Share News

మార్పు ఖాయం

ABN , Publish Date - May 08 , 2024 | 02:24 AM

జిల్లాలోని పశ్చిమప్రాంతంలో కలిసి ఉండే కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే రాష్ట్రస్థాయి సమస్యలను అటుంచితే స్థానికంగా రెండుచోట్లా జరిగిన అభివృద్ధి శూన్యం. గత ఐదేళ్లుగా అధికారపార్టీలో గ్రూపు తగాదాలు కొనసాగాయి.

మార్పు ఖాయం
డాక్టర్‌ ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరిన పీసీపల్లి మండలం నేరేడుపల్లి గ్రామస్థులు

మలుపు తిరుగుతున్న ఆ రెండు నియోజకవర్గాలు

కనిగిరిలో అన్నింటా ముందున్న డాక్టర్‌ ఉగ్ర

దర్శిలో శరవేగంగా మారుతున్న సమీకరణలు

రెండుచోట్లా టీడీపీ, జనసేనలు ఐక్యంగా ముందడుగు

రెండుస్థానాల్లోనూ వైసీపీలో అంతఃకలహాలు

ఎమ్మెల్యేల నుంచి అధికార పార్టీకి లభించని సహకారం

జిల్లాలోని కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఆయా వర్గాలలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత, అభివృద్ధి లేమి, అవినీతి వ్యవహారాలు, అంతర్గత కలహాలు వైసీపీకి శాపాలుగా మారాయి. టీడీపీకి కనిగిరిలో అభ్యర్థి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి సేవా కార్యక్రమాలు, అన్న క్యాంటీన్‌ నిర్వహణ, గతంలో చేసి చూపించిన అభివృద్ధి బలమైంది. ఇటు దర్శిలో టీడీపీ, జనసేన జతకట్టడంతో మారిన సమీకరణలు కూటమి అభ్యర్థి లక్ష్మి పూర్తిగా నిలదొక్కుకునేందుకు దోహదపడింది. కనిగిరిలో వైసీపీ అభ్యర్థి దద్దాలకు రాజకీయ అనుభవం లేకపోవడంతోపాటు భూవివాదాల్లో అతని పాత్రపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యే బుర్రా అనుచరగణం సహకరించకపోవడం ఇబ్బందికరంగా మారాయి. దర్శిలో వైసీపీ అభ్యర్థి శివప్రసాద్‌రెడ్డికి రాజకీయ శత్రువులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి అనుచరగణంలో 90శాతం మంది బూచేపల్లికి వ్యతిరేకంగా పనిచేయడం స్పష్టంగా కనిపిస్తోంది.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లాలోని పశ్చిమప్రాంతంలో కలిసి ఉండే కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే రాష్ట్రస్థాయి సమస్యలను అటుంచితే స్థానికంగా రెండుచోట్లా జరిగిన అభివృద్ధి శూన్యం. గత ఐదేళ్లుగా అధికారపార్టీలో గ్రూపు తగాదాలు కొనసాగాయి. అవినీతి వ్యవహారాలు ముమ్మరంగానే జరిగాయి. వర్గపోరుతో చిన్నపాటి అభివృద్ధి పనులపై కూడా ఇరువర్గాల వారు పోటీపడటంతో అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఈసారి రెండుచోట్లా అభ్యర్థులను మార్చిన జగన్‌ ఆ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులను పరిశీలిస్తే కనిగిరిలో టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నివిభాగాల్లో దూసుకుపోతున్నారు. అనేక అంశాలు ఆయనకు సానుకూలంగా మారి గెలుపుదిశగా పయనిస్తున్నారు. దర్శిలో గొట్టిపాటి కుటుంబానికి చెందిన మహిళా డాక్టర్‌ను రంగంలోకి దింపడం ద్వారా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తాజాగా ఇక్కడ పోటీ నువ్వానేనా అన్నట్లు ఉన్నా మారుతున్న సమీకరణలు వైసీపీ నేతలను బెంబేలెత్తిస్తున్నాయి.

