Share News

కుల వృత్తులు కుదేలు

ABN , Publish Date - May 07 , 2024 | 01:21 AM

చేతివృత్తులపై ఆధారపడి జీవించేవారి పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో దారుణంగా తయారైంది. మేదర, కుమ్మరి, కంసాలి, రజకులు, క్షురకులు, స్వర్ణకారులు, కార్పెంటర్లు, చెప్పులు కుట్టేవారు, ఎలక్ర్టీషియన్లు ఇలా ఒకటేమిటి అన్ని చేతివృత్తిదారుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది.

కుల వృత్తులు కుదేలు

జగన్‌ పాలనలో అంతా ఆర్భాటమే

ఐదేళ్లలో చేతివృత్తులకు మొండిచేయి

ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌లలో నిధులు నిల్‌

పెరిగిన ధరలతో సగటు జీవి బతుకు భారం

వైసీపీ మళ్లీ వస్తే ఊరొదిలి పోవాల్సిందే!

జగన్‌ ప్రభుత్వం రెక్కాడితేగాని డొక్కాడని బడుగుజీవుల పొట్టగొట్టింది. పేదల ప్రభుత్వం అంటూ ప్రతిసారీ గొప్పలు పోయే వైసీపీ నేతలు ఒక్కసారైనా చేతివృత్తుల వారి పరిస్థితి గురించి ఆలోచించలేదు. వారి సంక్షేమం కోసం చిల్లిగవ్వ విడుదల చేయలేదు. కనీసం రుణాలు పొందే వీలు కూడా లేకుండా చేశారు. టీడీపీ హయాంలో ‘ఆదరణ’ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల్లోని చేతివృత్తుల వారి ఆర్థికాభివృద్ధి కోసం యంత్రాలు, పరికరాలు ఇచ్చి అండగా నిలిచింది. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆ పథకాన్ని దుర్మార్గంగా రద్దుచేసింది. ఆయా కార్పొరేషన్లకు ఒక్కపైసా నిధులు లేకుండా చేసి, ఉపయోగం లేని పదవులు కట్టబెట్టింది. కానీ వారిని ఉద్ధరించినట్లు చెప్పుకోవడంపై ఆయా సామాజిక వర్గాలు మండిపడుతున్నాయి.

ఒంగోలు (కార్పొరేషన్‌) మే6 : చేతివృత్తులపై ఆధారపడి జీవించేవారి పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో దారుణంగా తయారైంది. మేదర, కుమ్మరి, కంసాలి, రజకులు, క్షురకులు, స్వర్ణకారులు, కార్పెంటర్లు, చెప్పులు కుట్టేవారు, ఎలక్ర్టీషియన్లు ఇలా ఒకటేమిటి అన్ని చేతివృత్తిదారుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్క చాన్స్‌ అంటూ ఓటేస్తే బాగానే ఉద్ధరించాడని వాపోతున్నారు.ఒక్క ప్రభుత్వ పథకమూ అమలు చేయకపోగా, పైసా రుణం కూడా ఇవ్వలేదని ప్రభుత్వంపై వారు మండిపడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తమకు మేలు జరిగిందని బహిరంగంగానే చెబుతున్నారు. చేతివృత్తిదారులకు పరికరాలు ఇవ్వడంతోపాటు, ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందించి అండగా నిలిచారని తెలిపారు. ఈసారి జగన్‌ను నమ్మి ఓటేస్తే ఇక నట్టేట మునిగిపోవాల్సిందేనన్నారు. ఊరూవాడా వదిలి వలసలు పోయే పరిస్థితికి తీసుకొస్తాడని, వద్దు బాబోయ్‌.. జగన్‌ పాలన మాకొద్దు అంటున్నారు.

పేదలకు చేరని ప్రభుత్వ పథకాలు

టీడీపీ హయాంలోపేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం రాగానే దూరం చేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అన్నివర్గాల ప్రజలకు ఆర్థిక చేయూత నిచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ల ద్వారా రుణ సౌకర్యం కల్పించారు. ఆర్థికంగా అండగా నిలిచారు. అయితే గడిచిన ఐదేళ్లలో పలు పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నా, పాలకులుహామీలు ఇస్తున్నా బ్యాంకులు మాత్రం ముందుకు రావడం లేదు. ఎలాంటి హామీలు లేకుండానే ప్రభుత్వం అందించే ముద్ర రుణాలు కూడా దక్కని పరిస్థితులు ఉన్నాయి.

