రైల్వే స్టేషన్‌లో సమస్యల కూత
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:22 AM
పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం రైల్వేస్టేషన్ అత్యంత రద్ధీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో రైల్వేశాఖకు ఈ స్టేషన్ వలనే అధిక ఆదాయం వస్తుందనేది అంద రికీ తెలిసిన విషయమే.

పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం రైల్వేస్టేషన్ అత్యంత రద్ధీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో రైల్వేశాఖకు ఈ స్టేషన్ వలనే అధిక ఆదాయం వస్తుందనేది అంద రికీ తెలిసిన విషయమే. దీంతో ఈ స్టేషన్‌ను ఆరు వసంతాల క్రితమే ఆదర్శ రైల్వేస్టేషన్‌గా అధికారులు ప్రకటించారు. అయితే ఈ స్టేషన్‌లో మాత్రం సమస్యలు కూత పెడుతున్నాయి.
మార్కాపురం రూరల్ అక్టోబర్ 22 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం రైల్వేస్టేషన్ నుంచి నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తుంటారు. అయితే రైల్వేస్టేషన్‌లో వసతులను చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణీకులకు కనీసం నాణ్యమైన మంచి నీటి సౌకర్యం కూడా లేదని వాపోతున్నారు.
మూలనపడ్డ మినరల్ వాటర్ ప్టాంట్
గతంలో వైవీ.సుబ్బారెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఎంపీ గ్రాంట్‌తో రైల్వేస్టేషన్‌లో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఆ ప్లాంట్ మూల నపడి నిరుపయోగంగా ఉంది. ఆ గదిని ఇప్పుడు రైల్వే కు సంబందించిన సామాగ్రిని భద్రపరుచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. మినరల్ వాటర్ తయారు చేసే మిషన్లు పడ్డాయి. దీంతో ప్రయాణికులకు తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. స్టేషన్‌లో ఉన్న మిగిలిన కుళాయిలకు కూడా సాదారణ తాగు నీరు సక్రమంగా సరఫరా కావడంలేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు ఇక్కట్లే
ఆ రైల్వే స్టేషన్‌లో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేయాలంటే అభద్రతా భావానికి గురవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలను స్టేషన్ ఆవరణలో ఎక్కడ పడితే అక్కడే పార్కింగ్ చేస్తున్నారు. అయితే పార్కింగ్ చార్జీల వసూలు చేయండంలో కాంట్రాక్టర్ మాత్రం ఎక్కడా రాజీ పడటంలేదు. రోజుకు సమారు రూ.24 అద్దె వసూ లు చేస్తున్నారని వాహన దారులు వాపోతున్నారు.
అసంపూర్తిగా అభివృద్ధి పనులు
సాదారణ రైల్వేస్టేషన్ నుండి ఎస్‌ఎన్‌జి-3, ఆ తరువాత ఎస్‌ఎన్‌జి-4 గ్రేడ్‌గా మారినా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. ప్లాట్ పాం అభివృద్ధి పనులు కొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. రైల్వేస్టేషన్‌కు వచ్చిన సమయంలో ఏ బోగి ఎక్కడ నిలబడుతుందో ముందుగా సూచించే కోచ్ ఇండికేటర్‌లను ఏర్పాటు చేయలేదు. ప్లాట్‌పాంలలో ప్రయాణికులు కూర్చునేందుకు బల్లలు కుర్చీలు సరిపడా లేకపోవడంతో ప్రయాణికులు కొందరు నేల పైనే కూర్చునే పరిస్థితి ఏర్పడింది. . స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న అతిథి గృహాల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకల వివరా లు తెలిపే డిజిటల్ నేమ్ బోర్డులను ఏర్పాటు చేయ లేదు. మూడేళ్ళ క్రిందట ప్రారంభించిన పార్కులో ప్రస్తుతం పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగాయి. దీంతో ఆ పార్కు నిరుపయోగంగా తయారైంది. సంబందిత అఽధికారులు దృష్టి సారించి రైల్వే స్టేషన్‌లో సమస్యలను పరిష్కరించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.