కనిగిరిలో ఉగ్రకు అనుకూల వాతావరణం

కనిగిరిలో గత మూడేళ్ల నుంచి మారుతున్న సమీకరణలు టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ఉగ్రకు అనుకూల వాతావరణాన్ని నెలకొల్పాయి. 2009లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొంది కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన చేయగలిగారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి వచ్చి ఓటమి చవిచూసినా నియోజకవర్గాన్ని వీడలేదు. 2008 నుంచి ఇప్పటివరకు 50 వేలమందికి కంటి వైద్య చికిత్సలు చేయించి వ్యక్తిగత అభిమానాన్ని చూరగొన్నారు. గుంటూరులోని తన వైద్యశాల ద్వారా నియోజకవర్గంలోని పేదరోగులకు భారం లేని వైద్యసేవలు అందించడం, కరోనా సమయంలో ఇచ్చిన చేయూత ఆయనకు కలిసొచ్చాయి. గత రెండేళ్ల నుంచి కనిగిరిలో అన్న క్యాంటీన్‌ నిర్వహణ మంచిపేరు తెచ్చిపెట్టింది. మరోవైపు వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ 2022లో జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ద్వారా అనేక వివాదాల్లో ఆయన చిక్కుకున్నారు. సరైన అనుభవం లేకపోవడం, నాయకత్వలేమితో ఎదురీదుతున్న ఆయన.. పార్టీ బలం పైనే ఆధారపడ్డారు. ఎమ్మెల్యే వ్యతిరేకవర్గంలో కొందరు యాక్టివ్‌గా పనిచేస్తుండగా బుర్రా అనుచరగణం వైసీపీకి పూర్తిగా దూరమైంది. తద్వారా యాదవ సామాజికవర్గం ఓటర్లలో చీలిక ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆవర్గంలో అంతో ఇంతో ఆధిక్యత వైసీపీకే ఉన్నప్పటికీ కీలకమైన రెడ్డి సామాజికవర్గంలో మార్పు చోటుచేసుకుంది. అది టీడీపీకి లాభించనుంది.

టీడీపీకి మద్దతుగా వివిధ సామాజికవర్గాలు

కనిగిరి నియోజకవర్గంలో యాదవ సామాజికవర్గం ఓటర్లు 26,561 మంది, రెడ్డి ఓటర్లు 42,860 మంది ఉన్నారు. వీటిలో టీడీపీకి సగానికి సగం లభించే అవకాశం ఉంది. ఇతర బీసీ ఓటర్లు 25వేల మంది వరకు ఉండగా రజక, వడ్డెర్లలో టీడీపీకి ఆధిక్యం కనిపిస్తోంది. జనసేన కలయికతో కాపు సామాజికవర్గం ఓటర్లు పూర్తిస్థాయిలో టీడీపీకి మద్దతిస్తున్నారు. కనిగిరి, పామూరులో ముస్లింలలో వ్యక్తిగత పరిచయాల ద్వారా డాక్టరు ఉగ్రకు 60శాతంకుపైగా ఓట్లుపడే అవకాశం స్పష్టంగా ఉంది. కమ్మ, వైశ్య ఓట్లు 25వేలు వరకు ఉండగా పూర్తి ఆధిక్యత టీడీపీకి కనిపిస్తోంది. దళితుల్లో మాదిగలు 37వేల మంది, మాలలు 15వేల మంది ఉన్నారు. మాదిగల్లో ఎన్డీఏ అనుకూల వాతావరణం నెలకొనడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఆయా సామాజికవర్గాలకు అతీతంగా చూస్తే నియోజకవర్గంలో 60వేల మంది వలస ఓటర్లు ఉన్నారు. దేశంలోని అనేకప్రాంతాల్లో ఉన్న ఈ ఓటర్లతో డాక్టర్‌ ఉగ్రకు మంచి సంబంధాలు ఉండటం కలిసిరానుంది.

