిబ్బంది ధీమాగా ఉన్నారు.

నిబంఽధనలు ఇలా..

ఉపాధి హామీ పథకం ప్రకారం ఒక చెరువును ఉపాధి హామీ పథకం ద్వారా పూడిక తీస్తే మూడేళ్ల పాటు ఆ చెరువులో ఎటువంటి పని చేయకూడదు. అందుకు విరుద్ధంగా మండల అధికారులు అదే చెరువుల్లో పూడికతీత పనులతో పాత గుంతలకు కొత్త మెరుగులు ఇచ్చి కొలతలు చూపించి మస్టర్లు వేస్తున్నారు. మండలంలో నిత్యం 3వేల మంది పేరుతో ఇలానే బోగస్‌ మస్టర్లు వేసి దోపిడీ చేస్తున్నారు. కొలతలు ప్రకారం ఒక క్యూబిక్‌ మీటరు పనిచేస్తే ఆ కూలీలకు రూ.250 వరకు ఉపాధి వేతనం చెల్లించాలి. కాని ఇవేం పట్టకుండా టెక్నికల్‌ అసిస్టెంట్లు తమకు నగదు ముట్టజెప్పిన వారికి మస్టర్లు వేస్తున్నారు. దీనిలో సీనియర్‌ మేట్‌ నుంచి టీఏ, పైస్థాయి అధికారులకు నిత్యం వాటాలు అందుతున్నాయన్న ఆరోపణలున్నాయి. మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే తంతు నడుస్తోంది.

వారానికి రూ.20 లక్షల వసూలు

ఒక్క పుల్లలచెరువు మండలంలో మొత్తం 19 పంచాయతీలు ఉండగా ఆయా పంచాయతీలో అక్రమ మస్టర్ల ద్వారా రూ.20లక్షల వరకు అధికారులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ లెక్కన నెలకు రూ.80లక్షల వరకు సొమ్మును అధికారులు వాటాలు వేసుకొని పంచుకుంటున్నారు. ఈ విధంగా చూస్తే జిల్లాలోని మిగతా మండలాల్లో ఉపాధి హామీ పనులలో ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఈ అక్రమాలపై కలెక్టర్‌ విచారించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

కొలతలు తీయించి చర్యలు తీసుకుంటాం

ఈ విషయంపై మార్కాపురం ఏపీడీని వివరణ కోరగా పుల్లలచెరువు మండలంలో 200 వసూలు చేస్తున్నట్లు, అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తన దృష్టికి రాలేదని చెప్పడం గమనార్హం. అయితే గ్రామాల్లో జరిగిన పనులపై కొలతలు తీయించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వసూళ్లలో అవినీతి తనకు తెలియదన్నారు.

Updated Date - May 22 , 2024 | 12:05 AM