తేలని ఇంటి పట్టాల లెక్క
ABN , Publish Date - Jul 08 , 2024 | 01:54 AM
పేదలకోసం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో లెక్కకు మించి పట్టాలు మం జూరు చేశారు.

ఎర్రగొండపాలెం, జూలై 7 : పేదలకోసం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో లెక్కకు మించి పట్టాలు మం జూరు చేశారు. దీంతో ఒకే పట్టా నంబరు ఇద్దరికి మంజూరు కావడంతో జగనన్న కాలనీలో పట్టాల సమస్య పరిష్కరించాలని కాళ్లు అరిగేలా తహసీల్దారు కార్యాలయం చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నారు. దీనిపై విచారిస్తామన్న అధికారులు మూడేళ్లగా నానుస్తున్నారు.
తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే వీఆర్వోలు ఒకే పట్టాను ఇద్దరికి ఇచ్చి వివాదాలు సృష్టించారు. నేటికి ఆ వీఆర్వోలపై ఎలాంటి చర్యలు లేవని బహిరంగంగా విమర్శలు వినిపిస్తున్నాయి. 2022 మార్చి నుంచి లబ్ధిదారులు వినతిపత్రాలు ఇస్తున్నా సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. 2022 మార్చినెల నుంచి ఇప్పటి వరకు ముగ్గురు ఇన్‌చార్జ్ తహసీ ల్దార్లు ఒక రెగ్యులర్ తహసీల్దార్ల పర్యవేక్షణలో అధికారులు విచారించడం మినహా సమస్య పరిష్కారం కావడం లేదని లబ్ధిదారులు తెలియజేస్తున్నారు.
ఎర్రగొండపాలెం సమీపంలోని మిల్లంపల్లి టోల్‌ప్లాజా వద్ద ప్రభుత్వభూమిలో జగనన్న కాలనీలో 2020లో పేదలకోసం 1316 ప్లాట్లుతో ప్లాన్ వేసి జిల్లా కలెక్టర్ నుంచి మంజూరు ఉత్తర్వులు పొందారు. 1316 లే-అవుట్ పట్టాలలో 1057 పట్టాలు లబ్దిదారులకు పంపిణి చేశారు. 84 పట్టాలు సామాజిక అవసరాల కోసం అని ఉంచారు. పీఆర్‌కే నంబరు వచ్చి పట్టాలు మంజూరైన మహిళలు పట్టాలు చేతికి అందలేదని 36 నెలలుగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతునే ఉన్నారు. ఇప్పటికీ 209 మందికి పట్టాలు చేతికి అందక వచ్చిన అధికారికల్లా అర్జీలు ఇస్తూనే ఉన్నారు.
ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళకు పీఆర్‌కే నంబరు 00048852 నెంబరు ఉన్నప్పటికీ, ఇప్పటికి పట్టా మంజూరు చేయకుండా తిప్పుతున్నారు. అంబేడ్కర్ నగర్ చెందిన భారతమ్మ, ఎర్రగొండపాలెం పట్టణానికి చెందిన మస్తాన్‌బీలకు పట్టాలు మంజూరు కాలేదు. 01455780 పీఆర్‌కే నెంబరు ఉన్న నార్నపాటి వెంకటమ్మ, పీఆర్‌కే నంబరు 01424506 నార్నపాటి ప్రియాంకలకు పట్టాలు పంపిణీ చేయలేదు.మహిళలు పలుదపాలు తహసీల్దారు ఆఫీసులో వినతులు సమర్పించారు. 209 మంది లబ్ధిదారులకు చెందిన పట్టాలు ఎవరు గల్లంతు చేశారనే మిస్టరి వీడలేదు. పంపిణీ జరిగిన 1057 పట్టాలలో 60మందికి ఒకే ప్లాటు నంబరుతో ఇరువురు లబ్ధిదారులకు ఒకే పట్టాను పంపిణీ చేశారు. ఒకే ప్లాటును ఇరువురు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడంతో వారు గొడవ పడుతున్నారు. నటుకుల సునీత అనే మహిళకు పట్టా నెంబరు లేకుండా తహసీల్దారు సంతకంలో ఖాళీ పట్టాపంపిణీ చేశారు. దాదాపు 8 మందికి పట్టా నెంబరు లేకుండా పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు పంపిణీలో కొందరు బినామీ పట్టాలు పొంది వాటిని అప్పుడే విక్రయిస్తున్నారు. పట్టాల పంపిణీ సమయంలో ఒక్కొక్క పట్టాకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు లభ్దిదారుల నుంచి అప్పటిలోనే వసూళ్లు చేసినట్లు సమాచారం. పట్టాలు పంపిణీలో జరిగిన అవకతవకల పై తహసీల్దార్లు కార్యాలయం నుంచి 2022 నుంచి డిప్యూటీ తహసీల్టారు, ఆర్.ఐల పర్యవేక్షణలో విచారించి నా, పట్టాలు లెక్కతేలలేదు. పట్టాలు ఇచ్చి స్థలాలు స్వాధీనం చేయలేదని లబ్ధిదారులు గతంలో ‘గడప, గడపకు ప్రభుత్వ కార్యక్రమం’లో చెప్పడంతో అప్పటి రాష్ట్రపురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి ఆదిమూలపు సురేష్ 2022 సెప్టెంబరు 6వ తేదీ ఆయనే స్వయంగా రెవెన్యూ అధికారులతో కలసి జగనన్న లే-ఔట్ కాలనీలో పర్యటించి మ్యాప్పలను తనిఖీ చేశారు. అప్పటి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సురేష్ తహసీల్దార్‌ను సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెంది రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వంపై లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు. జగనన్న లే-ఔట్‌లో 1316 పట్టాలలో 400 పట్టాలు పొందిన లబ్ధిదారులు అధికారులు విచారణ చేపట్టిన సమయంలో హాజరు కావడం లేదని అందువల్లే విచారణ ముందుకు సాగడం లేదని వెళ్లిన రెవెన్యూ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల విఽఽధులకోసం వచ్చిన తహసీల్దారు పట్టాలు విచారించి తమకు తెలియదని తెలిపారు. కొత్త ప్రభుత్వంలోనైనా నకిలీ పట్టాలపై విచారించి సమస్యను పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.