Share News

జనసేనలో చేరిన బాలినేని, రవిశంకర్‌

ABN , Publish Date - Sep 27 , 2024 | 12:09 AM

మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యాపారవేత్త కంది రవిశంకర్‌ గురువారం వేర్వేరుగా జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కండువాలు కప్పి వారిని పార్టీలో ఆహ్వానించారు.

జనసేనలో చేరిన బాలినేని, రవిశంకర్‌
బాలినేనిని పార్టీలోకి ఆహ్వానించిన పవన్‌, పవన్‌తో రవిశంకర్‌

అనుచరులతో వెళ్లిన మాజీమంత్రి

కూటమి పార్టీలతో కలిసి పనిచేస్తా

జగన్‌ ఏకపక్ష నిర్ణయాలతో ఇబ్బంది పడ్డా

ఒంగోలులో భారీ ర్యాలీ చేసిన వ్యాపారవేత్త కంది

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యాపారవేత్త కంది రవిశంకర్‌ గురువారం వేర్వేరుగా జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కండువాలు కప్పి వారిని పార్టీలో ఆహ్వానించారు. పార్టీ ఆదేశం మేరకు ఒక్కొక్కరే జనసేనలో చేరినప్పటికీ తదుపరి వారి అనుచరులను కూడా చేర్చుకునే కార్యక్రమాలు చేపట్టనున్నారు. వైసీపీకి గుడ్‌బై చెప్పిన బాలినేని భారీ వాహనాలలో అనుచరులు వెంటరాగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. కంది రవిశంకర్‌ ఒంగోలులో అనుచరులతో ర్యాలీ నిర్వహించి, ఆ తర్వాత కుటుంబసభ్యులతో మాత్రమే జనసేన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జనసేన నాయకత్వం నిర్ణయించిన మేరకు బాలినేనితోపాటు మరో ఇద్దరు, ముగ్గురు నాయకులతో వెళ్లారు. పవన్‌ కల్యాణ్‌ తొలుత బాలినేనిని పార్టీలోకి చేర్చుకుని ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత గొర్రెపాటి శ్రీనివాసరావుతోపాటు కార్పొరేటర్‌ భర్త తిరుమలరావును బాలినేని పవన్‌ కల్యాణ్‌కు పరిచయం చేయగా వారు కూడా పార్టీలో చేరారు. వ్యాపారవేత్త రవిశంకర్‌, తన వియ్యంకుడు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్యతో కలిసి పార్టీలో చేరారు. ఆ తర్వాత రవిశంకర్‌ తన ఇద్దరు కుమారులు విష్ణుమోహన్‌, సాయినాథ్‌లను పవన్‌ కల్యాణ్‌కు పరిచయం చేశారు. బాలినేని వెంట ఒంగోలు నియోజకవర్గానికి చెందిన వైసీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో వెళ్లారు. సుమారు 10మందికిపైగా కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, బాలినేని అనుచరులు ఆయన వెంట వెళ్లిన వారిలో కనిపించారు.


కూటమితో కలిసి పనిచేస్తా

పార్టీలో చేరిన అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీ నేతలను కలుపుకొని ముందుకు పోతానని, తనపై జరుగుతున్న కొన్ని అసత్యప్రచారాలు, చిన్న వివాదాలు సర్దుకుంటాయని చెప్పారు. ఇక నుంచి అధినేత పవన్‌ ఏది చెబితే అది చేస్తా. ప్రకాశం జిల్లాలో జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్తా, టీడీపీ, బీజేపీ నేతలతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డికి తన లాంటి సీనియర్‌ నేతలంటే లెక్కలేదని వ్యాఖ్యానించారు. ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు మనసుకు కష్టం కలిగించాయన్నారు. గతంలో జగన్‌ మంత్రివర్గ విస్తరణలో అందరినీ మారుస్తానని చెప్పి తనలాంటి కొందరిని మార్చి అవమానించారు.

ప్రజాసేవ కోసమే...

వ్యాపారవేత్త రవిశంకర్‌ మాట్లాడుతూ ప్రజాసేవ చేయాలన్న దృఢమైన లక్ష్యంతోటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ కూటమి పార్టీలతో కలిసి ప్రభుత్వ సేవా కార్యక్రమాలలో భాగస్వామిని అవుతానని చెప్పారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, ఇతర నేతలతో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు.

Updated Date - Sep 27 , 2024 | 12:09 AM