ఆక్రమణల్లో శ్మశాన స్థలం
ABN , Publish Date - Nov 25 , 2024 | 11:38 PM
కొండపి గ్రామ పంచాయతీలోని కట్టావారిపాలెంలో శ్మశానస్థలం ఆక్రమణలకు గురైంది. గ్రామంలో ఎవరైనా చనిపోతే శ్మశానంలోకి వెళ్లే వీలులేకుండా పోయింది. పైగా శ్మశాన స్థలం ఎక్కడ ఉందనే ఆచూకీ కూడా కనిపించని దుస్థితి ఏర్పడింది.
తొలగించాలని గ్రామస్థుల వినతి
కొండపి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): కొండపి గ్రామ పంచాయతీలోని కట్టావారిపాలెంలో శ్మశానస్థలం ఆక్రమణలకు గురైంది. గ్రామంలో ఎవరైనా చనిపోతే శ్మశానంలోకి వెళ్లే వీలులేకుండా పోయింది. పైగా శ్మశాన స్థలం ఎక్కడ ఉందనే ఆచూకీ కూడా కనిపించని దుస్థితి ఏర్పడింది. సర్వేనంబర్ 90 బార్ 1ఓలో 76సెంట్లు స్థలాన్ని దశాబ్దాలుగా గ్రామానికి చెందిన కొందరు శ్మశానానికి వదిలేశారు. గతంలో రావెళ్ల అనే ఇంటిపేరు ఉన్నవారే ఇక్కడ దహన, ఖనన కార్యక్రమాలు చేసుకునేవారు. ఇది దాదాపు 14 మందికి ఉమ్మడి స్థలంగా ఉంది. ఇందులో ఆరుగురు దాతలు దాదాపు 18.05శెంట్ల స్థలాన్ని శ్మశానానికి కేటాయిస్తూ గ్రామపంచాయతీకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. మిగతావారు కూడా శ్మశానానికి మిగిలిన స్థలం వాడుకోవడానికి సమ్మతిస్తూ లిఖితపూర్వకంగా వంద రూపాయల స్టాంప్‌పై దానపత్రం రాసిఇచ్చారు. దీంతో కొందరికే కాకుండా గ్రామం మొత్తానికి శ్మశాన వాటికగా ఉపయోగపడేలా ఉంది. 2017లో ప్రభుత్వం ఈస్థలంలో శ్మశాన వాటిక నిర్మాణానికి రెండు లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. కొంత నిర్మాణ పనులు జరిగాక ప్రభుత్వం మారడంతో శ్మశాన వాటిక పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆపార్టీకి చెందిన నాయకులు ఈస్థలంలో గ్రామ సచివాలయం నిర్మిచాలని ప్రయత్నాలు చేశారు. అయితే దాతల్లో కొంతమంది లీగల్ నోటీసులు పంపడంతో ఆ ప్రతిపాదనలు ఆగిపోయాయి.
స్థలానికి విలువ పెరగడంతో...
76 సెంట్ల స్థలం దశాబ్దాలుగా రావెళ్ల కుటుంబీకులకు ఉమ్మడి శ్మశానంగా ఉంది. గడచిన ఐదేళ్ల కాలంలో ఈ స్థలం విలువ పెరగడంతో ఇందులోని కొందరు వాటాదారులు తమకు అనుకూలమైన చోట ఆక్రమించుకుని మెరకలు తోలుకుని కంచెలు వేసుకున్నారు. దీంతో ప్రస్తుతం దాతలు ఇచ్చిన స్థలం ఎక్కడనేది తేలకుండా పోయింది. గతంలో గ్రామంలో ఒకరు చనిపోయినపుడు కూడా శ్మశానానికి వెళ్లనివ్వకపోవడంతో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గడచిన ఐదేళ్లలో స్థలం సబ్ డివిజన్ చేయకుండానే రెవెన్యూ అధికారులు తమకు తోచిన విధంగా కొందరికి ఆన్‌లైన్ చేశారు. ఇప్పుడు శ్మశాన స్థలానికి వెళ్లే మార్గంకాని, ఆ స్థలంగాని కనిపించడం లేదు. దాతలిచ్చిన స్థలాన్ని సబ్ డివిజన్ చేసి శ్మశానానికి దారి ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
సబ్ డివిజన్ చేసి శ్మశాన స్థలాన్ని కేటాయించాలి
గతంలో తమ ఇంటి పేరున్న వారికే ఈస్థలం శ్మశానంగా ఉంది. 2014-19 మధ్య కాలంలో గ్రామం మొత్తానికి ఉపయోగపడేలా దాతలు గ్రామ పంచాయతీకి రాసిచ్చారు. ఆస్థలం ప్రస్తుతం ఎక్కడ ఉందనేది తేలడం లేదు. ఉమ్మడి స్థలం కావడంతో కొందరు తమ స్థలం అంటూ ఆక్రమణలు చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు శ్మశాన స్థలాన్ని వేరుచేసి శ్మశానికి కేటాయిస్తే అభివృద్ధి చేసుకుంటాం.
రావెళ్ల రమే్‌షబాబు, కట్టావారిపాలెం