Share News

ఊరించి.. ఉసూరుమనిపించి..!

ABN , Publish Date - May 21 , 2024 | 10:42 PM

ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలు, మరో పక్క వాతావణ పరిస్థితులు, అధిక పెట్టుబడులు వెరసి రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి. వేలకువేల పెట్టుబడులు పెట్టి సాగు చేసుకున్న రైతులకు సరైన ధరలేకపోవడంతో నష్టాలపాలు కావాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ఏమిచేయాలో పాలుపోని స్థితిలో రైతులు ఉన్నారు.

ఊరించి.. ఉసూరుమనిపించి..!
పర్చూరులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న పొగాకు

లోగ్రేడ్‌ ధరకే పరిమితమైన నాణ్యమైన పొగాకు

ఆందోళనలో వైట్‌బర్లీ రైతులు

ధర కోసం ఎదురుచూపు

పర్చూరు, మే 21 : ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలు, మరో పక్క వాతావణ పరిస్థితులు, అధిక పెట్టుబడులు వెరసి రైతులను కలవరానికి గురిచేస్తున్నాయి. వేలకువేల పెట్టుబడులు పెట్టి సాగు చేసుకున్న రైతులకు సరైన ధరలేకపోవడంతో నష్టాలపాలు కావాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ఏమిచేయాలో పాలుపోని స్థితిలో రైతులు ఉన్నారు. పర్చూరు వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిధిలో వేల ఎకరాల్లో సాగు చేసుకున్న వైట్‌ బర్లీ పొగాకు రైతులు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పంట చేతికి వచ్చిన తరుణంలో లోగ్రేడ్‌ పొగాకు క్వింటాకు రూ.14వేలు పైచిలుకు పలకడంతో సాగుచేసుకున్న రైతులకు ఎంతో ఊరటనందించింది. దీంతో నాణ్యమైన వైట్‌బర్లీ పొగాకుకు మంచి ధర పలుకుతుందని ఆశపడ్డారు. ఆశ కాస్త అడి ఆశగా ప్రస్తుత పరిస్థితి నెలకొంది. లోడ్‌ గ్రేడ్‌ ధరకు మించి నాణ్యమైన పొగాకు కొనుగోలు జరగడం లేదు. దీంతో ఏమిచేయాలో పాలుపోని స్థితిలో అన్నదాతలు ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో కొనుగోలుదారులు ముందుకు రావడం లేదని రైతులు అనుకున్నారు. ఎన్నికలు ముగిసినా ధరల పెరుగుధలలో మార్పులేక పోవడం, కొనుగోళ్లు కూడా మందకుడిగా సాగడంతో రైతుల్లో నైరాశ్యం నెలకొంది. మరో పక్క వర్షాల నేపథ్యంలో చేతికి అందివచ్చిన పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో వైట్‌బర్లీ పొగాకుకు నాణ్యమైన ధర ఉన్నా వ్యాపారులు సిండికేట్‌గా మారడం వల్లే ధరలు ఇలా దిగజారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క వ్యవసాయ సీజన్‌ సమీపిస్తుండడంతో పెట్టుబడుల కోసం విక్రయాలు చేయాల్సి వస్తుందని రైతులు అంటున్నారు.

ధరపైనే రైతుల ఆశ

ప్రస్తుతం వ్యవసాయ ఖర్చులు, నామమాత్రపు దిగుబడుల నేపథ్యంలో ధర అనుకూలంగా ఉంటేనే పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి. గత ఏడాది వ్యవసాయ సీజన్‌ ముగిసే సమయంలోనాణ్యమైన పొగాకు క్వింటా రూ.18వేలకు కొనుగోలు చేశారు. దీంతో ఈఏడాది కూడా అనుకున్న మేర ధర ఉంటుందన్న ఆశతో రైతులు వ్యయ ప్రయాశలకోర్చి వేల ఎకరాల్లో వైట్‌బర్లీ పొగాకును సాగు చేశారు. ప్రస్తుతం ఉన్న ధరలతో రైతుల్లో నైరాశ్యం నెలకొంది.

Updated Date - May 21 , 2024 | 10:42 PM