Share News

ప్రశాంతంగా గ్రూపు-2 పరీక్ష

ABN , Publish Date - Feb 25 , 2024 | 11:53 PM

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూపు-2 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 21,565 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారి కోసం 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు 17,860(82శాతం) మంది హాజరయ్యారు.

ప్రశాంతంగా గ్రూపు-2 పరీక్ష
ఒంగోలులో పరీక్ష కేంద్రాన్నితనిఖీ చేస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ (ఇన్‌సెట్లో) ఓ అభ్యర్థిని బిడ్డను లాలిస్తున్న మహిళా కానిస్టేబుల్‌

ఎనిమిది గంటలకే కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు

పలుచోట్ల తనిఖీ చేసిన కలెక్టర్‌ దినే్‌షకుమార్‌

చిన్నారిని లాలించిన మహిళా కానిస్టేబుల్‌

ఒంగోలు (కలెక్టరేట్‌), ఫిబ్రవరి 25 : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూపు-2 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 21,565 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారి కోసం 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు 17,860(82శాతం) మంది హాజరయ్యారు. ఉదయం 8 గంటలకే ఆయా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకున్నారు. ఒంగోలులో అత్యధికంగా 28 సెంటర్లు ఏర్పాటు చేయగా అక్కడికి పరీక్ష రాసేవారితోపాటు వారితల్లిదండ్రులు తరలిరావడంతో కోలాహలం నెలకొంది. నిర్ణీత సమయానికి అర్ధగంట ముందుగానే అభ్యర్థుల హాల్‌ టికెట్లను పోలీసులు, ఆయా కాలేజీల నిర్వాహకులు పరిశీలించి లోపలికి అనుమతించారు. సెల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ర్టానిక్‌ పరికరాలు అనుతించలేదు. వాటిని బయటే ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రూపు-2 పరీక్ష రాసేందుకు జిల్లాలోని పలుప్రాంతాలతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా అభ్యర్థులు ముందురోజు రాత్రే ఒంగోలు చేరుకున్నారు. కొందరు తల్లులు చంటిబిడ్డలతో సహా వచ్చారు. బయట వారి కుటుంబ సభ్యులకు చిన్నారులను అప్పగించారు. ఒక పరీక్షా కేంద్రం వద్ద ఓ చిన్నారి ఏడుస్తూ ఉండటాన్ని గమించిన అక్కడ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌ ఆ చిన్నారిని పరీక్ష పూర్తయ్యే వరకూ తన వద్దనే ఉంచుకొని లాలించారు. కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ స్థానిక మంగమూరు రోడ్డులోని శ్రీహర్షిణీ కళాశాలతోపాటు క్విస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలోని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. మరోవైపు ఆయా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డి బందోబస్తును పరిశీలించడంతోపాటు పలు కేంద్రాలను తనిఖీ చేశారు. మంగమూరు రోడ్డులోనే ఐదారు పరీక్షా కేంద్రాలు ఉండటంతో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అభ్యర్థులంతా ఒక్కసారిగా బయటకు వచ్చారు. దీంతో మంగమూరు రోడ్డు జంక్షన్‌లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. జవాబు పత్రాలు ఆదివారం రాత్రి ప్రత్యేక బస్సులో విజయవాడకు తరలించారు.

Updated Date - Feb 25 , 2024 | 11:54 PM