తెల్లవారకముందే బార్లు బార్లా..!
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:14 AM
మార్కాపురంలో తెల్లవారితే పాలపాకెట్ల కోసం వెతుక్కోవాలేమో కానీ మద్యం మాత్రం పుష్కలంగా దొరుకుతుంది.

మార్కాపురం, జూన్ 26: మార్కాపురంలో తెల్లవారితే పాలపాకెట్ల కోసం వెతుక్కోవాలేమో కానీ మద్యం మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. ప్రజలకు నిత్యవసర వస్తువు గా మద్యం మారినట్లు బార్‌అండ్ రెస్టారెంటు యజమానులు కొందరు ప్రభుత్వ నిబంధనలంటూనే విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. గతంలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకూ అధికారికంగా, రాత్రి 11 నుంచి ఉదయం 10 వరకూ రహస్యంగా మద్యం విక్రయాలు జరుగు తుండేవి. కానీ ఐదేళ్ల వైసీపీ పాలనలో మద్యం విక్రయా లకు విధి విధానాలు మారాయి. ప్రైవేటు మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వ దుకాణాలు వచ్చాయి. ఆయా దుకాణాల లో మధ్య విక్రయాలకు నిబంధనలను తూ.చ తప్పక అమలు చేస్తున్న ఎస్‌ఈబీ అధికారులు ప్రైవేటు బార్ అండ్ రెస్టారెంట్ల విషయంలో ఓ సెటిల్‌మెంట్‌కు వచ్చారు..! దీంతో వైసీపీ హయాంలో ఉన్న ఆనవాయితీనే ఇప్పుడు కొనసాగిస్తుండడం గమనార్హం.
తెల్లారకముందు నుంచే...
మార్కాపురం తెల్లవారు జామున 4 గంటల నుంచే బార్ అండ్ రెస్టారెంట్ల కౌంటర్లలో మద్యం విక్రయాలు ప్రారంభమౌతున్నాయి. ముఖ్యంగా కంభం రోడ్డులోని ఓ రెస్టారెంటులో ప్రధాన కౌంటర్‌కు తాళం వేసి కిచెన్ వద్ద ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తున్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న ఓ బార్‌అండ్ రెస్టారెంటులో ప్రధాన కౌంటర్‌లోనే విక్రయాలు సాగిస్తున్నారు. అక్కడ ప్రధాన వాకిలికి మాత్రం తాళం వేసి ఉంచుతారు. పక్కనే ఉన్న చిన్నగేటు నుంచి మద్యంప్రియులు వెళ్లి సేదతీరుతున్నారు. ఇలా ఒకటేమిటి మార్కాపురంలోని అన్నీ బార్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
లంచాల మత్తులో ఎస్‌ఈబీ అధికారులు
మద్యం అక్రమ విక్రయాలు, నిబంధనల మేరకు బార్లు, రెస్టారెంట్ల నిర్వహణ, మద్యం సరఫరా వంటి వాటిని నియంత్రించాల్సిన ఎస్‌ఈబీ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకా ణాల ఏర్పాటుతో అసలే తమ లంచాల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిందని, బార్ల జోలికి వెళ్తే అసలేం ఉండదనే భావనలో ఎస్‌ఈబీ అధికారులు ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు వైసీపీ పాలనాకాలంలో రాజకీయ నాయకుల ఒత్తిడి కూడా వారిని ఆవైపు కన్నెత్తి చూడకుండా చేసింద నే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇకనైనా ఎస్‌ఈబీ అధికారులు స్వలాభేపేక్షను విడిచి వారి ఉద్యోగం వారు స్వేచ్ఛగా చేస్తే తప్ప వ్యవస్థలో వారికున్న చెడ్డ పేరు తొలగిపోదనేది సత్యం.