కడుపు నింపని కులవృత్తి

తరతరాలుగా కులవృత్తిపై ఆధారపడిన మేదరలు నేడు దానికి దూరమైపోతున్నారు. రోజంతా కష్టపడి పనిచేసినా కనీసం కడుపునిండా కూడు తినలేని పరిస్థితులను నేడు చూస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు వారి దాకా చేరడం లేదు. గత టీడీపీ హయాంలో పథకాలు అందరికీ అందేవని, ధరలు అదుపులో ఉండటంతో రోజూ సంపాదించిన దాంతో సంతోషంగా జీవించామని వారు అంటున్నారు. కొంత ఆదా కూడా చేసుకునే పరిస్థితులు ఉండేవన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పథకం కూడా రాలేదంటున్నారు. తాము ఉన్నామన్న సంగతి కూడా మరిచిపోయారని మేదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదేళ్లలో పనులు జరుగుతున్నా పైసా కూడా దాచిపెట్టలేని పరిస్థితి ఉందని, రోజంతా కష్టపడినా పెరిగిన ధరలతో పెట్టుబడులు కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.

గంగిరెద్దుల వారి గోడు పట్టించుకునేవారు కరువు

జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన నాగెళ్లముడుపు గ్రామం గంగిరెద్దుల వాళ్లకు పెట్టింది పేరు. పొట్ట చేతపట్టుకుని పట్నం వచ్చిన గంగిరెద్దుల వాళ్ల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఒంగోలు నగరంలోని గాంధీనగర్‌లోని ఓ ఖాళీ స్థలంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని ఇల్లిల్లూ తిరుగుతూ పొట్ట నింపుకొంటున్న వందల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు దూరమయ్యాయి. సంక్రాంతి సంబరాలు, ప్రత్యేక ప్రభుత్వ కార్యక్రమాలు, పెద్దోళ్ల గృహ ప్రవేశాలకు మాత్రమే వారిని గుర్తించి ఆహ్వానించడం తప్ప ఆ తర్వాత పట్టించుకునే వారే కరువయ్యారు. ఇతర కులస్థుల మాదిరిగానే తమకూ గుర్తింపుకార్డులు, రేషన్‌కార్డులు, రిజర్వేషన్లు కల్పించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

స్వర్ణం వెలవెలబోతోంది

స్వర్ణకారుల కుటుంబాలు నేడు వెలవెలబోతున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు తక్కువ రేటుతో చూడముచ్చటైన నగలు తయారీ చేసి అందించిన బంగారం వృత్తిదారులు ప్రస్తుతం కార్పొరేట్‌ షాపులు, రెడీమేడ్‌ వస్తువులు అందుబాటులోకి రావడంతో పనులు లేక ఖాళీగా ఉంటున్నారు. జిల్లాలో 1500 వరకు బంగారు ఆభరణాల తయారీ షాపులు ఉండగా, సుమారు 3వేలకు మందికిపైగా స్వర్ణకారులు (గోల్డ్‌స్మిత్‌లు) చేతివృత్తిని ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. పలువురు పెద్ద బంగారు దుకాణాలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్నారు. మరికొందరు సొంతంగా పనులు ఒప్పుకుని జీవనం సాగిస్తుండగా, కొందరు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని జీవిస్తున్నారు. వారిలో 80శాతం మంది బంగారు, వెండి అమ్మకాల షాపులపై ఆధారపడి జీవిస్తుండగా, 20శాతం మంది సొంతంగా పని ఒప్పుకొని కుటుంబపోషణ సాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి రుణాలు, పథకాలు కూడా లభించలేదు.

దయనీయంగా చర్మకారులు

మారుతున్న కాలానుగుణంగా చేతివృత్తులు, కులవృత్తులు అంతరించిపోతున్నాయి. వాటి లో చర్మకార వృత్తి ఒకటి. గతంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో చర్మకారులు (చెప్పులు కుట్టేవారికి) చేతినిండా పని ఉండేది. అప్పట్లో ప్రతి ఒక్కరూ స్వయంగా తమ సైజులలో కోరిన విధంగా కుట్టించుకుని మరీ వాడేవారు. గ్రామీణ ప్రాంతాల్లో అనాదిగా వస్తున్న ఈ వృత్తిని నమ్ముకునే అనేక కుటుంబాలు జీవిం చేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.నేటి ఆధునిక కాలానిక నుగుణంగా చెప్పుల తయారు చేసే వారు లేకపోగా అక్కడక్కడా రిపేరు చేసే వారు మాత్రమే కనిపిస్తున్నారు. అయినప్పటికీ వీరికి ఆదరణ కరువైపోతోంది. వైసీపీ పాలనలో రోజురోజుకూ అడ్డగో లుగా పెరుగుతున్న నిత్యావసర ధరలతో జీవనం దుర్భరంగా మారిందని పలువురు చర్మకారులు వాపోతున్నారు. వారికి ప్రభుత్వ సాయం అంతంతమాత్రంగానే అందుతోంది.

Updated Date - May 07 , 2024 | 01:21 AM