దర్శిలో రెండు వర్గాలు కలిస్తే వార్‌ వన్‌సైడే

దర్శిలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. కాపు సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే మద్దిశెట్టిని పక్కనపెట్టి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని వైసీపీ రంగంలోకి తెచ్చింది. ఇప్పటికీ ఆయన తల్లి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నప్పటికీ శివప్రసాద్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడం వైసీపీలోని ఎమ్మెల్యే వర్గీయు లకు మింగుడు పడ లేదు. గత నాలుగేళ్లుగా ఇటు ఎమ్మెల్యే మద్దిశెట్టి, అటు బూచేపల్లి మధ్య పోరు సాగింది. ఎమ్మెల్యే అనుచరగణంలో 90శాతం మంది బూచేపల్లికి వ్యతిరేకంగా నిలబడ్డారు. వారిలో అత్యధికులు టీడీపీ, జనసేనలలో చేరగా.. కొందరు సైలెంట్‌ అయ్యారు. దొనకొండ, ముండ్లమూరు మండలాల్లో రెడ్డి నాయకులు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరగా, తాళ్లూరు మండలంలో కొందరు సైలెంట్‌ అయ్యారు. ఇక సామాజిక సమీకరణలు చూస్తే నియోజకవర్గంలో రెడ్డి, కమ్మ, కాపు సామాజికవర్గాలు బలమైనవి. రెడ్డి ఓటర్లు సుమారు 39వేలమంది ఉండగా కమ్మ, కాపు సామాజిక వర్గం ఓటర్లు దాదాపు సమానంగా ఇరువర్గాలు కలిపితే 55వేలమందికిపైగా ఉన్నారు. దళితుల్లో మాదిగలదే అగ్రభాగం. బీసీలలో యాద వులు, వడ్డెర, రజక తదిత రులు ఉన్నారు. ముస్లింలు 12వేల మంది, ఆర్యవైశ్యులు 6500 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య ఐక్యత అధికంగా ఉంటుంది. ఈ రెండు వర్గాల వారు కలిసికట్టుగా పనిచేసిన ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెసేతర పార్టీలకే విజయం లభిస్తుంది. మొన్నటికి మొన్న దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీని కంగు తినిపించి టీడీపీ గెలిచి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం జనసేన, టీడీపీల కలయికతో ఆరెండు సామాజికవర్గాల వారు పూర్తి ఐక్యతతో ముందడుగు వేస్తున్నారు.

డాక్టరమ్మ నాడి పట్టేశారు

రెడ్డి సామాజికవర్గంలో వైసీపీకి ఆధిక్యత ఉన్నా రెండు మండలాల్లో బలమైన నాయకులు వెళ్లిపోవడం, కొందరు సైలెంట్‌ కావడం, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో శివ ప్రసాద్‌రెడ్డి ఎమ్మెల్యే వ్యతిరేకవర్గానికి గ్రామాల్లో సహకరించటంలాంటి అంశాలతో ఆ ఓటర్లలో చీలిక కనిపిస్తోంది. వీటికితోడు టీడీపీ అభ్యర్థి ఎంపికలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మహిళా అభ్యర్థిని, డాక్టర్‌ అందునా ఆ నియోజకవర్గంతో మంచి అనుబంధం ఉన్న గొట్టిపాటి కుటుంబం నుంచి లక్ష్మిని ఎంపికచేసింది. ఆమె ప్రజలతో మమేకమవుతున్నారు. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకుం టున్నారు. కూటమి శ్రేణులు సమష్టిగా పనిచేయ డంతోపాటు ఏవిషయం లోనూ వెనుకంజ వేయడం లేదు. అటు చంద్రబాబు నేరుగా దర్శి వచ్చి సభ పెట్టడం, ఇటు పవన్‌కల్యాణ్‌ కూడా రానుండటం వారికి కలిసొచ్చింది. ఆర్థిక అంశాలలోనూ టీడీపీ శ్రేణులు ఢీ అంటే ఢీ అంటుండటంతో గాలి మారిపో తోంది. దీంతో పోటీ నువ్వానేనా అన్నట్లు ఉన్నప్పటికీ టీడీపీ విజయానికి అనుగుణంగా బెట్టింగ్‌లు ప్రారంభం కావడం విశేషం.

కలిసొచ్చిన మాగుంట రాక

టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి రంగంలోకి రావడం కనిగిరి, దర్శి అసెంబ్లీ నియోజవవర్గాల్లో కూడా పార్టీకి కలిసొచ్చింది. ఈ రెండు నియోజకవర్గాలతో మాగుంట కుటుంబానికి ప్రారంభం నుంచి మంచి సంబంధాలున్నాయి. 1990 దశకంలో మంచినీటి సమస్య నివారణకు ట్యాంకర్ల ద్వారా నీటిని ఇవ్వడం ద్వారా అక్కడి ప్రజలకు చేరువయ్యారు. ఆయన ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి కావడంతో తటస్థంగా ఉండే వివిఽధ రంగాల ప్రముఖులతోపాటు వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గం నేతలు టీడీపీకి మద్దతు తెలిపారు. పోటీ తీవ్రంగా ఉన్న దర్శి, కనిగిరి ప్రాంతాల్లో మాగుంట రాఘవరెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. దొనకొండ, ముండ్లమూరు మండలాల్లో కీలక నేతలు పార్టీలోకి రావడం, తాళ్లూరు మండలంలో కొందరు వైసీపీ నేతలు పరోక్ష మద్దతు ప్రకటించడం కలిసొస్తోంది.

Updated Date - May 08 , 2024 | 02:24 AM