Share News

భూ వివాదాలతోనే కారు దహనం

ABN , Publish Date - May 26 , 2024 | 02:06 AM

సింగరాయకొండ మండలం మూలగుంటపా డులో టీడీపీ నేత ఇంటి ముందు ఉన్న కారును దహనం చేసి భయానక వాతావరణం సృష్టించిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భూ వివాదాలతోనే కారు దహనం
వివరాలను వెల్లడిస్తున్న ఏఎస్పీ (క్రైం) శ్రీధర్‌రావు, డీఎస్పీ కిషోర్‌బాబు

ముగ్గురు నిందితుల అరెస్టు

వివరాలను వెల్లడించిన ఏఎస్పీ శ్రీధర్‌రావు

ఒంగోలు (క్రైం), మే 25 : సింగరాయకొండ మండలం మూలగుంటపా డులో టీడీపీ నేత ఇంటి ముందు ఉన్న కారును దహనం చేసి భయానక వాతావరణం సృష్టించిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. 12 గంటలు తిరక్కుండానే నిందితులను పోలీసులు పట్టుకొని ఉత్కంఠకు తెరదించారు. భూవివాదానికి సంబంధించిన అంశమే ఘటనకు కారణమని తేలింది. ఏఎస్పీ ఎస్‌.వి.శ్రీధర్‌ రావు శనివారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని గెలాక్సీ మంది రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిగురుపాటి శేషగిరి ఇంటి వద్ద ఉన్న కారును అర్ధరాత్రి దుండగులు తగులబెట్టారు. రాజకీయ కక్షలు అని భావించిన పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి దర్యాప్తు చేయించారు. ఎదురింటి సీసీకెమెరా ఫుటేజ్‌లో నిందితులను గుర్తించారు. సింగరాయకొండ మండలం మూలగుంటపాడు విద్యానగర్‌ ఎనిమిదో లైన్‌లో నివాసం ఉంటున్న కనసాని ఈశ్వర్‌రెడ్డి, జరుగుమల్లి మండలం నర్సింగోలుకు చెందిన పాలేటి అభిషేక్‌, మరో మైనర్‌ బాలుడిని సింగరాయకొండ బైపాస్‌ రోడ్డు వద్ద శనివారం మధ్యాహ్నం అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. ఒక స్థలం విషయంలో కనసాని ఈశ్వర్‌రెడ్డి, అశోక్‌ అనే వ్యక్తి మధ్య వివాదం నడుస్తోంది. అందుకు సంబంధించి మధ్యవర్తిగా శేషగిరి ఉన్నారు. శేషగిరి వద్ద ఒప్పందపత్రం ఉంది. ఆ పత్రాన్ని తనకు ఇవ్వాలని ఈశ్వర్‌రెడ్డి అడగ్గా అందుకు నిరాకరించాడు. దీంతో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. శేషగిరిపై కక్ష తీర్చుకునేందుకు అతని కారును తగులబెట్టాలని ఈశ్వర్‌రెడ్డి పథకం పన్నాడు. ఈ మేరకు తన లాడ్జిలో పనిచేస్తూ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న మైనర్‌ బా లుడితోపాటు జరుగుమల్లి మండలం నర్సింగోలుకు చెందిన అభిషేక్‌లను పిలిపించాడు. కారు తగులబెట్టేందుకు రూ.7వేలు అభిషేక్‌కు ఇచ్చాడు. యువకుడితోపాటు బాలుడు శుక్రవారం అర్ధరాత్రి 12.45 సమయంలో బైక్‌పై వెళ్లి తమతో తెచ్చుకున్న మూడు బాటిళ్ల పెట్రోల్‌ను పోసి కారును తగుల బెట్టారు. కాగా ఈ కేసును 12గంటలలోపే ఛేదించిన డీఎస్పీ ఎం.కిషోర్‌బాబు, సీఐలు రంగనాథ్‌, పాండురంగారావు, జగదీష్‌, ఎస్సైలు శ్రీరామ్‌, వెంకటేశ్వర రావులను ఎస్పీ అభినందించినట్లు ఏఎస్పీ శ్రీధరరావు తెలిపారు.

Updated Date - May 26 , 2024 | 02:06 AM